ఢిల్లీలో క్లైమాక్స్‌! | Congress Leader MLA Candidate List Is Climax Adilabad | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో క్లైమాక్స్‌!

Published Fri, Nov 2 2018 8:01 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Leader MLA Candidate List Is Climax Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసే స్థానాల సంఖ్య తేలింది. రాష్ట్రంలో 95 సీట్లలో పోటీ చేయనున్న కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బెల్లంపల్లి సీటును మిత్రపక్షానికి త్యాగం చేసింది. ఈ సీటును సీపీఐకి కేటాయించగా.. కోదండరామ్‌ నేతృత్వంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)కి ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కోదండరామ్‌ భేటీ కాబోతున్నారు.

ఈ భేటీ తరువాత జరిగే మార్పులు తప్ప ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం టీజేఎస్‌కు ఉమ్మడి జిల్లాలో సీటు కేటాయించడం లేదు. ఇక కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేసినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా  తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధం చేసిన జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన రెండు సీట్ల విషయంలో మినహా ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. సిద్ధమైన తొలి జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరిశీలన తరువాత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సిర్పూరు, ముథోల్‌పై తేలని సమీకరణలు
ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పది స్థానాలకు గాను సీపీఐకి బెల్లంపల్లి కేటాయించడం ఖరారైంది. ఈ విషయాన్ని సీపీఐ నేతలు కూడా ధ్రువీకరిస్తున్నారు. మిగతా తొమ్మిది సీట్ల విషయంలో పలు నివేదికలు, సర్వేలను పరిశీలించిన తరువాత ఏడుగురు అభ్యర్థుల విషయంలో ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. ముథోల్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, ఆయనకు వరుసకు సోదరుడైన రామారావు పటేల్‌ మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు సమాచారం.

పార్టీ సర్వేలు, ఇతరత్రా నివేదికల ప్రకారం రామారావు పటేల్‌ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న నారాయణరావు పటేల్‌ అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తున్న ట్లు సమాచారం. అలాగే సిర్పూరులో పాల్వాయి హరీష్‌బాబుకు టికెట్టు ఖరారని భావించినప్పటికీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి బ్యాచ్‌లో ఉన్న రావి శ్రీనివాస్‌ విషయంలో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ నుంచి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన వారిలో రావి శ్రీనివాస్‌ ఒకరు. అయితే తెలంగాణ–ఆంధ్రా అనే సెంటిమెంట్‌ రగిలిన సిర్పూరులో రావి శ్రీనివాస్‌కు ఇస్తే ఫలితం ఉండదని నివేదికలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సీట్ల విషయంలో ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.

ఢిల్లీలో వినోద్‌ లాబీయింగ్‌
టీఆర్‌ఎస్‌లో సీటు రాక అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి జి.వినోద్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి చెన్నూరు కాకపోతే బెల్లంపల్లి నుంచైనా పోటీకి సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. అయితే సోదరుడు వివేక్‌తో కలిసి వస్తేనే కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని అధిష్టానం నుంచి సమాచారం అందడంతో ఆయన మీమాంసలో పడ్డారు. గురువారం వినోద్‌ ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలతో లాబీయింగ్‌ చేసినట్లు సమాచారం.

అదే రోజు వినోద్‌ సోదరుడు వివేక్‌ ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో కలిసి టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అంతకు ముందు రోజు పెద్దపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి గ్రామాల్లో ప్రచారం జరిపారు. ఈ పరిస్థితుల్లో వినోద్‌ పోటీ ఏ పార్టీ నుంచి అనే ప్రశ్న ఉత్పన్నమైంది. తాజాగా టీజేఎస్‌లో చేరి చెన్నూరు నుంచి పోటీ చేస్తారనే వార్తలు కూడా వ్యాపించాయి. అయితే ఈ సీటు గ్రూప్‌1 అధికారిగా రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన బోర్లకుంట వెంకటేష్‌ నేత కు ఖరారైనట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీతో భేటీలో కోదండరామ్‌ ఏ విషయాలను చర్చిస్తార నే దానిపై చెన్నూరు సీటు ఆధారపడి ఉంటుంది.

మరో నాలుగు స్థానాల్లో కూడా ఫైనల్‌
ఇప్పటికే నిర్మల్, ఆసిఫాబాద్, ఖానాపూర్‌ నియోజకవర్గాలలో అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం ఇద్దరు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉన్న మరో ఆరు స్థానాల్లో నాలుగు చోట్ల అభ్యర్థులను ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది. చెన్నూరు నుంచి వెంకటేశ్‌ నేతతో పాటు ఆదిలాబాద్‌ నుంచి గండ్రత్‌ సుజాత, మంచిర్యాల నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు, బోథ్‌ నుంచి సోయం బాపురావు పేర్లు ఖరారయ్యాయని సమాచారం. ఏడుగురు అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమీకరణల్లో తప్పనిసరి మార్పులు ఉంటే తప్ప ఈ జాబితానే వెలుగు చూస్తుందనడంలో సందేహం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement