మాట్లాడుతున్న ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు
చేవెళ్ల (రంగారెడ్డి): త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఏఐసీసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ పరిశీలకుడు బోసు రాజు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో శుక్రవారం పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులతో నియోజకవర్గ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తదితరులు హాజరయ్యారు. నియోజకవర్గంలోని అధికార పార్టీ పరిస్థితి..సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి అడిగి తెలుసుకున్నారు. పార్టీకి సంబంధించి మండలాల వారీగా బలాబలాలు, నాయకుల పరిస్థితిపై అభిప్రాయాలను సేకరించారు.
పార్టీలో పని చేస్తున్న వారికే పదువులు ఇవ్వాలని ఈ సందర్భంగా కొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. సీనియర్ నాయకుడైన వెంకటస్వామికి టికెట్ ఇవ్వాలని, లేనిపక్షంలో పార్టీలో ఉన్న తమ పేర్లను పరిశీలించాలని నాయకులు కంజర్ల భాస్కర్, షాబాద్ దర్శన్ తదితరులు బోసు రాజు దృష్టికి తీసుకొచ్చారు. అందరి అభిప్రాయాలతో పాటు పార్టీ సర్వేలను అధిష్టానం పరిశీలిస్తుందని ఆయన వారికి తెలిపారు. అనంతరం బోసు రాజు మాట్లాడుతూ.. చేవెళ్ల గడ్డ అంటే ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉందని.. దీనిని చెదరనివ్వకుండా అందరూ సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండాను చేవెళ్ల గడ్డపై ఎగుర వేయాలన్నారు.
పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పని చేయాలని చెప్పారు. పార్టీలో అందరూ సమన్వయంగా పనిచేస్తేనే గెలుపు సాధ్యమని తెలియజేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు నియోజకవర్గాల పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్, మొయినాబాద్, నవాబుపేట మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, పట్టణ ఏ బ్లాక్ అధ్యక్షుడు ప్రభాకర్, బీ బ్లాక్ అధ్యక్షుడు రంగారెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దర్శన్, కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు వీరభద్రస్వామి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, పార్టీ యూత్ మండల అధ్యక్షులు రంగారెడ్డి, టేకులపల్లి శ్రీను, జిల్లా నాయకులు కంజర్ల భాస్కర్, శంకర్‌పల్లి ఎంపీపీ నర్సింలు, జెడ్పీటీసీ కళావతివిఠలయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకటేశం గుప్తా, నాయకులు గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, ప్రకాశ్‌గౌడ్, శివానందం, వెంకటేశ్, శ్రీనివాస్, వనం మహేందర్‌రెడ్డి, వీరేందర్‌రెడ్డి, బాలయ్య, బుచ్చయ్య, రాంచంద్రయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment