22 వరకే అసెంబ్లీ సమావేశాలు | Assembly meetings up to 22 | Sakshi
Sakshi News home page

22 వరకే అసెంబ్లీ సమావేశాలు

Published Thu, Nov 6 2014 2:57 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

22 వరకే అసెంబ్లీ సమావేశాలు - Sakshi

22 వరకే అసెంబ్లీ సమావేశాలు

నెలాఖరుదాకా పొడిగించాలి: కాంగ్రెస్, టీడీపీ

* బీఏసీలో టీడీపీ సభ్యుల సంఖ్యపై స్వల్వ వాగ్వాదం
* కుదరని ఏకాభిప్రాయం
* నీది నోరు కాదా?: కేసీఆర్‌ను ప్రశ్నించిన ఎర్రబెల్లి

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 22 దాకా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటైనందున ఎన్నో అంశాలు చర్చించాల్సి ఉండడంతో ఈ నెలాఖరుదాకా సభను పొడిగించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ  విషయంలో సర్కార్ ఏమీ స్పష్టత ఇవ్వకపోవడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. బుధవారం శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశమైంది. సభలు జరిపేరోజులు, బీఏసీలో టీడీపీ సభ్యులకు అవకాశం, రెండు వార్తా చానళ్ల  ప్రసారాలపై చర్చించారు.

శాసనసభను ఈ నెల 22 దాకా (14 రోజులు) నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, సభను ఈ నెలాఖరుదాకా నిర్వహించాలని ప్రతిపక్షనాయకుడు కె.జానారెడ్డి, టీడీపీ శాసనసభాపక్షనాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. శాసనసభా సమావేశాలు 100 రోజులు నిర్వహిస్తామని చెప్పి, కనీసం 50 రోజులైనా నడపకుంటే ఎట్లా అని వారు ప్రశ్నించారు.

డిసెంబర్ 2 లోగా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకోవాల్సి ఉందని, ఈ లోగానే శాసనసభా సమావేశాలను పూర్తిచేసుకుంటే సరిపోతుందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చెప్పారు. గతంలో కొన్నిసార్లు ఏడాదికి 32 రోజులే జరిగాయని ఆయన ఉదహరించారు. అయితే ఎక్కువ రోజులు జరిగి ఆదర్శంగా ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తక్కువ రోజులు జరిగిన దురదృష్టకర సమయాన్ని ఆదర్శంగా ఎలా తీసుకుంటారని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు.
 
బడ్జెట్ చదువుతుంటే..బయటికి పోతరా?: సీఎం కేసీఆర్  
దీంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జోక్యం చేసుకుంటూ ‘బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్నప్పుడే ప్రతిపక్షాలు సభ నుండి బయటకు వెళ్లినయి. ఇది బాధ్యతారాహిత్యమే. ఇలాంటి ప్రతిపక్షాలు డిమాండు చేస్తే సభను ఎందుకు పొడిగించాలి? సభలో ప్రతిపక్షాలు వ్యవహరించే తీరు, ప్రజల సమస్యలపై చర్చ జరిగే విధానాన్ని బట్టి సభను పొడిగించే విషయంపై నిర్ణయం తీసుకుందాం. ప్రజల సమస్యలపై ఎన్ని రోజులైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సభా పొడిగింపుపై మరోసారి సమావేశం అవుదాం’ అని ప్రతిపాదించారు. సభను ఎప్పటిదాకా పొడిగిస్తారో స్పష్టంగా ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండు చేసినా అధికార పార్టీ అంగీకరించలేదు.

టీడీపీ నుంచి ఒక్కరికేనా?: ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి
బీఏసీ సమావేశానికి టీడీపీ నుండి ఒక్కరికే ఎలా అవకాశం ఇస్తారంటూ టీడీపీ సభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎ.రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒక్కరు, ఇద్దరు సభ్యులున్న పార్టీ నుంచి ఒక్కరిని బీఏసీ సమావేశానికి ఆహ్వానించి, 15 మంది సభ్యులున్న టీడీపీ నుంచి కూడా ఒక్కరికే  అంటే ఎలా అని వారు నిలదీశారు.‘టీఆర్‌ఎస్‌కు 10 మంది సభ్యులున్నప్పుడు కూడా ఇద్దరు సభ్యులు బీఏసీ సమావేశానికి వచ్చారు. ఇప్పుడు 60 మంది సభ్యులుంటే ఆరుగురు వస్తున్నారు. కొన్ని పార్టీలకు ఒక్క సభ్యుడే ఉంటే ఆ ఒక్కరిని బీఏసీకి పిలుస్తున్నరు.

టీడీపీకి 15 మంది సభ్యులుంటే ఒక్కరినే పిలుస్తారా?’ అని ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి అడిగారు. టీడీపీ సంఖ్యాబలం ప్రకారం ఒక్కరే బీఏసీ సమావేశానికి రావాలని, రెండో సభ్యునికి అవకాశం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘గత సమావేశంలో దీనిపై చర్చ జరిగినప్పుడే ప్రత్యేక ఆహ్వానితునిగా నా పేరు రాసుకోవాలని అన్నారు. గతంలోని మినిట్స్ తెప్పించి చూడండి. మాకు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. చట్టబద్ధమైన హక్కు కోసమే మాట్లాడుతున్నం. 60 మంది సభ్యులున్న టీఆర్‌ఎస్ నుండి సీఎం కేసీఆర్‌తో కలిపి ఆరుగురు వస్తున్నరు. మాకు ఒక్కరికే ఎలా అవకాశం ఇస్తారని స్పీకర్‌ను అడుగుతున్నం.

ఈ కమిటీలో అధికార పార్టీ వారు కూడా సభ్యులే. దీనికి స్పీకరే సమాధానం చెప్పాల్సి ఉంటుంది’ అని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ శాసనసభాపక్షనేత డాక్టర్ కె.లక్ష్మణ్ జోక్యం చేసుకుంటూ ‘ప్రత్యేక ఆహ్వానితునిగా రేవంత్ రెడ్డి ఉంటారని మీరే(సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) చెప్పారుగా..? ఇంకా దీనిపై చర్చ ఎందుకు?’ అని ప్రశ్నించారు. సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి జోక్యం చేసుకుని ‘గతంలో చెప్పిన దాని ప్రకారం ఉంటే సరిపోతుంది’ అన్నారు. ఈ సందర్భంలోనే ఎర్రబెల్లి దయాకర్‌రావు  ప్రత్యేక ఆహ్వానితునిగా రేవంత్‌రెడ్డి ఉంటారని కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఇప్పుడు మాటమార్చి వ్యతిరేకిస్తున్నారు. అది నోరేనా..?’ అని ప్రశ్నించారు.దీనిపై ఉభయపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ టీడీపీ రెండో సభ్యుని విషయంలో ప్రభుత్వం అంగీకరించలేదు.

చానళ్లపై నిషేధంతో సర్కార్‌కు సంబంధం లేదు
రెండు టీవీ చానళ్ల (టీవీ9, ఏబీఎన్) ప్రసారాల నిలిపివేతపై ఎర్రబెల్లి, జానారెడ్డి ప్రస్తావించారు. ప్రభుత్వం ఇంకా అణచివేతను, పరోక్ష నిషేధాన్ని కొనసాగించడం సరికాదన్నారు. దీంతో ఆ చానళ్ల నిలిపివేతపై ప్రభుత్వానికి సంబంధం లేదని సీఎం కేసీఆర్ బదులిచ్చారు. ప్రభుత్వం అనధికారికంగా ఎంఎస్‌ఓలను బెదిరిస్తున్నదని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. ఆ చానళ్లపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌కు గత సమావేశాల్లో అసెంబ్లీ అధికారం అప్పగించిందని, ఇంకా ఎప్పటికి నిర్ణయం తీసుకుంటారని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు.

ఈ సమావేశాలు పూర్తయ్యేలోగా ఆ చానళ్ల వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ మధసూదనాచారి ప్రకటించారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య, మంత్రులు టి.హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి(టీఆర్‌ఎస్) కె.జానారెడ్డి, జి.చిన్నారెడ్డి(కాంగ్రెస్), ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎ.రేవంత్ రెడ్డి(టీడీపీ), డాక్టర్ కె.లక్ష్మణ్(బీజేపీ), అక్బరుద్దీన్ ఒవైసీ(మజ్లిస్), టి.వెంకటేశ్వర్లు(వైఎస్సార్ కాంగ్రెస్), సున్నం రాజయ్య(సీపీఎం), రవీంద్ర కుమార్(సీపీఐ) పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement