
సౌరవిద్యుత్‌తో మేలెంత?
అధ్యయనానికి సీఎం ఆదేశం
ప్రయోగాత్మకంగా పరిశీలన
పదేళ్లలో అన్ని పంపు సెట్లు మారుస్తాం: కిర్లోస్కర్ కంపెనీ ప్రతిపాదన
హైదరాబాద్: వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడం మేలా? లేక దాని స్థానంలో సౌర విద్యుత్ పంపుసెట్లను సమకూర్చడం మంచిదా అనే అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి సౌర విద్యుత్ పెంపుసెట్లను సమకూర్చే అంశంపై ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో ఇంధన, ఆర్థిక, వ్యవసాయశాఖల అధికారులతోపాటు, సౌర విద్యుత్ పంపుసెట్లు సమకూర్చేందుకు ముందుకు వచ్చిన కిర్లోస్కర్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రస్తుతం ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల ప్రతీ రోజు 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరాకోసం ప్రభుత్వంపై రూ.15 కోట్ల భారం పడుతోందని అధికారులు అంచనా వేశారు. అయితే దీనికి బదులుగా సౌర విద్యుత్ పెంపుసెట్లు వాడితే ఈ భారం తగ్గుతుందా అన్న దానిపైనే లెక్క తేల్చాల్సి ఉంది.
సౌర విద్యుత్ పంపుసెట్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.240 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ మొత్తం ఒకేసారి కాకుండా ప్రయోగాత్మకంగా వీటిని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు. విద్యుత్ కోతలు, సరఫరాలో అనిశ్చితి, విద్యుత్ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను అధిగమించేందుకు సౌర విద్యుత్‌తో నడిచే మోటారు పంపులు ఉపయోగకరంగా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తే, నిర్వహణ ఎంతవరకు ఆచరణ సాధ్యమన్న విషయం అనుభవంలోకి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమావేశంలో పాల్గొన్న కిర్లోస్కర్ కంపెనీ అసోసియేట్ ఉపాధ్యక్షుడు రాజేంద్ర వి.మహాజన్, జనరల్ మేనేజర్ అజయ్ శిరోడ్కర్‌లు మాట్లాడుతూ, ఏడాదిలో ప్రస్తుతం ఉన్న మోటార్లను తొలగించి లక్ష సౌర విద్యుత్ పంపుసెట్లను అమరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో రానున్న పదేళ్ల కాలంలో మొత్తం పంపుసెట్లను సౌర విద్యుత్‌తో నడిచే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పంపుసెట్ల మార్పిడికి సంబంధించి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం, రైతుల ఎలాంటి నిధులు చెల్లించాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. పదేళ్లపాటు ఈ మోటార్ల నిర్వహణ బాధ్యత కూడా తామే స్వీకరిస్తామని, పదేళ్ల తరువాత మోటార్లకు సంబంధించి డబ్బు చెల్లిస్తే సరిపోతుందని వారు ప్రతిపాదించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహా దారు బీవీ పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఇంధన, నీటిపారుదల శాఖల ముఖ్యకార్యదర్శి ఎస్.కె. జోషి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.
అధ్యయనానికి కమిటీ
సౌరశక్తితో నడిచే వ్యవసాయ మోటారు పంపుసెట్లకు సంబంధించి అన్ని విషయాలపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రి నలుగురు కార్యదర్శులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ప్రదీప్‌చంద్ర అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య సభ్యులుగా ఉంటారు.