‘గులాబీ’ దళపతి వ్యూహాత్మకంగా విసిరిన రాజకీయ వలలో వరంగల్ నేతలు మళ్లీ పడ్డారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో శుక్రవారం జరిగిన టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో ముగ్గురు, నలుగురికి తప్ప మిగిలిన సిట్టింగులందరికీ సీట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పిన మాటలు ఆశావహుల్లో ఆశలు రేపుతున్నాయి. తమకు టికెట్ రాకపోవచ్చనే నిరాశలో పక్క పార్టీల వైపు చూస్తున్న వాళ్లకు ఆయన మాటలతో పునరుత్తేజం వచ్చినటయ్యింది. టికెట్ ఆశిస్తున్న నేతలందరూ ఆ ముగ్గురు, నలుగురిలో మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంటాడంటే.. మా ఎమ్మెల్యే ఉంటాడని ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘ముగ్గురు.. నలుగురికి తప్ప మిగిలిన సిట్టింగులందరికీ సీట్లు ఇస్తాం..’ అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలు ఆశావహుల్లో ఆశలు రేపడంతోపాటు ఇతర పార్టీ ల్లోకి జంపింగ్ ఆలోచనలో ఉన్న వారికి పునరు త్తేజాన్ని నింపాయి. ఆ ముగ్గురు, నలు గురిలో మా ఎమ్మెల్యే ఉంటారని ఎవరకు వారు అంచనా వేసుకుంటున్నారు. కొందరు ఆశావహులు అడుగు ముందుకేసి ఇప్పటి సిట్టింగు ఎమ్మెల్యేలు చేసిన తప్పిదాలు, లోపాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకోసం పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులను మచ్చిక చేసుకుని సమాచారం తీసుకునే పనిలోఉన్నారు. మరి కొందరు ప్రైవేట్ గూఢాచారి సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఎన్నికలు సమీపించే నాటికి పూర్తి స్థాయి సమాచారంతో పార్టీ అధినాయకత్వానికి పంపగలిగితే ‘కారు’లో ఖాళీ అయ్యే సీటు ఇక తమకే అనే ఆలోచనతో ఉన్నారు.
కలెగూర గంప
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు, భూపాలపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబా బాద్, ములుగు, పరకాల నియోజకవర్గాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. జనగామ, నర్సంపేట, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఓ మోస్తరు పోటీ ఉంది. ఇందుకు ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు కారణమని చెప్పవచ్చు. మరోవైపు అప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం జోరుగా ప్రచారంలోకి రావడంతో ముందస్తుగా సీటు ఖరారు చేసుకుందామని మరికొందరు ఇతర పార్టీల నుంచి గంపగుత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అటు పాత వాళ్లు.. ఇటు కొత్త వాళ్లతో టీఆర్‌ఎస్ పార్టీ కలెగూర గంపగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
‘తూర్పు’లో తీవ్ర పోటీ
వరంగల్ తూర్పు నియోజకవర్గ టికెట్‌పై తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొండా సురేఖ బలంగా ఉన్నా రు. ఆమె తన సీటు పైలం జేసుకుంటూనే తన కూతురు సుష్మితాపటేల్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు నగర మేయర్ నన్నపునేని నరేందర్ ఇదే సీటు కోసం గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వర్గపోరాటం తారస్థాయికి చేరుకుంది. అవకాశం దొరికితే అటు కొండా సురేఖ, ఇటు నన్నపునేని నరేందర్ ఆధారాలతో పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, తెలంగాణ మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్‌పర్సన్ గుండు సుధారాణి, వరంగల్ అర్బన్ కో అపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇదే సీటు కోసం పోటీపడుతున్నారు.
మానుకోటలో..
మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్నారు. తరచుగా ఆయన వివాదాల్లో చిక్కుకోవడం.. ఐఏఎస్ అధికారిని చేతితో తాకడం వంటి సంఘటనలతో నేరుగా కేసీఆర్ కల్పించుకోవాల్సి వచ్చింది. ఇదే నియోజకవర్గం నుంచి టికెట్ కోసం ఎదురుచూస్తున్న మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత.. తాజా ఎమ్మెల్యే లోతుపాతులు లాగే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఎక్సైజ్ అధికారి మోహన్‌లాల్, ప్రస్తుతం మెదక్ ఏఎస్పీగా పని చేస్తున్న నాగరాజు తదితరులు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
ఎక్కడ ఖాళీ ఉన్నా నేనే కూర్చుంటా..
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరు ఎక్కువగా వినిపిస్తోంది. జిల్లాలో ఏ సీటు ఖాళీ అయితే అదే నాది అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కావ్య స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో పాటు అరూరి రమేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న వర్ధన్నపేట నియోజకవర్గంపై కూడా ఆమె ఆశతో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రెండు కాకుంటే వరంగల్ ఎంపీగానైనా నిలబడాలని ఉవ్విళ్లూరుతున్నట్లు సమాచారం.
ఎవరు.. ఎక్కడ పోటీ పడుతున్నారంటే..
- వర్ధన్నపేట : ప్రస్తుత ఎమ్మెల్యే అరూరి రమేష్, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య
- నర్సంపేట : గతంలో పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి
- పరకాల : ప్రస్తుత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గతంలో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సహోదర్ రెడ్డి, టీఆర్‌ఎస్ సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ( కేటీఆర్ సన్నిహితుడు)
- భూపాలపల్లి : ప్రస్తుత ఎమ్మెల్యే స్పీకర్ సిరికొండ మధుసుదనాచారి, గండ్ర సత్యనారాయణరావు, కొండా సుíష్మితాపటేల్, తెలంగాణ రైతు రుణమాఫీ కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు
- ములుగు : ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి అజ్మీరా చందూలాల్, ఆయన తనయుడు ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్
- డోర్నకల్ : ప్రస్తుత ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్
- పాలకుర్తి : ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు
- జనగామ : ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జనగామ జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, ఎన్‌ఆర్‌ఐ గుడి వంశీధర్ రెడ్డి
- స్టేషన్ ఘన్‌పూర్ : ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారపు ప్రతాప్, కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, డాక్టర్ సుగుణాకర్ రాజు, డాక్టర్ సుధ
Comments
Please login to add a commentAdd a comment