ముంబై : డ్రైనేజీ పనులు సరిగా చేయలేదని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్టరుపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. వర్షం కారణంగా నిలిచిన వరద నీటిలో కూర్చోబెట్టారు. పక్కనున్న చెత్తను తీసి కాంట్రాక్టరు నెత్తిన వేశారు. శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే సమక్షంలోనే ఈ అమానవీయ ఘటన జరిగింది. ముంబైలో చండీవలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
డ్రైనేజీపై రగడ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంబై నగరం నీట మునిగింది. రోడ్లపై వర్షపు నీరు ఏరులై పారింది. దీంతో తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న చండీవలి ప్రాంతంలో డ్రైనేజీ నీరు తొలగించాలంటూ పదిహేను రోజుల కిందట ఆ ఏరియా కాంట్రాక్టర్‌ని ఎమ్మెల్యే దిలీప్ లాండే ఆదేశించారు.
పరిష్కరించలేదు
రెండు వారాలు గడిచినా కాంట్రాక్టరు సమస్యను పరిష్కరించలేదు. దీంతో శివసేన కార్యకర్తలే అక్కడ బురద, చెత్తను తొలగించి వర్షపు నీరు పోయేలా పనులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కాంట్రాక్టరు అక్కడికి చేరుకున్నాడు.
ఒక్కసారిగా దాడి
కాంట్రాక్టరును చూడగానే ఎమ్మెల్యే, అతని అనుచరులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. బురదలో కూర్చోవాలంటూ ఒత్తిడి చేశారు.... చివరకు బురద నీటిలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత అక్కడున్న చెత్తను తెచ్చి అతని తలపై , ఒంటిపై వేశారు. తప్పు జరిగిందని వేడుకున్నా ... వినకుండా దుర్భాషలాడారు. కాంట్రాక్టరు తన బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదు. అందువల్లే ఇలాంటి చర్యకు పాల్పడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే దిలీప్ పాండే వివరణ ఇచ్చారు.
ఇదే నీతి మీకు వర్తిస్తుందా ?
కాంట్రాక్టరుపై ఎమ్మెల్యే జరిపిన దాడిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టరు తరహాలోనే పనులు చేయని ప్రజాప్రతినిధులను కూడా శిక్షించాలంటూ మెజారీటీ ప్రజలు డిమాండ్ చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్లను శిక్షించాల్సందేనంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా...తప్పులను సరిదిద్దేందుకు చాలా మర్గాలు ఉన్నాయని, ఇలాంటి అమానవీయ శిక్షలు సరికాదని మరికొందరు అన్నారు.
చదవండి: ఘోరం: చెట్టుకు మైనర్ల ఉరి.. హత్యాచారం !
Comments
Please login to add a commentAdd a comment