వైద్య రిజర్వేషన్లపై గందరగోళం  | Confusion over medical reservations | Sakshi
Sakshi News home page

వైద్య రిజర్వేషన్లపై గందరగోళం 

Published Mon, Aug 5 2019 3:08 AM | Last Updated on Mon, Aug 5 2019 3:08 AM

Confusion over medical reservations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జీవో 550 ప్రకా రం రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడం లో కొంత మేరకు వైఫల్యం జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌ అనంతరం ఆయా వర్గాలకు అన్యాయం జరిగిందంటూ సర్కారుకు అనేక ఫిర్యాదులు రావడంతోపాటు దీనిపై బీసీ సంఘాలు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు విన్నవించాయి. దీంతో ఆయన అంతర్గత విచారణకు ఆదేశిం చారు. జీవో 550 ప్రకారం రిజర్వేషన్ల అమలు జరిగిందా లేదా అనే అంశంపై ఆ శాఖ విచారణ చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దాదాపు 30 నుంచి 40 ఎంబీబీఎస్‌ సీట్లల్లో అన్యాయం జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కీలకాధికారి తెలిపారు. దీంతో 3, 4వ విడత కౌన్సెలింగ్‌ల్లో తప్పును సరిదిద్దుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీకి సూచించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడేం చేయాలని వర్సిటీ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. అయితే తాము అంతా నిబంధనల ప్రకారమే చేసినట్లు వర్సిటీ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. 

ఆరోగ్య శాఖ వర్సెస్‌ ఆరోగ్య వర్సిటీ..
రిజర్వేషన్ల అమలు తీరుపై వైద్య ఆరోగ్యశాఖకు, ఆరోగ్య వర్సిటీ మధ్య తీవ్రమైన అగాథం నెలకొంది. రిజర్వేషన్లను సరిగ్గానే అమలు చేశామన్న వర్సిటీ అభిప్రాయాన్ని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఏకీభవించడంలేదు. ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌ల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కువ మార్కులు వచ్చిన ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులను జనరల్‌ కోటాలో లెక్కించాల్సింది పోయి రిజ ర్వేషన్ల కిందకు తీసుకొచ్చారని, దీంతో అనేకమంది రిజర్వేషన్‌ సీట్లు కోల్పోయారని విమర్శలు వచ్చాయి. జనరల్‌లో సీట్లు వచ్చే అవకాశమున్న రిజర్వేషన్‌ విద్యార్థులను రిజర్వేషన్ల ద్వారా భర్తీ చేయకూడదని 550 ప్రభుత్వ ఉత్తర్వు ఉన్నప్పటికీ వర్సిటీ పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఫిర్యాదులు అందాయి. అలాగే ఓపెన్‌ కాంపిటీషన్‌లో సీటు సాధించిన రిజర్వేషన్‌ విద్యార్థి కాలేజీ ఆప్షన్‌ మార్చుకొని మరో కాలేజీకి వెళ్తే.. ఆ సీటును అదే కేటగిరీకి చెందిన వారికి ఇవ్వాలనీ ఉత్తర్వులో ఉందని అంటున్నారు. కానీ ఆ ప్రకారం జరగలేదని విమర్శలు వచ్చాయి.

ఇప్పటివరకు మొదటి, రెండు విడతల సందర్భంగా 2,487 సీట్లకు కౌన్సెలింగ్‌ జరిగింది. అయితే వర్సిటీ మాత్రం ఓపెన్‌ కేటగిరీలో 1,244 మందికి, రిజర్వేషన్‌ కేటగిరీలో 1,243 మందికి సీట్లు ఇచ్చామని తెలిపింది. మొదటి కౌన్సెలింగ్‌లో ఓపెన్‌ కేటగిరీలో చేరిన ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో మంచి కాలేజీ కోసం రెండో కౌన్సెలింగ్‌ కోసం వేచి చూశారని, దీంతో వారి సీట్లను తిరిగి ఆయా వర్గాలకే కేటాయించినట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. కానీ జీవో 500 ప్రకారం ఇక్కడ సక్రమంగా జరగలేదని సంఘాలు, వైద్య ఆరోగ్యశాఖలోని కీలకమైన వ్యక్తులు భావించడంలేదు. దాదాపు 30 నుంచి 40 సీట్లల్లో రిజర్వేషన్‌ అభ్యర్థులు నష్టపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అంతేకాదు వర్సిటీ అధికారులు జీవో 550ను తమకు నచ్చినట్లుగా అర్థంచేసుకున్నారని కూడా వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కీలక వ్యక్తి వ్యాఖ్యానించారు. దీనిపై ఆరోగ్య వర్సిటీ వర్గాలు మండిపడుతున్నాయి. తమపై బురద జల్లేం దుకే ఇలా చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి. 

మూడో విడత ఆలస్యం..
రెండు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత కన్వీనర్‌ కోటాలో ఇంకా 160 ఎంబీబీఎస్‌ సీట్లు మిగిలాయి. వాటితోపాటు జాతీయ కోటాలో మిగిలిపోయి రాష్ట్రానికి వచ్చిన 67 సీట్లు, అగ్రవర్ణ పేదల (ఈడబ్య్లూఎస్‌)కు కేటాయించిన 190 సీట్లకు ఇప్పుడు మూడో విడత కౌన్సెలింగ్‌ చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగిందన్న వాదనల నేపథ్యంలో మూడో విడత కౌన్సెలింగ్‌ ఆలస్యం అయ్యే సూచనలున్నాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement