20న ముహూర్తం.. | CM KCR Visits Medigadda Barrage | Sakshi
Sakshi News home page

20 నుంచే మేడిగడ్డ నుంచి నీటి ఎత్తిపోత షురూ 

Published Tue, Jun 4 2019 2:42 AM | Last Updated on Tue, Jun 4 2019 9:41 AM

CM KCR Visits Medigadda Barrage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సాగునీటి రంగ ముఖచిత్రాన్ని మార్చే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటి ఎత్తిపోతలకు రంగం సిద్ధమైంది. అన్నీ కుదిరితే ఈ నెల 20 నుంచే గోదావరి వరదను ఒడిసిపట్టేలా నీటి పారుదల శాఖ ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే సిద్ధమైన పంపుల ద్వారా తొలి దశలో అర టీఎంసీ నీటిని ఎత్తిపోస్తూ, క్రమంగా వచ్చే నెల ఇరవై నాటికి పూర్తి స్థాయిలో 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా కార్య ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే నెల చివరి నుంచి ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఒక టీఎంసీ నీటిని మిడ్‌మానేరు కింది అవసరాలకు, మరో టీఎంసీ నీటిని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథక సాగు అవసరాలకు మళ్లించేలా అన్ని పనులు పూర్తి చేసే పనిలో నిమగ్నమైంది. ఈ పనులను మంగళవారం పరిశీలించనున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి ఎత్తిపోతలపై అధికారులకు మార్గదర్శనం చేయనున్నారు.  

వరద ఉధృతమయ్యే నాటికి అంతా సిద్ధం... 
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 200 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు ఇప్పటికే పూర్తవగా, పంప్‌హౌజ్‌ల్లో మోటార్ల బిగింపు పాక్షికంగా పూర్తయింది. గోదావరిలో వరద మొదలవగానే నీటిని ఎత్తిపోసేలా నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 11 మోటార్లకు 6, అన్నారంలో 8లో 5, సుందిళ్లలో 9లో 6 మోటార్ల బిగింపు పూర్తయింది.

మిగతా వాటిని వచ్చే నెల 15 నాటికి పూర్తి స్థాయిలో బిగించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బిగింపు పూర్తయిన మోటార్లకు ఈ నెల మొదటి వారంలోనే వెట్‌రన్‌ నిర్వహించాల్సి ఉన్నా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ నెల రెండో వారంలో అన్ని పంపులకు ఒకేమారు వెట్‌రన్‌ నిర్వహించి, అవి ఫలప్రదం అయిన వెంటనే నీటిని ఎత్తిపోసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ నెల 20 నుంచి మేడిగడ్డ లిఫ్ట్‌ ద్వారా రోజుకి 0.55 టీఎంసీల నీటితో మొదలు పెట్టి, క్రమంగా వచ్చే నెల 11వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో 2 టీఎంసీల నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28 నుంచి అన్నారం, వచ్చే నెల 4 నుంచి సుందిళ్ల మోటార్ల ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలించి దాన్ని పూర్తి స్థాయిలో నింపనున్నారు. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6లో 7 మోటార్లలో 4 పూర్తవగా, ప్యాకేజీ–8లో 7కు గానూ 5 పూర్తయ్యాయి. మిగతా వన్నీ వచ్చే నెలలో పూర్తవనున్నాయి. జులై 20 నాటికి ప్యాకేజీ– 8 ద్వారా మిడ్‌మానేరుకు ఒక టీఎంసీ, మరో టీఎంసీ నీటిని వరద కాల్వ ద్వారా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి తరలించేలా ప్రస్తుతం కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. పునరుజ్జీవ పథకంలో ఇప్పటికే రెండు పంప్‌హౌజ్‌ల్లో రోజుకు 0.65 టీఎంసీ నీటిని ఎత్తిపోసి కనిష్టంగా 55 టీఎంసీలు ఆయకట్టుకు తరలించేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నీటితో ఎస్సారెస్పీ కింది 9 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశాలున్నాయి. ఇక మిడ్‌మానేరు కింద కొత్తగా 30 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు, కొండపోచమ్మ సాగర్‌ వరకు నీటిని తరలిస్తూనే చెరువులన్నీ నింపనున్నారు.  

సీఎం పరిశీలన.. 
ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌ వరద కాల్వ వద్ద నిర్మిస్తున్న పంప్‌హౌస్‌లో మొదటి మోటర్‌కు ఇటీవల డ్రైరన్‌ నిర్వహించగా అది విజయవంతం అయింది. ఇక్కడ 8 పంపులలో 4 సిద్ధమయ్యాయి. ఈ పనులను సీఎం పరిశీలించి మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా మరోమారు డ్రైరన్‌ నిర్వహించేందుకు అధికారులు అంతా సిద్ధం చేశారు. 

నేడు సీఎం షెడ్యూల్‌ ఇలా... 
► ఉ. 6 గంటలు: ప్రగతిభవన్‌ నుంచి కేసీఆర్‌ బయలుదేరుతారు. 
 ఉ. 7 గంటలు: హెలిక్యాప్టర్‌లో రాంపూర్‌ చేరుకొని పంపులను పరిశీలిస్తారు.  
►  ఉ. 7.45: మేడిగడ్డ బ్యారేజీకి చేరుకొని అక్కడి పనులను పరిశీలించి మార్గనిర్దేశం చేస్తారు. 
 ఉ. 11.45 గంటలు: మేడిగడ్డ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement