పార్టీ పరిస్థితి ఏమిటి..? | Congress Leaders Meeting at Dk Aruna Formhouse In Hyderabad | Sakshi
Sakshi News home page

పార్టీ పరిస్థితి ఏమిటి..?

Published Mon, Jan 7 2019 3:23 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Congress Leaders Meeting at Dk Aruna Formhouse In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యులు హైదరాబాద్‌ శివార్లలోని ఫాంహౌస్‌లో భేటీ అయ్యారు. మాజీ మంత్రి డి.కె.అరుణకు చెందిన బండ్లగూడ సమీపంలోని ఫాంహౌస్‌లో ఆదివారం జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు పలువురు ముఖ్య నేత లు హాజరయ్యారు. హాజరైన వారిలో జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌అలీ, పొన్నాల లక్ష్మయ్య, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, సునీతా లక్ష్మారెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, అద్దంకి దయాకర్, కుసుమకుమార్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, హరిప్రియానాయక్, జగ్గారెడ్డి, నల్లమడుగు సురేందర్, హర్షవర్ధన్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్, ఆది శ్రీనివాస్, కె.కె.మహేందర్‌రెడ్డి తదితరులున్నారు. వీరంతా రాష్ట్రంలో పార్టీ పరిస్థితితోపాటు క్షేత్రస్థాయిలోని కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 

రాజకీయం లేదు..
టీపీసీసీ పక్షాన నిర్వహించాల్సిన ఈ భేటీని డి.కె. అరుణ వ్యక్తిగతంగా నిర్వహించడం చర్చనీయాంశమయింది. పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆశిస్తున్న ఆమె చొరవ తీసుకుని రాష్ట్ర నేతలందరినీ ఆహ్వానించడం వెనుక కారణం ఏమై ఉంటుందన్న చర్చ జరిగింది. ఇందులో రాజకీయం ఏమీ లేదని, సీనియర్‌ నాయకురాలిగా అందరితో ఉన్న సత్సం బంధాల కారణం గా అందరినీ ఆహ్వానించానని, తన ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చారని అరుణ చెప్పారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి కారణమేదైనా వ్యక్తిగతంగా పొత్తులు లేకుండా ఉండాల్సిందనేది తన అభిప్రాయమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ పొత్తు అవసరం లేదని తాను భావిస్తున్నానని, అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో చూడాలన్నారు. 

టీఆర్‌ఎస్‌ గెలుపుపై అనుమానాలు..
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపుపై చాలా మంది సామాన్యుల్లో అనుమానం ఉం దని డి.కె.అరుణ పేర్కొన్నారు. ఏదో మతలబు జరిగిందనే వారంతా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర నాయకత్వం విషయంలో హైకమాండ్‌ తగిన సమయంలో నిర్ణయం తీసుకుం టుందని, పార్టీకి నష్టం చేసే పనిని ఎవరూ చేయరన్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశిస్తే తాను లేదా తన కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉంటామని అరుణ చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement