
సీఎం వ్యవసాయ క్షేత్రం కోసమే ప్రాజెక్టు
మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కాళేశ్వరం : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రానికి నీటిని తరలించేందుకే మేడిగడ్డ బ్యారేజీ ప్రాజెక్టును నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం ఉదయం మహాశివరాత్రిని పురస్కరించుకొని కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మంథని నియోజకవర్గంలోని ఒక్క ఎకరం భూమి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంతో ముంపుకు గురైనా పార్టీ పక్షాన సహించేదిలేదని అన్నారు. రూ,500 కోట్ల కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం పనులను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. సుమారు 50శాతం పనులు జరిగాయన్నారు. కాళేశ్వర క్షేత్రానికి టూరిజం ప్లానింగ్ కింద నిధులు తీసుకొచ్చింది తమ ప్రభుత్వమేనని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో ఎంత భూమి ముంపుకు గురవుతుంది, రైతులకు చెందిన ఎన్ని ఎకరాలు నష్టపోతున్నారో సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు..ఆయన వెంట మహదేవపూర్ సర్పంచ్ కోట రాజబాబు, కాటారం ఎంపీటీసీ సమ్మయ్య, నాయకులు చల్లా తిరుపతిరెడ్డి, విలాస్‌రావు, వామన్‌రావు, సట్ల మురళి, శశిభూషన్ కాచే, కొత్త శ్రీనివాస్, శకీల్, గీతామాయ్, రాణీబాయ్, మిల్కమ్మ ఉన్నారు.