
ఫైల్ ఫోటో (ముఖేష గౌడ్)
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. కొన్ని నెలలుగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖేష్‌గౌడ్.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు తెలిసింది. అతని శరీరం వైద్యానికి సహకరించపోవడంతో వైద్యులు చికిత్స నిలిపివేశారు.
కాగా ఎన్నికల సమయంలో ఆయన అంబులెన్స్‌లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నా ఇప్పటి వరకూ ఆయన కోలుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ముఖేశ్ గౌడ్‌ని ఈ పరిస్థితుల్లో చూసిన ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.