గాంధీ ఆసుపత్రిలో హోమం నిర్వహించడంపై పాలన యంత్రాంగం సీరియస్ అయింది.
హైదరాబాద్: గాంధీ ఆసుపత్రిలో హోమం నిర్వహించడంపై పాలన యంత్రాంగం సీరియస్ అయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. తల్లీపిల్లల మరణాలు నివారించేందుకంటూ ఆస్పత్రి ప్రసూతి వార్డులో సోమవారం మహామృత్యుంజయ హోమం నిర్వహించిన సంగతి విదితమే. దీనిపై ఆస్పత్రి సెమినార్ హాలులో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింహారావునేత, ఆర్‌ఎంఓ–1 జయకృష్ణ, ఆర్‌ఎంఓలు శేషాద్రి, సాల్మన్ మాట్లాడారు.
ఆసుపత్రిలో హోమం జరపటంపై తమకు సమాచారం లేదన్నారు. గైనకాలజీ వైద్యులే హోమం చేశారా లేక తమ కుటుంబసభ్యులు బాగుండాలని రోగులు నిర్వహించిన హోమానికి వైద్యులు హాజరయ్యారా అనే విషయం తేలాల్సి ఉందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుతూ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని సాయిబాబా ఆలయంలో నాలుగేళ్లుగా మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నామని, ఈసారి మాత్రం రోగులు, వారి సహాయకుల అభ్యర్థన మేరకు ఆస్పత్రి వరండాలో నిర్వహించినట్లు కొందరు వైద్యులు వివరణ ఇచ్చారు.