
ఫీజులు చెల్లించకపోతే కలెక్టరేట్ల ముట్టడి
బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఫీజు బకాయిలు వెంటనే చెల్లించకపోతే తరగతి గదులను బహిష్కరించి ఈ నెల 16న అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఈ మేరకు సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు మెమోలు ఇవ్వడం లేదని, కొత్తగా వివిధ కోర్సుల్లో చేరాలంటే అడ్మిషన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.1,600 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని అన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. 40 వేలకుపైగా పోస్టులు ఖాళీలుండగా విద్యాశాఖ మంత్రి 16 వేలు మాత్రమే ఉన్నాయని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో గుజ్జ కృష్ణ, జి.రమేశ్, నీలం వెంకటేశ్, జి.కృష్ణ, చందర్, రామకృష్ణ పాల్గొన్నారు.