పాలన పడక! | Collector Shortage in Hyderabad | Sakshi
Sakshi News home page

పాలన పడక!

Published Mon, Jan 28 2019 9:45 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Collector Shortage in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రాజధాని కేంద్రమైన హైదరాబాద్‌ జిల్లా పరిపాలనా యంత్రాంగానికి మళ్లీ కష్టకాలం వచ్చింది. ‘ముఖ్య’ అధికారి విషయంలో ఈ జిల్లాకు తరచు ఏదో ఒక రూపంలో సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఎక్కువ కాలం ముఖ్య అధికార విభాగం ఇన్‌చార్జిలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కలెక్టర్‌ రఘునందన్‌రావు స్టడీ టూర్‌ కోసం విదేశాలకు వెళ్లడంతో ప్రస్తుత జాయింట్‌ కలెక్టర్‌ రవి తాత్కాలికంగా ఇన్‌చార్జి కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయన జిల్లా చీఫ్‌ రేషనింగ్‌ అధికారి (సీఆర్వో)గా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మరోవైపు జిల్లా రెవెన్యూ అధికారి కూడా సెలవుపై వెళ్లడంతో జిల్లా భూ పరిరక్షణ అధికారి వెంకటేశ్వరరావు ఇన్‌చార్జి డీఆర్వోగా కొనసాగుతున్నారు.

దీంతో పలు కీలకమైన నిర్ణయాలు, ఫైళ్లు ఎక్కడక్కడే పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. రెండేళ్ల వ్యవధిలో ముగ్గురు కలెక్టర్లు  ఇలా వచ్చి...అలా వెళ్లిపోయారు.  నాలుగు నెలలుగా అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఎలాంటి ఫైళ్లు, ఇతర పనులు ముందుకు సాగక పోగా,  తాజాగా ఇన్‌చార్జిల పాలనతో అదే తీరు ఇంకా కొనసాగుతోంది. డివిజన్, మండల రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఉన్నప్పటికి పనితీరు మాత్రం అంటీముట్టనట్లుగా తయారైంది.  వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ దరిమిలా జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులందరూ  ఇతర జిల్లాలకు బదిలీ కాగా, ఇతర జిల్లాకు చెందిన అధికారులకు ఇక్కడ పోస్టింగ్‌ లభించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే పంచాయతీ  ఎన్నికల కోడ్‌ రావడంతో తిరిగి చేర్పులు, మార్పులకు ఆస్కారం లేకండా పోయింది.  మరోవైపు పార్లమెంట్‌ ఎన్నికల గడువు సైతం ముంచుకోస్తోంది. ప్రస్తుత డివిజన్, మండల  బాధ్యులు నామమాత్రపు అంశాలు మినహా కీలకమైన అంశాల జోలికి వెళ్లడం లేదు. 

ఆర్థిక చేయూతకు గ్రహణం
జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ఆర్ధిక చేయూతకు గ్రహణం పట్టుకుంది. ప్రభుత్వ పథకాలు, సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అధికారుల నామమాత్రపు పనితీరు, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై క్షేత్ర స్థాయి విచారణ ముందుకు సాగడం లేదు.  ఇప్పటికే  క్షేత్రస్థాయి విచారణ పూర్తయి లబ్ధిదారుల ఎంపిక జరిగినా చెక్కుల పంపిణీ మాత్రం జరగడం లేదు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు రుణాలు అందని ద్రాక్షగా మారాయి.
ప్రభుత్వం నుంచి సబ్సిడీ విడుదలైనా...బ్యాంకులు సవాలక్ష కొర్రీల కారణంగా లక్ష్యం మాత్రం చేరడం లేదు. నిరుద్యోగ యువత కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ధూల్‌పేట్‌లో గుడుంబా తయారీ నుంచి బయటకు వచ్చిన యువతకు పునరావాసం కల్పించేందుకు కొన్ని యూనిట్ల కేటాయింపులు కాగితాలకు పరిమితమయ్యాయి. ఇలా చాల పథకాలు అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికైనా ఇన్‌చార్జి అధికారుల పద్ధతికి స్వస్తి పలికి..అన్ని ముఖ్యవిభాగాలకు రెగ్యులర్‌ అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement