పేదలకు ‘పట్టా’భిషేకం | cm distributing the house rails for poor peoples | Sakshi
Sakshi News home page

పేదలకు ‘పట్టా’భిషేకం

Published Fri, Jun 5 2015 1:14 AM | Last Updated on Wed, Jul 25 2018 2:52 PM

పేదలకు ‘పట్టా’భిషేకం - Sakshi

పేదలకు ‘పట్టా’భిషేకం

- నేడు ప్రారంభించనున్న సీఎం
- జంట జిల్లాల్లో 81,777 మందికి
- పట్టాల పంపిణీ
- ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
సాక్షి, సిటీబ్యూరో:
  గ్రేటర్‌లోని పేద ప్రజల చిరకాల వాంఛ నేరవేరబోతోంది. వారి సొంతింటి కల సాకారం కాబోతోంది. వారందరికీ ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం ఎట్టకేలకు ముహుర్తం ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ శుక్రవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎన్‌బీటీ నగర్‌లో 7 వేలకు పైగా కుటుంబాలు, మల్కాజిగిరి నియోజకవర్గంలోని 3,300 మందికి పట్టాలు అందజేస్తారు. పాతబస్తీలోని వివిధ మండలాల పరిధిలో గుర్తించిన పట్టాదారులకు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ పట్టాలను పంపిణీ చేస్తారు.

అంబర్‌పేట్‌లోని అలీ కేఫ్ ఏకే ప్లాజా ఫంక్షన్ హాల్‌లో మలక్‌పేట్ నియోజకవర్గానికి చెందిన  114 మందికి... అంబర్‌పేట్ నియోజకవర్గంలోని 503 మందికి, చార్మినార్‌లోని 112 మందికి మహమూద్ అలీ పట్టాలు అందిస్తారు. కంచన్‌బాగ్ డీఆర్‌డీఎల్ చౌరస్తాలోని న్యూ నేషనల్ ఫంక్షన్ హాల్‌లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని 393 మందికి... యాకత్‌పురలోని 161 మందికి, బహదుర్‌పురాలోని 26 మందికి, రహీంపురలోని ఎస్‌కే ఫంక్షన్ హాలులో నాంపల్లి నియోజకవర్గంలోని 381 మందికి, కార్వాన్‌లోని 793 మందికి, గోషా మహల్‌లోని 174 మందికి ఆయన పట్టాలు అందజేస్తారు.

ముషీరాబాద్ నియోజకవర్గంలోని 1186 మందికి లోయర్ ట్యాంక్ బండ్‌లోని తెలగ, బలిజ, కాపు భవన్‌లో హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పట్టాలు అందజేస్తారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని 7,817 మందికి స్థానిక ఎన్‌బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో... జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని 5,314 మందికి యూసుఫ్‌గూడ చౌరస్తాలోని సవేరా ఫంక్షన్ హాలులో మంత్రి నాయిని పట్టాలను పంపిణీ చేయనున్నారు.

సికింద్రాబాద్‌లోని తహశీల్దార్ కార్యాలయంలో సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని 495 మందికి వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇళ్ల పట్టాలు అందజేస్తారు.

మారేడుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని 1910 మందికి ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు  పట్టాలుఅందజేయనున్నారు. తిరుమలగిరిలోని గాంధీ కమ్యూనిటీ హాలులో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 646 మందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు.

జంట జిల్లాల్లో 81,777 పట్టాలు
నగరంలో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా భావించిన సర్కారు.. 125 చదరపు గజాలలోపు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లోని కట్టడాలను క్రమబద్ధీకరించింది. జంట జిల్లాల్లో మొత్తం 81,777 పట్టాలు పంపిణీ చేయనుంది. హైదరాబాద్ జిల్లాలో జీవో 58 కింద 61,461 ఉచిత దరఖాస్తులను యంత్రాంగం స్వీకరించింది. అర్జీల వడపోత,  క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 20,025 మందిని అర్హులుగా గుర్తించి... పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ స్థలాలు, కోర్టు కేసులు, ఖాళీ స్థలాలు, రక్షణ, అటవీ శాఖ, వక్ఫ్ భూముల్లో వెలసిన ఇళ్లకు సంబంధించి 36,945 దరఖాస్తులను పక్కన పెట్టింది. రంగారెడ్డి జిల్లాలో 1,49,471 దర ఖాస్తులను పరిశీలించిన యంత్రాంగం 73,284 ఇళ్లు క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా తేల్చింది. ప్రస్తుతం 61,752 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది.  

అసైన్డ్ పట్టాలే..
125 గజాలలోపు ఇళ్లకు ఉచితంగా యాజమాన్య హక్కులు కల్పిస్తున్న సర్కారు... వీటిని అనుభవించుకోవడానికే తప్ప అమ్ముకోవడానికి వీల్లేదని నిషేధం విధించింది. ఉచిత కేటగిరీలోని ఇళ్లకు అసైన్డ్ పట్టాలను జారీ చేస్తోంది. దీంతో విక్రయానికి చట్టం అనుమతించదు. ఒకవేళ జీఓ 59 కింద చెల్లింపు కేటగిరీలోకి మారినా/వర్తించినా వాటి క్రయ విక్రయాలకు ఇబ్బంది ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement