
40వేల కోట్లు పెట్టుబడిగా పెట్టండి
* టాటా గ్రూప్ ప్రతినిధులతో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి రూ.40వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా తయారు చేసేందుకు సహకరించాలని సీఎం కేసీఆర్ టాటా గ్రూప్ ప్రతినిధులను కోరారు. టాటా పవర్ ఎండీ అనిల్ సర్ధనా, టాటామోటార్స్ గ్రూప్ ప్రతినిధులు రాహుల్ షా, దీపాంకర్ తివారీ, మధుకన్నన్ తదితరులు శుక్రవారం సచివాలయంలో సీఎంను కలిశారు.
నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాల మాదిరిగా తీర్చిదిద్దేందుకు ఇటీవల ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏరియా, టాటాగ్రూప్ వంటి సంస్థలు, సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీల పెట్టుబడులు అవసరమని కేసీఆర్ అన్నారు. టాటాగ్రూప్ సీఈవో మాట్లాడుతూ, వచ్చే రెండేళ్లలో తెలంగాణలో వెయ్యిమెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును నెలకొల్పుతామన్నారు.
బొగ్గు ఆధారిత ప్రాజెక్టులతో పాటు సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా వికేంద్రీకృత ఉత్పత్తి, పంపిణీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.