ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, రంగారెడ్డి : ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం సోమవారం రాత్రి గెలుపు గుర్రాలను ప్రకటించింది. దాదాపు ఏకాభిప్రాయం ఉన్న సీట్లను ఏఐసీసీ వెల్లడించింది. ఆశావహుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టింది. వికారాబాద్ జిల్లాలో నాలుగు సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి (కొడంగల్), తాజా మాజీ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి (పరిగి), మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ (వికారాబాద్), పైలెట్ రోహిత్‌రెడ్డి (తాండూరు)కి టికెట్లు ఖరారయ్యాయి.
వికారాబాద్ సీటు కోసం మాజీ మంత్రి చంద్రశేఖర్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఒక దశలో చేవెళ్ల టికెట్ లభిస్తుందని ఆశించినా ఆయనకు నిరాశే మిగిలింది. ఇక్కడ పార్టీలో కొత్తగా చేరిన కేఎస్ రత్నం వైపు అధిష్టానం మొగ్గుచూపగా.. వికారాబాద్‌లో మాజీ మంత్రి ప్రసాద్ అభ్యర్థిత్వానికే ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలవాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. వికారాబాద్ నుంచి పోటీచేసే అంశంపై ఆయన నేడో రేపో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే.. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి (మహేశ్వరం), కేఎస్ రత్నం (చేవెళ్ల), తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి), కూన శ్రీశైలంగౌడ్ (కుత్బుల్లాపూర్)కు టికెట్లు ప్రకటించింది. టీడీపీ ఇతర భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకపోవడంతో కొన్ని సీట్లను ప్రకటించలేదు. అందులో శేరిలింగంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, షాద్‌నగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ, టీజేఎస్ పట్టుబడుతుండడంతో ఈ నియోజకవర్గాలపై పీటముడి నెలకొంది. ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి బ్రదర్స్, క్యామ మల్లేష్ మధ్య టికెట్ కోసం తీవ్రపోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతానికి పక్కనబెట్టింది. కాగా, షాద్‌నగర్ సీటును ఇంటిపార్టీ అడుగుతున్న నేపథ్యంలో ఆ స్థానంలో అభ్యర్థిని ప్రకటించలేదు. కుటుంబానికి ఒకటే సీటు ఇవ్వాలనే విధానపర నిర్ణయం కార్తీక్‌రెడ్డి అభ్యర్థిత్వానికి ప్రతిబంధకంగా మారుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. ఇదే సీటు కోసం టీడీపీ పట్టుబడుతుండడం పెండింగ్‌కు కారణంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment