మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, భూపాలపల్లి/పెద్దపల్లి: రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ తన తొలి అధికార పర్యటనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మేడిగడ్డకు చేరుకున్న కేసీఆర్ ప్రాజెక్టు పనుల పురోగతిని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. పనులు ఎప్పట్టిలోగా పూర్తవుతాయని ఆరా తీశారు. బ్యారేజీ పనులు సకాలంలో పూర్తి చేసేలా అధికారులకు పలు సూచనలు చేశారు. మేడిగడ్డ పంపుహౌస్ నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలించారు. అంతకు ముందు ఏరియల్ వ్యూ ద్వారా మేడిగడ్డ బ్యారేజీ పనులను కేసీఆర్ పరిశీలించారు. కేసీఆర్ వెంట సీఎస్ ఎస్కే జోషి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిలు ఉన్నారు.
కన్నెపల్లి పంపుహౌస్ పనులను పరిశీలించిన సీఎం
మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించిన కేసీఆర్ అక్కడి నుంచి కన్నెపల్లి పంపుహౌస్ చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన కేసీఆర్ అధికారులను అడిగి పనుల పురోగతిపై ఆరా తీశారు. పంపుహౌజ్ పనుల పురోగతిపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చికల్లా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి ఆయన అన్నారం బ్యారేజీకి చేరుకోనున్నారు.
కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చిన కేసీఆర్‌ను మేడిగడ్డ పంపుహౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో సీతక్క, శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డిలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment