రేషన్‌ బదులు క్యాష్‌ బదిలీ! | CM KCR instructions to PSD officials on ration shops | Sakshi
Sakshi News home page

రేషన్‌ బదులు క్యాష్‌ బదిలీ!

Published Sat, Oct 21 2017 6:30 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

CM KCR instructions to PSD officials on ration shops - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రేషన్‌ షాపుల ద్వారా లబ్ధిదారులకు బియ్యం అందించడం ఉత్తమమా లేక డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌(డీబీటీ) విధానంలో వారికి నేరుగా నగదు బదిలీ చేయడం ఉత్తమమా అనే అంశంపై ఆలోచించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీలో అవకతవకలు, అక్రమాలను నిరోధించడంతోపాటు లబ్ధిదారులకు సంపూర్ణ ప్రయోజనం అందించడానికి అనువైన విధానం అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

రేషన్‌ డీలర్లు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘ఏటా రూ. 6,500 కోట్లు ఖర్చు పెట్టి పేదల కోసం రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. ఇందుకోసం అఖిల భారత సర్వీసు అధికారులతోపాటు ఎంతో మంది అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు.

ప్రభుత్వ యంత్రాంగం తలమునకలవుతోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితం రావట్లేదు. లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం, ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాకు మాఫియానే ఏర్పడింది. ఉన్నతాధికారులను కూడా మేనేజ్‌ చేసే స్థాయికి అక్రమ దందా సాగించేవారు ఎదిగారు. ప్రతిరోజూ పత్రికల్లో అక్రమ రవాణా అవుతున్న రేషన్‌ బియ్యం పట్టివేత వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు, వెలుగు చూస్తున్న అక్రమాలు మనోవేదన కలిగిస్తున్నాయి. ఇంత ఖర్చు చేసినా, ఎంతో శ్రమించినా చెడ్డపేరు వస్తున్నదనే బాధ కలుగుతోంది. ఈ పరిస్థితి పోవాలి. పేదల కోసం పెడుతున్న ఖర్చు నూటికి నూరు శాతం పేదలకే ఉపయోగపడాలి. ఇందుకోసం ఓ మంచి విధానం అమలు చేయాలి’’ అని అధికారులకు సూచించారు.

డీబీటీపై సీఎంకు వివరించిన అధికారులు...
దేశంలోని వివిధ చోట్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) అమలు విధానంలో మార్పులొచ్చాయని, ముఖ్యంగా రేషన్‌ షాపుల ద్వారా సరుకుల పంపిణీకి బదులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేసేందుకు డీబీటీ విధానం అమలవుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా హవేలి లాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లో పీడీఎస్‌ ద్వారా సబ్సిడీపై రేషన్‌ సరుకుల పంపిణీకి బదులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ చేస్తున్నారని నివేదించారు. ఈ తరహాలో నగదు బదిలీ విధానాన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని ప్రధాని మోదీ కూడా పిలుపునిచ్చారని తెలిపారు. 2013లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఆహార భద్రత చట్టంలోనూ సబ్సిడీల ద్వారా అందించే లబ్ధిని నగదు రూపంలో నేరుగా లబ్ధిదారులకు అందించాలనే సూచన ఉందని గుర్తుచేశారు. సరుకులకు బదులు నగదునే లబ్ధిదారులకు అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరించారు.

ప్రస్తుతం ఆహారం కోసం బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నామని, అదీ నిర్ణీత సమయంలో అందిస్తున్నామని చెప్పారు. బియ్యం కాకుండా నగదు అందిస్తే లబ్దిదారులు వారి ఆహార అలవాట్లకు అనుగుణంగా సరుకులు కొనుగోలు చేసుకుంటారని చెప్పారు. కాబట్టి రాష్ట్రంలో రేషన్‌ షాపుల ద్వారా అందించే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులకు బదులుగా అంతే మొత్తం నగదును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని వారు సీఎంకు సూచించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి... రేషన్‌ షాపుల ద్వారా బియ్యం అందించడం ఉత్తమమా? నగదును లబ్దిదారులకు నేరుగా అందించడం ఉత్తమమా అనే విషయంపై ఆలోచించాలని కోరారు. సమావేశంలో మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పౌర సరఫరాల సంస్థ కమిషనర్‌ సీవీ ఆనంద్, సీనియర్‌ అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, వాకాటి కరుణ, శాంత కుమారి, స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

డీలర్లు సమ్మె విరమించకుంటే లబ్ధిదారులకు నేరుగా నగదు...
రేషన్‌ డీలర్లు సమ్మె నోటీసు ఇచ్చినందున లబ్ధిదారులకు ఇబ్బంది కలగని విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. డీలర్లు సమ్మె ఆలోచన విరమించుకోకుంటే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సాధ్యం కాదు కాబట్టి దానికి సంబంధించిన నగదును నేరుగా లబ్ధిదారులకే అందించే ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement