సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ గడువు తీరనున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ శరవేగంగా పావులు కదుపుతోంది. రిజర్వేషన్ల జాబితా వెలువడిన మరుక్షణం నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన అధిష్టానం.. అభ్యర్థుల ఖరారు బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ భవన్‌లో గురువారం ఎమ్మెల్యేలు, ఇంచార్జులతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భేటీ అయ్యారు. బీ ఫారాల జారీ, గెలుపు వ్యూహాలపై దిశా నిర్దేశం చేయనున్నారు.
ఈ క్రమంలో ఆయన ఉదయం పదిన్నర గంటలకే తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అయితే ఈ సమావేశానికి కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు రోజు రాత్రే హైదరాబాద్‌కు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎందుకు ఆలస్యంగా వచ్చారంటూ మండిపడ్డారు. ఇక సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారిలో మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్‌రెడ్డి ఉన్నారు.(టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు!)
కాగా మున్సిపోల్స్‌లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో బీ ఫారాలను కూడా వారి చేతికే అందజేయాలని పార్టీ నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికలో విపక్ష పార్టీలు అనుసరిస్తున్న తీరు, ప్రచార వ్యూహంపై సేకరించిన సమాచారం ఆధారంగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రచార శైలిపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఇంచార్జులకు ఏ ఫారాలు, బీ ఫారాలు అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment