సాక్షిప్రతినిధి, ఖమ్మం: టీపీసీసీ ప్రచార కమిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలు విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చాలని, ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని కోరుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించారు. సభల్లో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి, ప్రచార కమిటీ కోకన్వీనర్, మాజీ మంత్రి డీకే.అరుణ పాల్గొననున్నారు. ప్రచార సభల విజయవంతం కోసం పీసీసీ ప్రత్యేకంగా నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఈనెల 31న మధిరలో ఆ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క ఇంటింటికీ కాంగ్రెస్ పేరుతో ప్రచారం చేయనున్నారు. ఇక నవంబర్ 5న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి ప్రారంభమయ్యే టీపీసీసీ ప్రచార యాత్ర నవంబర్ 11వ తేదీన పినపాక నియోజకవర్గంలో ముగియనుంది.
జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించేలా ప్రచార పర్యటనను ఖరారు చేశారు. ఈనెల రెండో వారంలో ఈ పర్యటన ఉండాల్సి ఉండగా.. రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన, ఇతర కార్యక్రమాల వల్ల జిల్లా ప్రచార యాత్ర అప్పుడు వాయిదా పడింది. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉందని భావిస్తున్న పార్టీ నేతలు జిల్లా పర్యటనపై ప్రత్యేక దృష్టి సారించారు. 5వ తేదీ నుంచి ప్రచార యాత్ర ప్రారంభం కానుండగా.. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సైతం ఖరారు చేసే అవకాశం ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో కాం గ్రెస్ ఖరారు చేసిన అధికారిక అభ్యర్థులు ప్రచారంలో పాల్గొననున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నవం బర్ 9, 10 తేదీల్లో ప్రచారానికి విరామం ప్రకటించిన టీపీసీసీ ప్రచార కమిటీ.. మళ్లీ 11వ తేదీన ఉమ్మడి ఖ మ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నది.
సూర్యాపేట నుంచి ఖమ్మంలోకి..
నవంబర్ 5న ఉదయం సూర్యాపేట జిల్లా నుంచి ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించగానే.. పాలేరులో రోడ్‌షో చేపట్టనున్నారు. అనంతరం సభ నిర్వహించి కూసుమంచిలో రోడ్‌షో ద్వారా ఖమ్మం నగరానికి చేరుకోనున్నారు. ఖమ్మంలో రోడ్‌షో నిర్వహించి ఆయా వీధుల్లో సభలు నిర్వహించనున్నారు. నవంబర్ 7న మధిర నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం నియోజకవర్గ కేంద్రమైన వైరాలో రోడ్‌షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. తల్లాడ లో రోడ్ షోతోపాటు సభ నిర్వహించనున్నారు. రాత్రి సత్తుపల్లిలో రోడ్‌షో, సభ నిర్వహించనున్నారు. నవంబ ర్ 8న అశ్వారావుపేటలో రోడ్ షో నిర్వహించడంతోపాటు అదేరోజు మధ్యాహ్నం కొత్తగూడెంలో రోడ్‌షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు.
సాయంత్రం ఇల్లెందుకు వెళ్లి అక్కడ రోడ్‌షో, సభ నిర్వహించనున్నారు. 9, 10 తేదీల్లో ప్రచార యాత్రకు విరామం ప్రకటించిన కమిటీ 11వ తేదీన మళ్లీ జిల్లాలోనే తమ ప్రచార పర్వాన్ని కొనసాగించనున్నది. నవంబర్ 11న ఉదయం భద్రాచలంలో రోడ్‌షో, సభ, మధ్యాహ్నం పినపాక నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించి.. సాయంత్రం రోడ్‌షో, సభ నిర్వహించే విధంగా పర్యటనను ఖరారు చేశారు. అన్ని సభల్లోనూ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, సినీ నటి విజయశాంతి, మాజీ మంత్రి డీకే.అరుణతోపాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, శాసన మండలి సభ్యులు, జిల్లా నాయకులు పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ అందరికన్నా ముందుగా తమ పార్టీ పోటీ చేసే స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంతో ఆయా అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించడంతోపాటు నియోజకవర్గంలోని పలు మండలాలను, గ్రామాలను చుట్టొచ్చి టీఆర్‌ఎస్ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు ఎవరనే అంశం తేలకపోవడం, మహాకూటమికి సంబంధించి జిల్లాలో పొత్తుల లెక్క కొలిక్కి రాకపోవడం వంటి కారణాలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించేందుకు ప్రచార సభలు దోహదపడతాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రచార యాత్ర తమ ప్రాంతాలకు వచ్చే నాటికి అభ్యర్థుల ప్రకటన సైతం జరిగే అవకాశం ఉండడంతో కార్యకర్తల్లో, ద్వితీయ శ్రేణి నేతల్లో ఉత్సాహం నింపినట్లు అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలో తలపెట్టిన పీసీసీ ప్రచార యాత్రను విజయవంతం చేసేందుకు పీసీసీ ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జ్‌ని నియమించింది. పాలేరుకు సయ్యద్ నిజాముద్దీన్, ఖమ్మం సంధ్యారెడ్డి, బోనకల్ విజయ్‌కుమార్‌నాయుడు, మధిర జనక్‌ప్రసాద్, వైరాకు డాక్టర్ కేటూరి వెంకటేష్, కల్లూరుకు మన్నె క్రిశాంక్, అశ్వారావుపేటకు పున్నా కైలాష్‌నేత, కొత్తగూడెం కేవీఎన్ రెడ్డి, ఇల్లెందుకు రామచంద్రారెడ్డి, భద్రాచలంకు జె.శ్రీనివాసరెడ్డి, పినపాకకు ఎన్.సునీతారావులను పార్టీ ఇన్‌చార్జిలుగా నియమించింది.
కూటమికే పట్టం కట్టండి : భట్టి విక్రమార్క
నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది. ఇన్నాళ్లు ప్రజలను మభ్యపెట్టుకుంటూ కాలం వెళ్లదీసింది. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడింది. అటువంటి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. వచ్చే ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులను గెలిపించేందుకు విస్తృతంగా ప్రచార సభలు నిర్వహిస్తున్నాం. కాంగ్రెస్‌కు ఖమ్మం జిల్లా అనుకూలంగా ఉండడంతో ప్రచార సభలు, యాత్రలను నియోజకవర్గాల వారీగా చేపట్టనున్నాం. మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రచార సభలను నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment