
వైద్య విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్ పరమేష్
సాక్షి, సిటీబ్యూరో: చార్మినార్ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టిన వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఆయుర్వేద భవన్‌ను ఎర్రగడ్డకు తరలించడాన్ని నిరసిస్తూ ఆయుర్వేద కళాశాల విద్యార్థులు బుధవారం ఆస్పత్రి భవనం ఎదుట ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వారిని అరెస్టు చేసే క్రమంలో ఓ విద్యార్థిని పట్ల మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళా కానిస్టేబుళ్లు వారిని పక్కకు లాగేస్తుండగా..చార్మినార్ పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్ పరమేష్ అదే కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న వైద్య విద్యార్థినిని కాళ్లతో తొక్కి...గోళ్లతో గిచ్చడంతో నొప్పి తాళలేక ఆమె బోరున విలపించింది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం సొంత పూచీ కత్తుపై వదిలేశారు. పోలీసుల వైఖరిపై మహిళా సంఘాల నేతలు, ఆయుర్వేద విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కానిస్టేబుళ్ల అత్యుత్సాహం
తరలింపును నిలిపివేయాలని కోరుతూ ఆయుర్వేద వైద్య విద్యార్థులు ఎర్రగడ్డలోని ఆయుర్వేద కళాశాలకు అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రి ఔట్‌పేషంట్ విభాగానికి శనివారం నుంచి తాళం వేసి నిరసన తెలుపుతుండటం, ఇదే సమయంలో మంగళవారం యునానీ ఆస్పత్రికి చెందిన పలువురు వైద్యులు ఆయుర్వేద ఆస్పత్రిలోకి చొరబడి, ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. సిబ్బందిని బలవంతంగా బయటికి పంపడాన్ని నిరసిస్తూ బుధవారం ఆయుర్వేద వైద్య విద్యార్థులు చార్మినార్ ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆయుష్ డైరెక్టర్ అలుగు వర్షిణి అడ్డుకున్నారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుళ్లు సహా మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ పరమేష్ ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. దురుసుగా ప్రవర్తించిన పీసీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
తరలింపుపై వివాదం
1958లో 60 పడకల సామర్థ్యంతో చార్మినార్ ఆయుర్వేద ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. అనంతరం దీనిని సామర్థ్యాన్ని వంద పడకలకు పెంచినప్పటికీ స్థలాభావం కారణంగా 75 పకడలతో కొనసాగుతోంది. ఆస్పత్రి ఔట్ పేషెంట్ విభాగానికి రోజు సగటున 200 మంది రోగులు వస్తుంటారు. వీరిలో 40 నుంచి 50 మంది వరకు ఇన్ పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో 2014లోనే ఈ భవనాన్ని ఖాళీ చేయించాలని నిర్ణయించారు. అయితే అప్పుడు వైద్యుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మరమ్మతుల పేరుతో ఇటీవల ఆస్పత్రిలోని పలు వార్డులను ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కేవలం పదిపడకల సామర్థ్యంతో ఓపీ సేవలను అందిస్తున్నారు. అయితే ఆస్పత్రిని ఉద్దేశపూర్వకంగా తరలి స్తున్నారని, ఈ నిర్ణయంతో ఉద్యోగులే కాకుండా పాతబస్తీ రోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వైద్యులు, వైద్య విద్యార్థులు ఆరో పిస్తున్నారు.
రాజకీయ రంగు
ఆయుర్వేద ఆసుపత్రిని చార్మినార్ నుంచి తరలించాలని యునానీ వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తుండగా...ఆసుపత్రిని తరలిస్తే సహించేది లేదని మరోవైపు ఆయుర్వేద విద్యార్థులు పేర్కొంటున్నారు. ఆయుర్వేద విద్యార్థులకు బీజేపీ నాయకులు డాక్టర్ భగవంత్‌రావు, టి.ఉమామహేంద్ర, పొన్న వెంకటరమణ , ఆలేజితేంద్ర, మెఘారాణి అగర్వాల్, ఉమేశ్ సింగానియా, ప్రవీణ్ బాగ్డీ, సురేందర్‌లు మద్దతు పలకగా, యునానీ వైద్య విద్యార్థులకు మజ్లీస్ నేతలు మద్దతు పలికారు. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మ ద్‌ఖాన్, పత్తర్‌గట్టి కార్పొరేటర్ సోహైల్ ఖాద్రీతో పాటు మరికొందరు నేతలు యునానీ ఆసుపత్రికి చేరుకొని సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ఆందోళన చేస్తున్న ఆయుర్వేద విద్యార్థులు సహా బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఉద్దేశపూర్వకంగా కాదు
చార్మినార్: ఆయుర్వేద ఆసుపత్రిలో బుధవారం జరిగిన సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. పురానీహవేలిలోని దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఆయుర్వేద వైద్య విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఉదయం చార్మినార్‌లోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారన్నారు. ఈ విషయం తెలియడంతో ఆయూష్ డైరెక్టర్ అలుగు వర్షిణి అక్కడికి వచ్చి వైద్య విద్యార్థులతో చర్చలు జరిపారన్నారు. ఆమె తిరిగి వెళుతుండగా కొందరు విద్యార్థినులు ఆమెను అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుందన్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వైద్య విద్యార్థినులను అక్కడినుంచి తొలగించే క్రమంలో కానిస్టేబుళ్లు వారిపట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణ సరైంది కాదన్నారు. పోలీసులు ఎవరిపైనా ఉద్దేశపూర్వకంగా దురుసుగా ప్రవర్తించరని, పరిస్థితుల ప్రభావానికనుగుణంగా అనుకోని సంఘటనలు జరుగుతాయన్నారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమవుతున్న క్లీప్పింగ్‌లను వెంటనే తొలగించాలని విలేకరులను కోరారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.–డీసీపీ అంబర్ కిశోర్ ఝా
Comments
Please login to add a commentAdd a comment