ప్రారంభం.. ప్రేమ.. పౌరుషం | CM KCR inauguration of Water Grid Pylon in Choutuppal | Sakshi
Sakshi News home page

ప్రారంభం.. ప్రేమ.. పౌరుషం

Published Tue, Jun 9 2015 3:55 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM

ప్రారంభం.. ప్రేమ.. పౌరుషం - Sakshi

ప్రారంభం.. ప్రేమ.. పౌరుషం

జిల్లాలో మరోమారు సీఎం పర్యటన పూర్తి
 ఆవిష్కరణలు, శంకుస్థాపనల తో ప్రారంభం
 బహిరంగసభలో జిల్లా ప్రజలపై ఉన్న ప్రేమను చెప్పిన కేసీఆర్
 నల్లగొండ బాధ... నా గుండె లోతుల్లో ఉందని వ్యాఖ్య
 అదే సభలో చంద్రబాబుపై పౌరుషాన్ని చూపిన సీఎం
 దామరచర్లలో 4వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
 చౌటుప్పల్‌లో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణ
 ఎన్జీ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభలో ప్రసంగం

 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఆవిష్కరణలతో సోమవారం ప్రారంభమైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటన ప్రేమతో సాగి పౌరుషంతో ముగిసింది. చౌటుప్పల్‌లో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణతోపాటు దామరచర్లలో నాలుగువేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం సోమవారం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో జిల్లాపై, ఇక్కడి ప్రజలపై తన వాత్సల్యాన్ని కనబరిచారు. నల్లగొండ బాధ.. తన గుండె లోతుల్లో ఉందని చెప్పిన సీఎం.. జిల్లా ప్రజలకు కృష్ణా, గోదావరి నదీ జలాలను అందించి తీరుతానని శపథం చేశారు.
 
 నల్లగొండకు నీళ్లు తెచ్చి చూపిస్తా అని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత అదే సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ఆయన నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు వ్యవహారం నుంచి చంద్రబాబును ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని, ఒళ్లు దగ్గర పెట్టుకోకపోతే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. తొలుత హెలికాప్టర్‌లో చౌటుప్పల్ వచ్చిన ఆయన అక్కడ పైలాన్‌ను ఆవిష్కరించి నేరుగా దామరచర్ల మండలం వీర్లపాలెం వెళ్లా రు. అక్కడ పవర్‌ప్లాంటుకు శంకుస్థాపన చేసి హెలికాప్టర్‌లోనే నల్లగొండకు వచ్చారు. పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్‌కుమార్ నివాసంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన ఎన్జీ కళాశాల బహిరంగ సభలో ప్రసంగించి రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లిపోయారు.
 
 వరాల జల్లు..
 తన పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ జిల్లాకు వరాల జల్లు కురిపించారు. జిల్లా నలుమూలలా రైతాంగానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని చెప్పి, ఇందుకోసం రూపొందిస్తున్న ప్రాజెక్టుల గురించి వివరించారు. ఫ్లోరైడ్‌పీడిత ప్రాంతమైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు 6వేల కోట్ల రూపాయల వ్యయంతో శ్రీశైలం నుంచి నీటిని తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, ఈ ప్రాజెక్టుకు ఈనెల 12న శంకుస్థాపన చేస్తానని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి రేపో, యెల్లుండో ఉత్తర్వులు జారీ చేస్తానన్నారు. అదే విధంగా ఆలేరు, భువనగిరి ప్రాంతాలకు మెదక్ జిల్లాలో నిర్మించే కాళేశ్వరం (కొమరెల్లి మల్లన్న) ప్రాజెక్టు ద్వారా సాగు, తాగు నీరు అందిస్తామని, ఎస్సెల్బీసీ టన్నెల్‌ను పూర్తి చేయడం ద్వారా తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో కృష్ణా, గోదావరి నీళ్లను తీసుకువచ్చి నల్లగొండ జిల్లా ప్రజల పాదాలు కడుగుతామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
 దొడ్డుదొడ్డోళ్లు నీళ్లు తేలే
 జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా సీఎం కేసీఆర్ చురకలంటించారు.‘ ఈ జిల్లాలో నాకన్న నాలుగింతలు దొడ్డోళ్లు, పొడుగోళ్లున్నరు. ఈ దొడ్డుగున్నోళ్లకు పదవిలో ఉన్నన్ని రోజులు దోచుకోవడమే సరిపోయింది. వారు తినేందుకే సరిపోలేదు. మా జగదీశ్ పొట్టిగ, సన్నగ ఉం టడు. దొడ్డోళ్లు రెండో పంటకు సాగర్‌నీళ్లు తెచ్చిండ్రా... మా జగదీశ్ తెచ్చిండు. మా ఎమ్మెల్యేలు సన్నగుంటరు కాబట్టే హాస్టళ్లలో సన్నబియ్యం పథకం తెచ్చినం.’ అని చమత్కరిం చారు. సాయి సంసారి... లచ్చి దొంగ అన్నట్టు అధికారంలో ఉన్నన్నాళ్లు ఎలాంటి ఆలోచన చేయకుండా, ప్రజలను ఎలా దోచుకుందామా అని ఆలోచించిన నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
 
