డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలొద్దు: కేసీఆర్ | cm kcr review meeting on drug rocket case | Sakshi
Sakshi News home page

డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలొద్దు: కేసీఆర్

Published Sun, Jul 16 2017 12:40 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలొద్దు: కేసీఆర్ - Sakshi

డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలొద్దు: కేసీఆర్

హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో పలుశాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ ఎంత మందికి నోటీసులు జారీ చేశారో, ఎంత మందిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారన్న వివరాలతో కూడిన డ్రగ్స్ రాకెట్ కేసు నివేదికను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్.. విచారణలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దని, దోషులుగా తేలితే ఎవరినీ వదిలిపెట్టొద్దని అకున్ సబర్వాల్ సహా ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ సమీక్షకు డీజీపీ అనురాగ్ శర్మ,  అకున్ సబర్వాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ కేసు విచారణకుగానూ అవసరమైతే మరికొంత మంది పోలీసుల సహాయం తీసుకోవాలని అకున్ సబర్వాల్‌కు కేసీఆర్ సూచించారు. సమిష్టి కృషి చేయడం వల్లే వీటిని రూపుమాపవచ్చునని, నార్కోటిక్ సహాయంతో కేసు విచారణ సులువుగా మారుతుందని పోలీసులకు కేసీఆర్ సలహా ఇచ్చారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ప్రధాన నిందితుడు కెల్విన్‌తో పాటు మహ్మద్ ఖద్దుస్, మహ్మద్ వాహిద్‌లను కస్టడీకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. నేటి సాయంత్రానికి వీరి సిట్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష జరిపారు. ఇప్పటికే కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పలువురిని అదుపులోకి ఎక్సైజ్‌ పోలీసులు విచారిస్తున్నారు.

పది రోజుల సెలవుపై వెళ్లాలన్న నిర్ణయాన్ని అకున్ సబర్వాల్ ఇదివరకే వెనక్కి తీసుకుని కేసు విచారణను వేగమంతం చేశారు. మరోవైపు డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిని ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్ అధికారులు విచారించనున్నారు. పలువురు సినీ ప్రముఖులకు ఈ కేసులో నోటీసులు అందడంతో పాటు మరికొందరి పేర్లు వెలుగుచూస్తాయని కథనాలు ప్రచారం కావడంతో ఇండస్ట్రీలో కలకలం రేగుతోంది. హైదరాబాద్‌లో పలు స్కూళ్లు, కాలేజీల విద్యార్థులతో పాటు సినీ సెలబ్రిటీలు, ఇతర రంగాలకు చెందినవారు డ్రగ్స్ కు బానిసైనట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement