శ్రీరాంపూర్ : జిల్లాలో శనివారం కురిసిన వర్షంతో బొగ్గు ఉత్పత్తి తీవ్ర విఘాతం కలిగింది. రోజంతా కురిసిన వర్షం వల్ల బెల్లంపల్లి రీజియన్‌లోని మూడు డివిజన్లలో గల 4 ఓసీపీల్లో సుమారు 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రే క్ పడింది. టన్నుబొగ్గు ధర సుమారు రూ.2 వేల చొప్పున లెక్కేసినా సింగరేణికి సుమారు రూ.మూడున్నర కోట్ల ఉత్పత్తి నష్టం వాటిల్లింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో క్వారీలో మైనింగ్ ఆపరేషన్స్‌ను పూర్తిగా నిలిపివేశారు. టిప్పర్లను, డంపర్లను క్వారీ నుంచి ఉపరితలానికి తరలించారు. క్వారీలో చేరిన వర్షపు నీటిని ఎప్పటికప్పుడు అధిక సామర్థ్యం గల పంపులతో బయటికి తోడేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓసీపీల్లో ఓబీ పనులు చేసే కాం ట్రాక్టర్లు కూడా పనులు పూర్తిగా నిలిపివేశారు. అన్ని ఓసీపీల్లో ఓవర్ బర్డెన్ మట్టి పనులు ఆగిపోయాయి. అయితే భూగర్భ గనుల్లో ఉత్పత్తికి ఎలాంటి ఆటకం లేదు.
ఇదీ పరిస్థితి
బెల్లంపల్లి డివిజన్ పరిదిలో మూడు ఓసీపీలు ఉన్నాయి. డొర్లి 1, డొర్లి 2, కైరీగూడ ఉండగా ఇందులో డొర్లి 2లో ఓబీ సమస్యతో కొంత కాలంగా పనులు ఆపేశారు. మిగిలి రెండు ఓసీపీలను పరిశీలిస్తే డొర్లి 1 ఓసీపీ నెలవారి ఉత్పత్తి లక్ష్యం 1.18 లక్షల టన్నులుగా ఉంది. రోజు వారిగా రావాల్సిన 4 వేల టన్నుల బొగ్గు వర్షంతో పూర్తిగా ఆగిపోయింది. కైరిగూడ ఓపీపీలో నెలవారి ఉత్పత్తి లక్ష్యం 1.75 లక్షల టన్నులుగా ఉంది. దీంతో రోజు వారిగా సాధించాల్సిన 5500 టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగింది.
ఇక మందమర్రి ఏరియాలో ఉన్న ఏకై క ఆర్కేపీ ఓసీపీ 1లో రోజు వారీ ఉత్పత్తి 2,500 టన్నులు పూర్తిగా నష్టపోయింది. శ్రీరాంపూర్‌లోని ఎస్సార్పీ ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. నెలవారీ ఉత్పత్తి లక్ష్యం 1.8 లక్షల టన్నులు కాగా వర్షంతో రోజు వారీగా ఉత్పత్తి చేయాల్సిన 6 వేల టన్నులకు బ్రేక్ పడింది. దీంతో బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఈ నాలుగు ఓసీపీల్లో కలిపి మొత్తం 18 వేల టన్నుల బొగ్గు వర్షంతో ఉత్పత్తి రాకుండా పోయింది.
దీంతో సుమారు రూ.3.6 కోట్ల నష్టం కంపెనీకి వాటిల్లింది. కాగా, ఉపరితలంలో స్టాక్ చేసిన బొగ్గును తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా వర్షం పూర్తిగా తగ్గి కనీసం 3 గంటల పొడి వాతవరణం ఉంటేనే ఓసీల్లో ఉత్పత్తి పునరుద్ధరణ సాధ్యమవుతుందరి అధికారులు పేర్కొంటున్నారు.
బొగ్గు ఉత్పత్తికి వర్షం దెబ్బ
Published Sun, Sep 7 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement
Advertisement