కలెక్టర్ల ద్వారా భూసేకరణ పరిహారం
నిబంధనల్లో మార్పు చేస్తాం: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రహదారులు, భవనాల కోసం సేకరించే భూమికి సంబంధించిన పరిహారాన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేసేలా నిబంధనల్లో మార్పు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ట్రెజరీ ద్వారా పరిహారం చెల్లింపులో నిబంధనల వల్ల జాప్యం జరిగి పనులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. జాప్యాన్ని నివారించేందుకు అవసరమైతే భూసేకణ చట్టానికి సరవణ చేయనున్నట్లు వెల్లడించారు. పూర్వపు మెదక్ జిల్లా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం మంత్రి హరీశ్ రావుతో కలసి ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా పనుల్లో పురోగతి లేకపోవటం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చిన పనుల్లో ఈ ఆగస్టు నాటికి మొదలవని కాంట్రాక్టులను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. రద్దు చేయటంతోపాటు సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర నూతన భూసేకరణ విధానంపై అవగాహనతో భూసేకరణ జరపాల్సి ఉన్నా అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆయా జిల్లాల కలెక్టర్లు, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నూతన భూసేకరణ చట్టానికి అవసరమైన సవరణ ప్రతిపాదన పరిశీలనలో ఉందని మంత్రి పేర్కొన్నారు. పూర్వపు మెదక్ జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న రోడ్లు, భవనాల నిర్మాణంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం జరుగుతోందని, మరిన్ని నిధులు విడుదల చేయాలని మంత్రిని ఎమ్మెల్యేలు కోరారు.