సీపీఎస్‌ రద్దు కోసం ఉమ్మడి పోరు | combind fighting on CCS banned : sreenivas goud | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ రద్దు కోసం ఉమ్మడి పోరు

Published Mon, Feb 27 2017 3:02 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM

సీపీఎస్‌ రద్దు కోసం ఉమ్మడి పోరు

సీపీఎస్‌ రద్దు కోసం ఉమ్మడి పోరు

అసెంబ్లీలో తీర్మానానికి కృషి చేస్తా
నిజాం కళాశాలలో జరిగిన
బహిరంగ సభలో శ్రీనివాస్‌గౌడ్‌


హైదరాబాద్‌: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు చేసి పాత పెన్షన్‌ విధానానికై పోరాడతామని పలు ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ స్టేట్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిజాం కళాశాల మైదానంలో ‘సీపీఎస్‌ రద్దు శంఖారావం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, శాసనసభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ... ఐదేళ్ల పదవీకాలం ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలకు పింఛన్‌ ఇస్తున్న ప్రభుత్వాలు 30 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారికి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. పింఛన్‌ ప్రభుత్వ ఉద్యోగి ప్రాథమిక హక్కన్నారు. పాత పెన్షన్‌ విధానానికై ప్రభుత్వాలతో పోరాడతామని హామీ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం పింఛన్‌ సొమ్మును స్టాక్‌ మార్కెట్‌లలో పెట్టి లాభం వస్తే పింఛన్‌ ఇస్తాం.. అని మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్నారు. కింగ్‌ఫిషర్‌ సంస్థ లాంటి అధినేతలు చేతులెత్తేస్తే స్టాక్‌ మార్కెట్‌లు గల్లంతయ్యే పరిస్థితి ఉందని, ఈ వ్యవహారం సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిదిగా ఉందన్నారు. సీపీఎస్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నాలు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని సాధిద్దామని పిలుపునిచ్చారు. పాత పెన్షన్‌ విధానానికై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు.

ఐక్య కార్యాచరణ రూపొందిస్తాం...
టీఎన్జీవో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్‌ మాట్లాడుతూ... సీపీఎస్‌ రద్దుకై పోరాటానికి ఐక్య కార్యాచరణను రూపొందిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ చెప్పిన మాట ప్రకారం మన మధ్య అభిప్రాయ బేధాలను పక్కకుపెట్టి అందరికీ అనుకూలైన కార్యాచరణతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. సీపీఎస్‌ విధానాల్లో తెలిసో తెలియకో చేరిన రాష్ట్ర ప్రభుత్వం నిర్భయంగా దాని నుంచి బయటకు రావచ్చని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ చెప్పారు. ఉద్యోగుల పెన్షన్‌ను స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని చెపుతున్నారని, కానీ ఇప్పటి వరకు లాభాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పెన్షన్‌ ప్రభుత్వ ఉద్యోగి ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు.

యూపీ రాష్ట్ర ఉపా«ధ్యాయ సంఘం అధ్యక్షుడు విజయ్‌బంధు మాట్లాడుతూ... సీపీఎస్‌ రద్దుకై ఢిల్లీలో లక్షమందితో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత, తెలంగాణ రాష్ట్ర గ్రూప్‌ –1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్‌గౌడ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు కారెం రవీందర్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివశంకర్, పంజాబ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సృజిత్‌సింగ్, జూనియర్‌ కాలేజెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధుసుదన్‌రెడ్డి, యూటీఎఫ్‌ అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి, పీఆర్‌టీయూ (టీఎస్‌) అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, ఎస్‌టీయూ అధ్యక్షుడు భుజంగరావుతో పాటు వివిధ రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement