అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలే: కేసీఆర్
సదరు విద్యా సంస్థల గుర్తింపు రద్దు
అసలుదేదో, నకిలీదేదో తేల్చాలని ఆదేశం
వాటిలోని విద్యార్థులకు నష్టం జరగనివ్వొద్దు
విద్యాశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయం
అన్ని విద్యా సంస్థల్లోనూ ప్రమాణాలతో కూడిన విద్య
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా అమలు
పేద విద్యార్థుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
తక్షణం రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు
రూ. 3,061 కోట్ల చెల్లింపునకు ఆర్థిక శాఖకు ఆదేశం
రాష్ట్రంలో పేద విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే బోగస్ విద్యా సంస్థలు ప్రభుత్వ సొమ్మును కాజేసే ఉద్దేశంతో అక్రమాలకు పాల్పడుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ బోగస్ విద్యా సంస్థల వల్ల విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందే హక్కును కోల్పోతున్నారని పలు విచారణల్లో తేలిందన్నారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ ఆధ్వర్యంలో విచారణ బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నింటిలో తనిఖీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. తద్వారా ఏది బోగస్ సంస్థో, ఏది అసలు సంస్థో తేల్చాలని నిర్దేశించారు. ‘‘అక్రమాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం.
వాటి గుర్తింపును కూడా రద్దు చేస్తాం’’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సదరు బోగస్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని, వారిని ఇతర విద్యా సంస్థల్లో చేరుస్తామని పేర్కొన్నారు. అంతేగాక రాష్ట్రంలో పలు విద్యా సంస్థల్లోని విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ వెంటనే విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇప్పటిదాకా విద్యార్థులకు బకాయి పడిన రూ.3,061 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆయన ఆదేశించారు.
ఆదర్శం... అక్రమార్కులపాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు తదితర విద్యా సంబంధిత అంశాలపై గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు ఇతర కులాల్లోని పేదలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. డాక్టర్లు, ఇంజనీర్లు తదితర ఉన్నత స్థాయి అవకాశాలను వారు అందిపుచ్చుకోవాలన్నదే తమ అభిమతమన్నారు. ‘‘హాస్టల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ఇస్తున్న సన్న బియ్యం పథకాన్ని వచ్చే ఏడాది నుంచి కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా వర్తింపజేయాలని ఇప్పటికే నిర్ణయించాం.
పేదలకు మంచి భోజనం, బట్టలు, పుస్తకాలు అందించడానికి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, మెస్ చార్జీల చెల్లింపుకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ ప్రభుత్వం పెట్టే ఈ ఖర్చు అక్రమార్కులపాలు కావడం వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు’’ అని సీఎం అభిప్రాయపడ్డారు. సీఐడీ, విజిలెన్స్, ఏసీబీ, ఇంటెలిజెన్స్ సంస్థలు గతంలో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా అనేక అక్రమాలు బయటపడ్డాయని ఆయనన్నారు. ‘‘ఇప్పటికే రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం లేదు.
బోగస్ విద్యా సంస్థలూ ఉన్నాయి. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలూ పూర్తి స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేలా చూసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతుంది’’ అని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి విద్యా సంస్థలన్నింటిలో తనిఖీలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ‘‘విద్యా సంస్థల్లో అధ్యాపకులున్నారా? ఫర్నిచర్ ఉందా? ఇతర సౌకర్యాలున్నాయా? లేబొరేటరీలున్నాయా? ఆయా విద్యా సంస్థల్లోని అడ్మిషన్లు నిజమైనవేనా, బోగసా? ఇలాంటి అన్ని విషయాలపైనా సమగ్ర విచారణ చేయండి. ప్రభుత్వ గుర్తింపుకు నిర్దేశించిన అర్హతలు, ప్రమాణాలు పాటిస్తున్నారా, లేదా కూడా గమనించండి’’ అంటూ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార, ఏసీబీ డీజీపీ ఏకే ఖాన్, జంటనగరాల పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.