బ్రెయిన్ లో బుల్లెట్
ఐదేళ్లుగా ప్రాణాలతో పోరాడుతున్న కానిస్టేబుల్
ఉగ్రవాది వికార్ చేతిలో గాయపడి.. బుల్లెట్ బాధను భరిస్తున్న రాజేంద్రప్రసాద్
అతను ఏ క్షణాన కుప్పకూలిపోతాడో... ఏ నిమిషాన మృత్యువు కబళిస్తుందో తెలియదు. కుటుంబ సభ్యులు అనుక్షణం అతణ్ణి ఓ కంట కనిపెట్టాల్సిందే. ఐదేళ్ల క్రితం ఉగ్రవాది వికార్ చేతిలో గాయపడ్డాడు. మెదడులోకి దూసుకెళ్లిన తూటాను భరిస్తున్నాడు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తోన్న తరుణంలో తన కుటుంబం ఏమవుతుందోనన్న బెంగతో బతుకుపోరాటం చేస్తోన్న ఓ కానిస్టేబుల్ దీనగాథ ఇది.
ఆ రోజు ఏమైందంటే...
2009 మే 18న ఫలక్‌నుమా ఠాణాకు చెందిన కానిస్టేబుల్ దాసరి రాజేంద్రప్రసాద్(44), హోంగార్డు బాలస్వామి (27) ఫలక్‌నుమా బస్టాండ్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు వారిపై ఉగ్రవాది వికారుద్దీన్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బాలస్వామి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా రాజేంద్రప్రసాద్ తలతోకి బుల్లెట్ (32) దూసుకుపోవడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. 2007 మే 18న జరిగిన మక్కా మసీదు బాంబు పేలుడు ఘటనకు ప్రతీకారంగా ఏటా పోలీసులను టార్గెట్ చేసుకుని వికారుద్దీన్ పంజా విసురుతూనే ఉన్నాడు. ఆ రోజు అతని టార్గెట్‌కు బాలస్వామి, రాజేంద్రప్రసాద్‌లు చిక్కారు.
మెదడు నరాల మధ్యలో...
గాయపడిన రాజేంద్రప్రసాద్‌ను కేర్ ఆసుపత్రికి త రలించారు. అతని తలలోని చిన్న-పెద్ద మెదడు మధ్యలోని నరాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లిందని, అక్కడ నరాలు కాలిపోయాయని వైద్యులు చెప్పారు. ఆ బుల్లెట్ తీస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమా దం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ చేయలేమంటూ నెల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం...
అప్పటి నుంచి మెదడులో ఉన్న బుల్లెట్‌తో రాజేంద్రప్రసాద్ నరకయాతన అనుభవిస్తున్నాడు. బుల్లెట్ వెలికి తీయించేందుకు ఆయన తిరగని ఆసుపత్రి లేదు. చేయని ప్రయత్నంలేదు. నగరంలోని న్యూరోసర్జన్లను కలిసి నిరాశచెందిన రాజేంద్రప్రసాద్ జనవరి 2013న బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ ఆస్పత్రికి వెళ్లి అక్కడి న్యూరోసర్జన్ ఎస్.సంపత్‌ను కలిశాడు. బుల్లెట్ తీస్తే పక్షవా తం, ఫిట్స్‌తోపాటు జ్ఞాపక శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఆపరేషన్ చేయడం కూడా చాలా క ష్టమని చెప్పడంతో నిరాశతో వెనుతిరిగాడు. ప్రస్తుతం ఆయన నగర సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
కోల్పోతున్న కంటి చూపు..
మెదడులో ఐదేళ్లుగా బుల్లెట్ మోస్తున్న రాజేంద్రప్రసాద్ తన కుడి కంటి చూపును 68 శాతం కోల్పోగా, ఎడమ కంటి చూపును 60 శాతం కోల్పోయాడు. బుల్లెట్ గాయంతో మెదడులో నరాలు దెబ్బతినడంతో దాని ప్రభావం కంటి చూపుపై పడింది. కంటి చూపు మెరుగు కోసం ఎన్ని ఆసుపత్రులు తిరిగినా లాభం లేకుండాపోయింది. బైక్ నడపడం, ఎత్తయిన ప్రదేశానికి వెళ్లడం, స్విమ్మింగ్ వంటి పనులు చేయరాదని డాక్టర్లు సలహా ఇచ్చారు. నిత్యం మూడు ట్యాబ్‌లెట్లు వేసుకుంటున్నాడు. ఈ ట్యాబ్‌లెట్లు వేసుకున్న వెంటనే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అయినా తన విధులకు బైక్‌పైనే వెళ్తున్నాడు. అందరి మాదిరిగానే డ్యూటీ చేస్తున్నాడు. డాక్టర్ల సలహాలకు విరుద్ధంగా పనిచేస్తుండటంతో ఏ క్షణాన ఏమవుతుందోనని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యోగం మానేసిన భార్య..
రాజేంద్రప్రసాద్ భార్య ధనలక్ష్మి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఆసుపత్రిలో అకౌంటెంట్‌గా పనిచేసేవారు. ఈ ఘటన జరిగిన తరువాత ఆమె ఉద్యోగం మానేసి భర్తను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఎక్కువ దూరం నడిచినా, ఎక్కువ సేపు టీవీ చూసినా, ఎక్కువ సమయం స్నానం చేసినా ఫిట్స్ వచ్చి కింద పడి పోతాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో అతను గతనెల 19 నుంచి సిక్ లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక పిల్లలు అభినవ్ (11), చంద్రిక (9) నాలుగో తరగతి చదువుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం బతుకుతున్నామని, తమకు ఏదైన జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆ దంపతులు అనుక్షణం భయపడుతున్నారు.