ఓట్ల గల్లంతుతో ఆందోళన
నారాయణఖేడ్/మనూరు/రేగోడ్: తమ ఓట్లను గల్లంతు కావడంతో ఖేడ్ మండలం అనంతసాగర్ పంచాయతీ పరిధిలోని గౌరారం తండాకు చెందిన గిరిజన ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. బండ్రాన్‌పల్లి పోలింగ్ బూత్‌లో గౌరారం తండాకు చెందిన ఓటర్లకు ఓటు హక్కు ఉంది. తండాకు చెందిన 60 మందికి ఓటరు స్లిప్పులు అందజేసినా పోలింగ్ బూత్‌కు వెళ్లగా ఓట్లు లేకపోవడంతో వారంతా ఆందోళనకు దిగారు. పోలింగ్ బూత్ అధికారులకు 2015 ఓటరు జాబితా సరఫరా చేశారని, గ్రామంలో స్లిప్పులు పంపిణీ చేసింది మాత్రం 2016 జాబితా అని ఓటర్లు తెలిపారు. మనూరు మండలం రాణాపూర్‌లో 150, మావినెల్లిలో 100, కిషన్‌నాయక్ తండాలో192 ఓట్లు గల్లంతైనట్టు ఓటర్లు ఆరోపించారు. ఉట్‌పల్లిలో ఎన్నికల సిబ్బంది వద్ద 2016కు సంబంధించి ఓటరు జాబితా ఉండగా గ్రామస్తుల వద్ద 2015 ఓటరు జాబితా ఉండటంతో గందరగోళం నెలకొంది. తమ పార్టీలకు చెందిన ఓట్లను కావాలనే జాబితా నుంచి తొలగించారని టీడీపీ మనూరు మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకుడు అంజాగౌడ్, కాంగ్రెస్ నాయకుడు బస్వరాజ్ ఆరోపించారు.