20న ఎన్నికలు
- ఎమ్మెల్యే గంప, ఎమ్మెల్సీ షబ్బీర్‌లకు ప్రతిష్టాత్మకం
- ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న నేతలు
- వేడెక్కుతున్న బల్దియా రాజకీయం
కామారెడ్డి : మున్సిపల్ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. 20వ తేదీన కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు జరగనుండడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నిమగ్నమై పోయారు. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీలకు ప్రతిష్టాత్మకం కావడంతో ఇరు పార్టీల నేతలు కోఆప్షన్ సభ్యులను గెలిపించునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు.
గతంలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో టీఆర్‌ఎస్ తరపున నామినేషన్లు వేసిన అభ్యర్థులపై కే సులున్నాయని, వారి నామినేషన్లను తిరస్కరిం చాలని లేదా ఎన్నికను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. దీంతో మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మ ఎన్నికను వాయిదా వేస్తున్న ట్టు ప్రకటించి వెళ్లిపోయారు. మెజారిటీ కౌన్సిల ర్లు సమావేశంలో ఉన్నందున ఎన్నిక నిర్వహిం చాల్సిందేనంటూ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అధికారులను డిమాండ్ చేశారు.
అప్పటికప్పుడు చాట్ల లక్ష్మి అనే కౌన్సిలర్‌ను ప్యానెల్ చైర్మన్‌గా ఎన్నుకుని ఆమె అధ్యక్షతన ఎన్నికలు నిర్వహిం చారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు కోఆప్షన్ మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిం చారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని కాంగ్రెస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు తిరిగి ఎన్నికను నిర్వహించాలని తీర్పు వెలువరించింది.
కోర్టు అనుమతితో ఈ నెల 20న మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలను నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటగా జనరల్ స్థానానికి నామినేషన్లు స్వీకరించారు. టీఆర్‌ఎస్ నుంచి నిట్టు కృష్ణమోహన్‌రావ్, కాంగ్రెస్ నుంచి పార్శి కాంశెట్టి, బీజేపీ నుంచి ఉప్పల హరిధర్ నామినేషన్లు చేశారు. మిగతా రెండు కోఆప్షన్ సభ్యులకు సంబంధించి 20నే నామినేషన్లు స్వీకరిస్తారు. అదే రోజు ఎన్నికలుంటాయి. అయితే ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన వారిని గెలిపించుకోవడం ద్వారా సత్తా చాటుకోవాలని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు పట్టుదలతో ఉన్నాయి.
ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో
విచిత్రమైన రాజకీయాలకు వేదికగా పేరున్న కామారెడ్డి మున్సిపాలిటీలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కోసారి మెజారిటీ ఉన్న పక్షం వారూ ఓడిపోయిన సందర్భాలు లేకపోలేదు. ఎన్నికలకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
బల్దియాలో ఎవరి బలమెంత
మున్సిపాలిటీలో 33 వార్డులున్నాయి. కాంగ్రెస్ పార్టీనుంచి 17 మంది, బీజేపీ నుంచి 8 మంది, టీఆర్‌ఎస్ నుంచి ఐదుగురు, ఎంఐఎం, సీపీఎంలనుంచి ఒక్కొక్కరు ఎన్నికకాగా ఒక స్థానం నుంచి ఇండిపెండెంట్ గెలిచారు. అయితే ఎన్నికల ఫలితాలనాటికే బీజేపీకి చెందిన ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. బీజేపీ బలం ఐదుకు పడిపోయింది.
మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని ఆశించి భంగపడ్డ చాట్ల లక్ష్మి కోఆప్షన్ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు ముదాం సిద్దవ్వ, తేజాపు రాజమణి, ఎల్కంటి సావిత్రి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అయితే రాజమణి తర్వాత మళ్లీ సొంత గూటికి వెళ్లారు. ప్రస్తుతం బల్దియాలో కాంగ్రెస్ బలం 14 కాగా టీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య 11. గతంలో కో ఆప్షన్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఇద్దరు సభ్యులు కాంగ్రెస్‌కు, ముగ్గురు సభ్యులు టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చారు. దీంతో ఈసారి జరుగనున్న కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో పోటీ రసవత్తరం కాకుంది.
టీఆర్‌ఎస్‌లో ఇప్పుడు 11 మంది కౌన్సిలర్లు ఉండగా స్వతంత్ర కౌన్సిలర్‌తోపాటు సీపీఎం, ఎంఐఎం సభ్యుల మద్దతుతో టీఆర్‌ఎస్ బలం 14కు చేరుతుంది. ఎమ్మెల్యే ఓటు కలిపితే 15 అవుతుంది. మరోవైపు కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఓటు కలిపితే ఆ పార్టీ బలం కూడా 15 అవుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులను తమవైపు తిప్పుకోవడమో.. ఎన్నికకు గైర్హాజరయ్యేలా చూడడమో చేసి లాభపడాలని టీఆర్‌ఎస్ చూస్తోంది. కాగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల పోటీలో లబ్ధిపొందాలని, తమపార్టీకి చెందిన అభ్యర్థిని ఒక కోఆప్షన్ సభ్యుడిగా గెలిపించుకోవాలని బీజేపీ యోచిస్తోంది.
కో ఆప్షన్ ఎన్నికల్లో జనరల్ అభ్యర్థిగా బీజేపీకి చెందిన ఉప్పల హరిధర్‌ను ఆ పార్టీ పోటీలో నిలిపింది. పరస్పర సహకారంతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. హరిధర్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తే కాంగ్రెస్‌కు చెందిన 14 మందితో పాటు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఓటు కలిపి బీజేపీ అభ్యర్థికి పడితే ఆయన విజయం సాధించవచ్చు. బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల మైనారిటీ కో ఆప్షన్ సభ్యులను దక్కించుకోవాలని కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు అధిక సంతానం కేసులను ఎదుర్కొంటున్నారు. దీంతో వారి కేసులను తేల్చడం ద్వారా ఆ పార్టీ బలాన్ని తగ్గించి, ఎన్నికల్లో లబ్ధిపొందాలని టీఆర్‌ఎస్ యోచిస్తున్నట్లు సమచారం.
మళ్లీ ‘కోఆప్షన్’ లొల్లి
Published Tue, Dec 9 2014 2:36 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement