సఫాయి అన్నా నీకు సలామ్‌..  | CM KCR Said That The Cut Off Wages Will Be Paid Back To The Sanitation Staff | Sakshi
Sakshi News home page

సఫాయి అన్నా నీకు సలామ్‌.. 

Published Tue, Apr 7 2020 2:14 AM | Last Updated on Tue, Apr 7 2020 10:53 AM

CM KCR Said That The Cut Off Wages Will Be Paid Back To The Sanitation Staff - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పారిశుధ్య సిబ్బందికి కోత విధించిన వేతనాలను తిరిగి చెల్లిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వారికి అదనంగా నగదు ప్రోత్సాహకం కూడా అందజేస్తామన్నారు. అలాగే కరోనా నియంత్రణ పోరులో కీలకంగా పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వారి మూలవేతనంలో 10 శాతాన్ని సీఎం ప్రోత్సాహకంగా ఇస్తామని పేర్కొన్నారు. కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

ఒకట్రెండు రోజుల్లో ఇస్తాం..
‘వైద్యులు, పోలీసు సిబ్బందితో పాటు కొంతమంది కరోనా నియంత్రణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. పారిశుధ్య కార్మికులు భుజాన రసాయనాలు తగిలించుకుని స్ప్రే చేస్తూ నగరాలు, పట్టణాలను అద్దంలా పెడుతున్నారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా 95,392 మంది ఉన్నారని గుర్తించాం. అందులో 43,661 మంది గ్రామపంచాయతీ కార్మికులు, 21,531 మంది మున్సిపాలిటీల సిబ్బంది, 2,510 మంది హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ సిబ్బంది, 27,690 మంది జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్నారు. వీరికి ఈ నెల వేతనం ఇచ్చే విషయంలో కొంత పొరపాటు జరిగింది. 10శాతం వేతనం కట్‌ అయింది. ఆ వేతనాన్ని ఒకట్రెండు రోజుల్లో జమ చేస్తం. దీంతోపాటు ముఖ్యమంత్రి ప్రోత్సాహకం కింద జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ సిబ్బందికి రూ.7,500 అదనంగా ఇస్తాం. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బంది రూ.5,000 ఇస్తాం. నేను గతంలో కూడా చెప్పాను. సఫాయి అన్నా నీకు సలామ్‌ అన్నా అని.. ఇప్పుడు కూడా చెబుతున్నా సఫాయి అన్నా నీకు సలామ్‌ అన్నా. తల్లిదండ్రుల తర్వాత మీరే గొప్ప వారు. కనిపించే దేవుళ్లు. మా సైనికులు మీరు. మేమిచ్చే డబ్బు తక్కువే. మిమ్మల్ని ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది.

భారతదేశ ధాన్యాగారంగా రాష్ట్రం 
బెంగాల్‌ నుంచి గన్నీ బ్యాగుల దిగుమతి కోసం ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో మాట్లాడిన. అక్కడి కేబినెట్‌ కార్యదర్శి మన సీఎస్‌తో మాట్లాడినరు. మనం సేకరించిన ధాన్యంలో 50–60 శాతాన్ని గన్నీ బ్యాగుల్లోనే ఇవ్వాలని ఎఫ్‌సీఐ నిబంధన ఉంది. వీటిని బెంగాల్‌లో తయారు చేయించి పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. మనకు ఏడు కోట్ల గన్నీ సంచులు కావాలని అడిగిన. సాధ్యం కాకుంటే ఎఫ్‌సీఐ వాళ్లు 100 శాతం ప్లాస్టిక్‌ బ్యాగులు తీసుకోవాల్సి ఉంటుంది. 40లక్షల ఎకరాల వరి పంట తెలంగాణలో తొలిసారిగా వస్తోంది. ఈ కరోనా లేకుంటే నేను డ్యాన్స్‌ చేసి సంబరపడేవాడిని. డబ్బులు లేకున్నా ధాన్యం, మక్కల కొనుగోళ్లకు రూ.30వేల కోట్లు సమీకరించినం. 7వేల సెంటర్లు పెట్టినం. తెలంగాణ ఇప్పుడు భారతదేశ ధాన్యాగారం అయిపోయింది. ఇంకా రెండడుగులు ముందుకుపోతే దేవాదుల, సీతారామ, పాలమూరు, కాళేశ్వరం పూర్తి అయితే ఒక కోటీ 30లక్షల ఎకరాల దాకా వరి సాగుకు తెలంగాణ చేరుకుంటది. ఈ గన్నీ బ్యాగుల పంచాయతీ ఎందుకని మన దగ్గరే రెండు మూడు కంపెనీలు పెట్టించండని మంత్రికి చెప్పిన. వారికి రాయితీలు, భూములు ఇచ్చి ఒకటి రెండు జ్యూట్‌ మిల్స్‌ పెట్టించమన్న.

రాజకీయాలకు నాలుగేళ్ల టైం ఉంది
ఈ సమయంలో చిల్లరగాళ్లు చేసే ప్రచారాలను పట్టించుకోకుండా సమాజం జాగ్రత్తగా ముందుకెళ్లాలి. కొన్ని పత్రికలు కూడా పిచ్చి రాతలు రాస్తున్నయ్‌. వైద్యులకు రక్షణేదీ.. అని రాస్తున్నయ్‌. పీపీఈ కిట్లు లేవా? 40వేలున్నయ్‌ మీకు తెలుసా? అవసరమనుకుంటే కేసులు కూడా పెడతం. ఎంతో చిత్తశుద్ధితో, ధైర్యంగా పనిచేస్తున్న వైద్యుల మనోధైర్యం కోల్పోయేలా వెకిలి వార్తలు రాస్తరా? ఈ సమయంలో ప్రభుత్వానికి, సమాజానికి ఉపయోగపడే వార్తలు రాయాలి. వారికి శిక్ష తప్పదు. మీరు రాసేదాంట్లో వాస్తవం లేదు. మీకే ఉందా బాధ్యత.. మాకు లేదా? ఈ సమయంలో కూడా 5లక్షల కిట్లు, లక్షలాది మాస్కులకు ఆర్డర్‌ ఇచ్చినం. మా హెల్త్‌ మినిష్టర్‌ కానీ మేం కానీ పడుకుంటున్నామా? నిద్ర లేని రాత్రులు గడుపుతున్నం. వైద్యం ఒక్కటే కాదు కదా? రాష్ట్రంలో అన్నీ చూసుకోవాలి. ఈ సమయంలో భుజానికి భుజం తోడయి ముందుకెళ్లాలి. ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా. వక్రబుద్ధి ఉన్నవాళ్లు సక్రమంగా మారాలి. తర్వాత మీ ఇష్టం. అది మీ ఖర్మ. మీకు కరోనా తగలాలని శాపం పెడుతున్నా. రాజకీయాలకు ఇంకా నాలుగేళ్లు టైం ఉంది. హైరానా ఎందుకు? ఇప్పటికైనా క్లీన్‌మైండ్‌ ఉండాలి. వీరికి సరైన సమయంలో సరైన శిక్ష ఉంటుంది.

ఆ శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే వీళ్లు ప్రజాద్రోహులు, దేశద్రోహులు. మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా ఆగాలి. కేసీఆర్‌ చెబితే ఖతర్నాక్‌ ఉంటది. మామూలుగా చెప్పడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఇప్పుడు నేను చెపుతున్నవన్నీ కుత్సిత, చిల్లర బుద్ధితో అసత్యాలు ప్రచారం చేస్తున్న వారికి మాత్రమే. దీన్ని మీడియా కూడా సహించవద్దు. దేశ ఐక్యత కోసం పనిచేసే వాళ్లు ఈ సమయంలో గొప్పవాళ్లు కానీ వెకిలి మకిలి ప్రయత్నాలు చేసేవారు కాదు. ఆ త్యాగధనుల కాళ్లు కడిగి నెత్తిన పోసుకోవాలి. మీడియాలో కూడా మంచి వార్తలు రాసేవాళ్లున్నరు. వాళ్లకు దండం పెడతం, రెండు కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటం. పెద్దలు, బుద్ధిజీవులు, కవులు మంచి సాహిత్యం వెలువరించాలి. ప్రస్తుతం మానవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే వైతాళికులు కావాలి. చిల్లర రాజకీయం, చిల్లర ప్రచారం, చిల్లర పేపర్లు కాదు. అల్పులు, గొప్పవాళ్లు ఇలాంటి సందర్భంలోనే బయట పడతారు. బీడీలు చుట్టే ఓ మహిళ, రేషన్‌ బియ్యాన్ని పంచిన మరో మహిళ.. ఇలాంటి వాళ్లకు పాద పూజ చేసి, రాష్ట్ర అవతరణ సమయంలో అవార్డులు కూడా ఇవ్వాలి. జిల్లాల్లో కష్టపడి పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకంగా కొంత నగదు ఇస్తాం. 24 గంటలు కష్టపడే వాళ్లకు కొంత నగదు ఇచ్చేందుకు కలెక్టర్లకు నిధులిస్తాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement