
ఎమ్మెల్యేకు కమీషన్ ఇస్తున్నా..!
- విద్యార్థుల సమక్షంలోనే ఒప్పుకున్న కాంట్రాక్టర్
- జేఎన్‌టీయూ మెస్ నిర్వహణపై విద్యార్థుల ఆందోళన
మెదక్(పుల్‌కల్): సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూలో మెస్ నిర్వహణకుగాను కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి తాను ఎమ్మెల్యేకు నెలకు రూ.50 వేల కమీషన్ ఇస్తున్నానంటూ విద్యార్థుల సమక్షంలోనే పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు తమ వద్ద మెస్ బిల్లులు వసూలు చేస్తూ నాణ్యమైన భోజనం పెట్టకుండా ఎమ్మెల్యేకు కమీషన్ ఇస్తే తమ కేం సంబంధంమంటూ కాంట్రాక్టర్‌ను నిలదీసి, మంగళవారం రాత్రి మరోమారు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత ఐదు రోజులుగా జేఎన్‌టీయులో మెస్ నిర్వహణ సక్రమంగా లేదంటూ మంగళవారం నుంచి విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో క్యాంపస్ ప్రిన్సిపాల్ కాంట్రాక్టర్‌ను మార్చి కొత్త వారిని నియమిస్తామని హామీ ఇచ్చినా విద్యార్థులు ఆందోళన విరమించలేదు. దీంతో బుధవారం సాయంత్రం కాంట్రాక్టర్ వచ్చి అన్నం బాగానే ఉందని విద్యార్థులే ఉద్దేశ పూర్వకంగా గొడవలు చేస్తున్నారన్నారు. దీంతో విద్యార్థులు తాము మూడు రోజులుగా ఆకలితో అలమటిస్తుంటే ఉద్దేశపూర్వకంగా గొడవలు చేస్తున్నామంటారా.. ఓ సారి మీరే అన్నం తిని చూడండంటూ కాంట్రాక్టర్‌ను నిలదీశారు.
సెలవులో వెళ్లినా మొత్తం మెస్ చార్జీలు చెల్లించాల్సిందే..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూలో విద్యార్థుల నుంచి నెలకు రూ.2,400 లను మెస్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. అయితే కాంట్రాక్టర్ టెండర్ సమయంలో పేర్కొన్న మాదిరిగా మెనూ ఇవ్వడం లేదు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, సాయంత్ర భోజనం పెట్టాలి. సెలవుపై మూడు రోజులకు మించి వెళ్తే అట్టి డబ్బులను నెలవారీగా డబ్బులు చెల్లించే సమయంలో మినహాయించి ఇవ్వాలి. అయితే ఇక్కడి ప్రిన్సిపాల్, మెస్ కాంట్రాక్టర్ కుమ్మక్కై సెలవుపై వెళ్లినా.. విద్యార్థుల నుంచి పూర్తిస్థాయి మెస్ చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని విద్యార్థులు పీడీని, కాంట్రాక్టర్‌ను ప్రశ్నిస్తే వారివద్ద సమాధానం లేదు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
మంచి భోజనం పెట్టకుంటే కాంట్రాక్టు రద్దు చేయండి: ఎమ్మెల్యే
మెస్ నిర్వహణ సక్రమంగా లేకపోతే కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసి కాంట్రాక్టును రద్దుచేయాలని ఎమ్మెల్యే బాబూమోహన్ జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. మెస్ కాంట్రాక్టర్ నెలకు రూ.50వేల మామూళ్లు ఇస్తున్నట్లు వచ్చిన ఆరోపణపై ఎమ్మెల్యేను వివరణ కోరగా తాను ఎవరివద్దా డబ్బులు తీసుకోలేదని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుంటే నోటీసులు జారీ చేసి టెండర్‌ను రద్దుచేయాలని సూచించారు.