 ఆ70 ఫీట్ల స్థూపం.. నల్లగొండ కీర్తిపతాకం

 తెలంగాణ ప్రాంతమంతటికీ నల్లా నీళ్లు అం దించే వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో నిర్మించాలని పట్టుబట్టి చేశామని కేసీఆర్ చెప్పారు. ‘ ఆ 70 ఫీట్ల స్థూపం... నల్లగొండ కీర్తిపతాకను రెపరెపలాడించాలి.’ అని సీఎం అన్నారు. జగదీశ్ తన కుడిభుజమని చెప్పిన కేసీఆర్ ఆయనకు ఉద్యమ సోయి ఉంది కాబట్టే అహోరాత్రులు శ్రమించి తెలంగాణ ప్రజలకు 24 గంటల కరెంటు ఇస్తున్నాడని అభినందించారు. నల్లగొండ బాధ తాను గుండెల్లో పెట్టుకుని ఉద్యమ సందర్భంగా తెలంగాణ మూలమూలన చెప్పుకొచ్చానని, ఆ బాధ తనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని కేసీఆర్ అన్నారు. ఇక నుంచి తెలంగాణలో కరెంటు కోతలుండవని ఆంధ్రోళ్లు, కాంగ్రెసోళ్ల పవర్‌కట్ అయినంక, తెలంగాణ ప్రజలకు పవర్‌ఫుల్లుగా వస్తోందని అన్నారు. ‘ ఇక బేఫికర్, కరెంటు కోతలుండవు. తెలంగాణకు పట్టిన అరిష్టాలన్నీ తొలగిపోయాయి.’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
 వారు స్వయంప్రకటిత నాయకులు
 బహిరంగసభలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి మాట్లాడారు. 30 ఏళ్లు అధికారంలో ఉన్నోళ్లు, ముఖ్యమంత్రులు అవుతామని చెప్పుకున్న స్వయం ప్రకటిత నాయకులు జిల్లాకు ఏం ఒరగబెట్టారని ఆయన ప్రశ్నించారు. ఎవరూ కలకనని, ఊహించని పథకాలను టీఆర్‌ఎస ప్రభుత్వం అమలుచేస్తోందని, దామరచర్లలో పవర్‌ప్లాంటు పెట్టాలని కాంగ్రెసోళ్లు పొరపాటున వెయ్యేళ్లు బతికినా ఆలోచన చేయలేరని అన్నారు. బహిరంగసభకు టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా, రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్, బాల్కసుమన్, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్‌కుమార్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, పూల రవీందర్, కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బాలూ నాయక్, మదర్‌డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, జిల్లా టీఆర్‌ఎస్ నేతలు దుబ్బాక నర్సింహారెడ్డి,  నోముల నర్సింహయ్య, తేరా చిన్నపురెడ్డి, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, వి. చందర్‌రావు, అమరేందర్‌రెడ్డి, కాసోజు శంకరమ్మ, లాలూ నాయక్, బడుగుల లింగయ్యయాదవ్, చాడా కిషన్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బుర్రి శ్రీనివాసరెడ్డి, మెరుగు గోపి, మాలె శరణ్యారెడ్డి లతో పాటు  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  
 
 సీఎం జిల్లా పర్యటన సమయ సూచిక
 ప్రదేశం    సీఎం వచ్చిన సమయం    వెళ్లిన సమయం
 చౌటుప్పుల్    4 :45 గంటలు    5 :5గంటలు
 దామరచర్ల    5:45 గంటలు    6 :10 గంటలు
 నల్లగొండ    7 :40 గంటలు    8 :40గంటలు
 నల్లగొండలో బహిరంగ సభ  జరిగే ప్రదేశానికి సీఎం7.36 గంటలకు చేరుకోగా..వేదిక మీదకు 7.38 గంటలకు చేరుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement