ఎమ్మెల్యే బాజిరెడ్డి వియ్యంకుడు మృతి | Congress Leader Venkateswarlu Decreased With Coronavirus In Nizamabad | Sakshi
Sakshi News home page

కరోనాతో కాంగ్రెస్‌ నేత వెంకులు మృతి

Published Thu, Jul 23 2020 10:52 AM | Last Updated on Thu, Jul 23 2020 5:53 PM

Congress Leader Venkateswarlu Decreased With Coronavirus In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వియ్యంకుడు ఐఎన్‌టీయూసీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నేత వెంకటేశ్వర్లు(వెంకులు) కరోనాలో మృతి చెందారు. కాంగ్రెస్‌ పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మికుల విభాగానికి వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సీనియర్ కార్మిక నాయకుడు అయిన వెంకటేశ్వర్లుకు రాజకీయంగా జాతీయ స్థాయిలో మంచి సంబంధాలను కలిగి ఉన్నారు.  ఆయన మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, కర్షక ప్రతినిధులు సంతాపం తెలిపారు. ఇటీవల వెంకటేశ్వర్లుకు కరోనా వైరస్‌ సోకగా, హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈయన చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస వడిచారు. ఇప్పటికే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ కూడా కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. 

సీనియర్ రాజకీయ నాయకుడు వెంకటేశ్వర్లు మృతి పట్ల రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభుతి తెలియజేశారు. గత ముప్పై ఏళ్లుగా కార్మిక, విద్యార్థి నాయకుడుగా, రాజకీయవేత్తగా, వెంకులు చేసిన ఎనలేని సేవలకు సంబంధించి విషయాలను గుర్తుచేసుకున్నారు. ఎంతో ఆత్మీయంగా ఉండే వెంకులు మృతి తనకు తీరని లోటని డి శ్రీనివాస్‌ తెలిపారు. 

ప్రభుత్వ ఉద్యోగుల్లో ‘కరోనా’ భయం 
జిల్లాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తుండడంతో ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు భయం పట్టుకుంది. పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ‘కోవిడ్‌’ సోకుతుండడంతో కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించాలంటేనే ఉద్యోగులు జంకుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా తమకూ వ్యాపిస్తుందేమోనని వారికి గుబులు పట్టుకుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఎక్కువ ప్రభుత్వ శాఖలు ఉండడంతో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. కలెక్టరేట్‌కు జనం తాకిడి ఉండడంతో ప్రతిరోజూ భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రగతిభవన్‌ మెట్లు ఎక్కాలంటే జంకుతున్నారు. ఆఫీసుల్లో ఏ వస్తువును, టేబుల్, ఫైల్‌ ముట్టుకోవాలన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దూరం దూరంగా ఉండి ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.

కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌
ఉదయం, సాయంత్రం వేళ్లలో చేతులను శానిటైజ్‌ చేసుకుంటున్నారు. అయితే అధికారులకు వినతులు సమరి్పంచడానికి ప్రజలు కార్యాలయాల్లోకి రాకుండా కలెక్టరేట్‌లో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటు అన్ని శాఖల ఉద్యోగులు కూడా అప్రమత్తమయ్యారు. బయటి వ్యక్తులకు రాకుండా కార్యాలయాల ప్రధాన ద్వారాలను మూసి ఉంచుతున్నారు. ప్రగతిభవన్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలతో పాటు ఎస్సీ కార్పొరేషన్, సివిల్‌ సప్లయి, సివిల్‌ సప్లయి కార్పొరేషన్, డీఆర్‌డీఏ, డ్వామా కార్యాలయాలున్నాయి. పక్కనే అక్షర ప్రణాళిక భవన్‌లో ఐకేపీ, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య, సీపీవో, సాక్షర భారత్‌ కార్యాలయాలున్నాయి. ఇక కలెక్టరేట్‌లో ప్రధానంగా కలెక్టర్‌ పరిపాలనా విభాగం (డీఆర్వో కార్యాలయం) ఉంది.

దాదాపు కలెక్టరేట్‌లో పదికి పైగా ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. కలెక్టరేట్‌కు ఆనుకునే వెల్‌నెస్‌ సెంటర్, వ్యవసాయ శాఖ, టీఎన్జీవోస్‌ భవన్, ఎస్‌బీఐ బ్యాంకు, ఇతర వాణిజ్య సముదాయాలున్నాయి. అయితే ప్రధానంగా కలెక్టరేట్‌లోని ఆయా శాఖల్లో ఉద్యోగులు కలిపి 400 మందికి పైగా ఉంటారు. ప్రతినిత్యం ఆఫీసులకు వచ్చి వెళ్తున్నారు. కార్యాలయాలన్నీ ఒకే దగ్గర ఉండడంతో కోవిడ్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఉద్యోగులు ఒక్కింత ఆందోళనలో ఉన్నారు. కొందరయితే సెలవులు పెట్టి ఆఫీసులకు రావడం లేదంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు.

ప్రగతిభవన్‌లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్న సిబ్బంది 

పనిరోజులు తగ్గించాలని వేడుకోలు 
కరోనా భయంతో ఉద్యోగులు, అధికారులు ఆఫీసులకు రావడానికి భయపడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా విధులకు వెళ్లవద్దని కోరుతున్నారు. ఇంటి నుంచే పని చేసుకోండని ప్రాధేయపడుతున్నారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారికి వారంలో మూడు రోజులు మాత్రమే పని కలి్పంచాలని ఇటీవల ఉద్యోగ జేఏసీ ఆద్వర్యంలో కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులందరికీ కరోనా టెస్టులు కూడా చేయించాలని కోరారు. డీఆర్వో ఆఫీసులో పనిచేసే ఉద్యోగులైతే భయపడి తమకు టెస్టు చేయించాలని కలెక్టరేట్‌ ఏవోను ఇటీవల కలిసినట్లు తెలిసింది. రెవెన్యూ వర్గాల్లోనైతే ‘కరోనా’ మరింత కలవరపెడుతోంది. 

కలెక్టరేట్‌లో హైపోక్లోరైట్‌ ద్రావణం పిచికారీ 
ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను కాస్త తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని అన్ని శాఖలతో పాటు ప్రగతిభవన్, ఎన్‌ఐసీ కార్యాలయాల్లో వైద్య శాఖ సిబ్బందితో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఇనుప గేట్లు, మెట్లు, జన సంచారం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో శానిటైజ్‌ చేశారు. దీంతో ఉద్యోగులు కొంత సంతృప్తి చెందారు.

పనిదినాలు తగ్గిస్తేనే మేలు
కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పనిదినాలు తగ్గించాలి. షిప్టుల వారీగా వారానికి కొంతమంది పనిచేసేలా, పనిచేస్తున్న రక్షణ చర్యలు తీసుకోవాలి. కార్యాలయాలకు బయటి వ్యక్తులు రాకుండా చూసి కార్యాలయాలు సానిటైజ్‌ చేయించాలి. ఉద్యోగులకు వారి కుటుంబాల ప్రాణాలు కూడా ముఖ్యం. – అలుక కిషన్, జిల్లా అధ్యక్షుడు, టీఎన్జీవోస్‌

ఉద్యోగులందరికీ టెస్టులు నిర్వహించాలి
రెవెన్యూ ఉద్యోగులతోపాటు ఇతర శాఖల ఉద్యోగులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కూడా పని చేస్తున్నారు. ప్రజలకు ఉద్యోగులకు మధ్య కొన్ని రోజుల పాటు సంబంధాలు లేకుండా చూడాలి. నెలలో పదిహేను రోజులు పనిదినాలు కలి్పంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. పని చేస్తున్న ఉద్యోగులందరికీ కరోనా పరీక్షలు జరపాలి. – రమణ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, రెవెన్యూ అసోసియేషన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement