
బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైని కలసి బడ్జెట్ ప్రసంగం ప్రతిని అందిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం పొందిన బడ్జెట్ ప్రసంగం ప్రతిని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌తో శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించారు. 6న గవర్నర్ ప్రసంగంతో శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 7న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అధికార, విపక్షాలు సభలో చర్చించనున్నాయి. 8న శాసనసభలో సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. ఈ విషయాలను సీఎం కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
పరిస్థితి అదుపులోనే ఉంది..
రాష్ట్రంలో కోవిడ్–19 మహమ్మరి ప్రవేశించిన నేపథ్యంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను సీఎం కేసీఆర్ గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం. పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమై ఉందని స్పష్టంచేసినట్టు సమాచారం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మంచి ఫలితాలిచ్చాయని, పారిశుద్ధ్యం మెరుగైందని, దీంతో అంటురోగాలు ప్రబలే అవకాశాలు సన్నగిల్లిపోయాయని గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం.