శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో జరిగిన ప్రజాకృతజ్ఞత సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, సూర్యాపేట: ‘హుజూర్‌నగర్ ముద్దుబిడ్డలకు రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, టీఆర్‌ఎస్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు అందిం చిన విజయం తప్పకుండా మాలో ఉత్సాహాన్ని, సేవా భావాన్ని పెంచడంతోపాటు మరింత అంకితభావంతో పనిచేసే స్ఫూర్తి కలిగించింది. ఇది మామూలు విజయం కాదు. ఎన్నో అపోహలు, అనుమానాలు, అపవాదులు, ఎన్నో నీలాపనిందలు అన్నింటినీ విశ్లేషణ చేసి మీరు నీళ్లేవో.. పాలేవో తేల్చిచెప్పారు. బల్లగుద్ది మరీ హుజూర్ నగర్ తీర్పు చెప్పింది. అందుకు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నా’అని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహిం చిన ప్రజా కృతజ్ఞత సభకు ముఖ్యఅతిథిగా హాజరై కార్య కర్తలు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రోడ్డు మార్గం ద్వారా హుజూర్‌నగర్ చేరుకున్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ వెంట వెయ్యికిపైగా వాహనాలు వచ్చాయి. ఈ సభలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
మీరిచ్చిన ఫలితానికి సరిసమానంగా అభివృద్ధి..
హుజూర్‌నగర్‌లో 141 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో ఏడు మండల కేంద్రాలను తీసేస్తే 134 గ్రామ పంచాయతీలు ఉంటాయి. మీరు ఎలా అయితే ఉవ్వెత్తున ఉత్సాహపరిచే ఫలితం ఇచ్చారో దానికి సరిసమానంగా సైదిరెడ్డి నాయకత్వంలో హుజూర్‌నగర్ అద్భుతమైన నియోజకవర్గం అనే పరిస్థితి రావాలి. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధుల నుంచి మంజూరు చేస్తున్నా. రేపో, ఎల్లుండో జీఓ విడుదల చేస్తాం. అలాగే ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షలు మంజూరు చేస్తున్నాం. హుజూర్‌నగర్ మున్సి పాలిటీకి సీఎంగా నా నిధుల నుంచి రూ. 25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నా. హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో కొంత పోడుభూముల సమస్య ఉంది. దీనిపై అన్ని జిల్లాలకు నేనే వెళ్తున్నా. మొత్తం మంత్రివర్గం వచ్చి ప్రజాదర్బార్ పెట్టి కొద్దిరోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తుంది.
3 ఫీట్లు జగదీశ్‌రెడ్డి కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు..
హుజూర్‌నగర్‌ను అభివృద్ధి బాటలో పెట్టడానికి వచ్చా. మాటలు మాట్లేడేవారు దుర్మార్గంగా ఆరోపణలు చేశారు. జగదీశ్‌రెడ్డి మూడు ఫీట్లు లేడని మాట్లాడారు. ఆయన ఎంత ఉన్నాడో అంతే ఉన్నడు. కానీ ఇక్కడ ఏడు ఫీట్లు ఉన్న మంత్రులు చాలా మంది చేసింది చెబితే మీరు (ప్రజలు) నవ్వుతారు. కానీ ఇవ్వాళ మూడు ఫీట్లు ఉన్న మంత్రి 300 కి.మీ. దూరాన ఉన్న కాళేశ్వరం నుంచి నీళ్లు తెచ్చి పెన్‌పహాడ్ మండలంలోని చివరి గ్రామాలు, తుంగతుర్తి వరకు, నడిగూడెం, కోదాడ వరకు జిల్లా భూములను పునీతం చేస్తుండు. రూ. 30 వేల కోట్లతో నిర్మాణమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా విద్యుత్ ప్లాంట్‌ను దామరచర్ల మండలానికి తెచ్చాడు. ఇది పూర్తయితే ఈ జిల్లా ఆర్థిక ముఖచిత్రమే మారుతుంది.
సాగర్ ఆయకట్టును కాపాడుకుంటాం..
నాగార్జునసాగర్ ఆయకట్టును నల్లగొండ జిల్లాలో కాపాడుకోవాలి. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును తీసుకున్నాం. దీని ద్వారా ఖమ్మం జిల్లా ఆయకట్టు బాధలు తొలగుతాయి. నల్లగొండ జిల్లాలోని ఆయకట్టు బాధలు శాశ్వతంగా పోవాలి. దీనికోసం గోదావరి నీళ్లు సాగర్ ఎడమ కాలువలో పడాలి. ఈ నీళ్లతో రెండు పంటలు ఏటా పండాలి. ఇందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. నాలుగేళ్లు అహోరాత్రాలు పనిచేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతమైంది. ఇప్పుడు కేసీఆర్ దెబ్బ సాగర్ ఆయకట్టుపై పడుతుంది. కచ్చితంగా తిరుగుతా. ఎమ్మెల్యేలను వెంటవేసుకొని వచ్చే 15–20 రోజుల్లో నేనే స్వయంగా వచ్చి కోదాడ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరకు పర్యటన చేస్తా. ప్రజలను, రైతులను కలుస్తా. ఈ బడ్జెట్‌లో, వచ్చే బడ్జెట్‌లో కొన్ని నిధులు మంజూరు చేసి శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తాం. ఏ ఎత్తిపోతలు కావాలో అన్నీ మంజూరు చేస్తాం. కాలువల లైనింగ్‌లు చేస్తాం. ఈ పనుల్నీ త్వరలో జరుగుతాయి. నవంబర్ మొదటి వారంలో జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇంజనీరింగ్ నిపుణులు, నాగార్జునసాగర్ సీఈ నర్సింహతో తిరిగి పరిశీలించాలి.
ఎత్తిపోతల రైతాంగానికి శుభవార్త..
ఐడీసీ, నీటిపారుదలశాఖ కింద ఎత్తిపోతల బాధ్యతలు సొసైటీలు, ఎన్జీఓల పరిధిలో ఉన్నాయి. రైతులపై పైసా భారం లేకుండా వాటన్నింటినీ ప్రభుత్వమే టేకోవర్ చేస్తుంది. అందులోని సిబ్బందినీ ప్రభుత్వమే తీసుకుంటుంది. వారి జీతభత్యాలూ ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రంలోని 600 ఎత్తిపోతలకు ఈ ఉపశమనం ఉంటుంది. రైతాంగమంతా సంతోషిస్తుంది. హుజూర్‌నగర్ ప్రజా కృతజ్ఞత సభ వేదికగా తెలంగాణ రైతాంగానికి ఈ శుభవార్త చెబుతున్నా.
కర్రు కాల్చి వాత పెట్టారు..
సైదిరెడ్డికి మీరు (ప్రజలు0 40 వేలకుపైగా మెజారిటీ ఇచ్చారు. కొందరు దుర్మార్గులు ఆయనది గుంటూరు జిల్లా అన్నారు. ఆయనది గుంటూరు జిల్లా కాదు కాబట్టే మీరు కర్రు కాల్చి వాత పెట్టారు. మీ అందరి దీవెనలు ఇలానే ఉంటే ఎవరు ఏమన్నా భయపడకుండా, వెరవకుండా ఇంకా మరిన్ని సేవలు చేస్తాం. మళ్లీ వచ్చినప్పుడు జానపహాడ్ దర్గా, మట్టపల్లి ఆలయం దర్శనం చేసుకుంటా. ఈ రెండు పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తాం. కులాలు, మతాలు లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తూ ముందుకు పోతున్న రాష్ట్రాన్ని చూసి కొందరు అవాకులు చవాకులు మాట్లాడుతున్నరు. ఓర్వలేక అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నరు. వారందరికీ దీటైన సమాధానం చెప్పి అద్భుతమైన మెజారిటీతో మా అభ్యర్థి సైదిరెడ్డికి విజయం చేకూర్చి కేసీఆర్ రైట్.. కేసీఆర్ గో ఎహెడ్ అని చెప్పిన హుజూర్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజల సేవలో తరిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment