వంటిల్లు.. వర్ధిల్లే.. | Cooking Gas Consumption Rise in Hyderabad | Sakshi
Sakshi News home page

లాక్‌ డౌన్‌ టైం.. కిచెన్‌ రూం బిజీ..బిజీ..

Published Fri, Apr 17 2020 10:38 AM | Last Updated on Fri, Apr 17 2020 10:38 AM

Cooking Gas Consumption Rise in Hyderabad - Sakshi

పానీపూరీ నుంచి పావుబాజీ దాకా.. ఇడ్లీ నుంచి చపాతీ, వడ దాకా.. మిర్చీ నుంచి ఆలూబజ్జీ.. జిలేబీ దాకా.. కేక్‌లు.. ఐస్క్రీమ్‌లు.. స్వీట్లు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నో వైవిధ్యభరితమైన వంటలు. చవులూరించే నలభీమపాకాలు.. జిహ్వ.. వాహ్వా అనే రుచులు. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనాల దాకా రకరకాల వెరైటీలు ఇంటి మెనూలో స్థానం సంపాదించుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్‌లు, టిఫిన్‌ సెంటర్లు, స్ట్రీట్‌ఫుడ్‌ సెంటర్లు మూతపడ్డాయి. ఏం తినాలన్నా.. ఏం తాగాలన్నా ఇంట్లోనే తయారు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతి ఇల్లూ ఓ వంటిల్లే అయ్యింది. ప్రతి చేయీ గరిటె పట్టింది. కిచెన్‌లో చికెన్‌ వండుతోంది. మటన్‌లో మసాలా దట్టిస్తోంది. విభిన్న రకాల రుచులకు శ్రీకారం చుడుతోంది. ఏనాడూ వంటింట్లోకి వెళ్లని మగవాళ్లూ నలభీములే అవుతున్నారు. గృహిణులు సైతం రుచులకు మరింత సాన పెడుతున్నారు. మొత్తంగా నగరంలోని ఇల్లిల్లూ మధురమైన వంటకాలతో వర్ధిల్లుతోంది. టేస్టీ ఫుడ్‌కు దోస్తానాగా మారుతోంది. వంటగ్యాస్‌ సైతం విరివిగా వినియోగమవుతోంది.  

రోజూరెండు పాల పాకెట్లు తెస్తే  ఉదయం, సాయంత్రం టీ, కాఫీలతో పాటు కొద్దిగా పెరుగు కూడా చేసుకొనేవాళ్లం. ఇప్పుడలా కాదు. రోజుకు 4 పాకెట్లు ఖర్చవుతున్నాయని చెప్పారు సికింద్రాబాద్‌కు చెందిన కల్పన. గతంలో నాన్‌వెజ్‌ వారానికిరెండుసార్లు వండుకొనేవాళ్లం. ఇప్పుడు నాన్‌వెజ్‌ వినియోగం పెరిగింది. పిల్లల కోసం చికెన్‌ పకోడా, చికెన్‌ మలాయికోస్త,పీస్‌ మసాలా వంటి వెరైటీలు చేసుకుంటున్నామంటున్నారు కేపీహెచ్‌బీకి చెందిన కమలాదేవి

సాక్షి, సిటీబ్యూరో:  లాడ్‌డౌన్‌. హోటళ్లు.. రెస్టారెంట్లు బంద్, మెస్సులు లేవు. టిఫిన్‌ సెంటర్లు, స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లు కనిపించవు. బయట చాయ్‌ తాగాలన్నా చిక్కులే.  కారణం కరోనా. ఏంతినాలన్నా ఇంట్లో తయారు  చేసుకోవలసిందే. ఉదయం టీ, కాఫీ మొదలుకొని సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనాల వరకు అన్నీ ఇంట్లో వండుకోవలసిందే. దీంతో నగరంలో  ఇంటిఫుడ్‌ వినియోగం బాగా పెరిగింది. గతంలో  ఉదయం టిఫిన్‌ చేసి లంచ్‌ బాక్సులు సర్దుకొని పిల్లలు స్కూళ్లకు, పెద్దవాళ్లు ఆఫీసులకు వెళ్లి  తిరిగి సాయంత్రం  ఇంటికి  చేరుకొనేవారు. ఇక  రాత్రి  భోజనాల కోసం ఏదో ఒకటి వండుకొని తినేస్తే  ఆ రోజు గడిచిపోయేది. పైగా  వీకెండ్‌ సెలవులు, ఆదివారాలు, ఏ హోటలుకో, రెస్టారెంటుకో  వెళ్లి ఇంటిల్లిపాది చక్కగా  హాయిగా భోంచేసే అవకాశం  ఉండేది. కానీ ఇప్పుడు లాక్‌డౌన్‌.. అన్నింటికీ బ్రేక్లు వేసింది. పానీ పూరీ మొదలుకొని పావ్‌బాజీ వరకు, ఇడ్లీ, వడ, చపాతి వంటి ఉదయపు అల్ఫాహారం నుంచి సాయంత్రం పూట ఆరగించే మిర్చీలు, ఆలూబజ్జీలు, జిలేబీలు, పిల్లలకు ఇష్టమైన కేకులు, ఐస్‌క్రీములు, స్వీట్లు...ఒకటేమిటి  ఏం కావాలన్నా ఇంట్లో చేసుకోవలసిందే.

దీంతో వంటింటిపైన భారం  భారీగా పెరిగింది.  ఉమ్మడి కుటుంబాల్లో  వంటింటి పని భారం రెండు రెట్లు పెరిగింది. అందుకు తగినట్లుగానే గ్యాస్‌ వినియోగం కూడా బాగా ఎక్కువైంది. నలుగురు కుటుంబసభ్యులు ఉన్న ఇంట్లో గతంలో  సిలిండర్‌  35 రోజుల నుంచి 40 రోజుల వరకు వినియోగించుకొనేవాళ్లు. ఇప్పుడు  20 నుంచి 25 రోజులకే ఒక సిలిండర్‌  ఖర్చవుతుందని  మౌలాలీ హౌసింగ్‌ బోర్డుకు చెందిన  అన్నపూర్ణ  తెలిపారు. ‘‘ పొద్దున పిల్లలకు టిఫిన్లు  తినిపించేసి లంచ్‌ బాక్సులు పెట్టేస్తే సరిపోయేది.  డబ్బులిస్తే  స్కూళ్లలోనే ఏదో ఒకటి కొనుక్కొని తినేవాళ్లు, ఇప్పుడు అలాకాదు. పిల్లలతో సహా ఇంటిల్లిపాదికి టిఫిన్లు, స్నాక్స్‌ తప్పనిసరయ్యాయి. పని భారం పెరిగింది. వంటగ్యాస్‌వినియోగం కూడా ఎక్కువైంది.’’ అని చెప్పారు. 

వెరైటీల కోసం వెదుకులాట...
నిత్యం ఉరుకులు పరుగులతోనిత్యం బిజీగా  ఉండే నగరజీవి  సాధారణంగా అయితే   ఏదో ఒకటి తినేసి  ఆకలితీర్చుకుంటాడు. తిరిగి పనిలో పడిపోతాడు. కానీ ఇప్పుడలా కాదు. పిల్లలు, పెద్దలు అంతా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో  ఇంట్లో  అందరి చూపులూ  వంటింటిపైనే పడుతున్నాయి. ఏదో ఒక వెరైటీ కోసం  వెదుకులాడుతున్నారు. గతంలో ఉదయం, సాయంత్రం  మాత్రమే  టీ,కాఫీ  తాగేవాళ్లు ఇప్పుడు రోజుకు నాలుగైదుసార్లు  తాగేస్తున్నారు. ‘‘ రెండు పాలపాకెట్లు  తెస్తే  ఉదయం, సాయంత్రం  టీ,కాఫీలతో పాటు కొద్దిగా పెరుగు కూడా చేసుకొనేవాళ్లం. ఇప్పుడలా కాదు.రోజుకు 4 పాకెట్లు  ఖర్చవుతున్నాయి. టీకాఫీలు ఎక్కువే తాగేస్తున్నాం.’’ అని చెప్పారు సికింద్రాబాదుకు చెందిన కల్పన. కాలక్షేపం కోసం టీలు తాగాల్సి వస్తోందంటూ  విన్మయం  వ్యక్తం చేశారు.  మరోవైపు గతంలో వారానికి ఒకసారి  మటన్, చికెన్‌ వండుకొనేవాళ్లు  ఇప్పుడు వారంలో కనీసం రెండు, మూడుసార్లు  తినేస్తున్నారు.పైగా వాటిలోనూ  రకరకాల వెరైటీలు ఆరగించేస్తున్నారు. బిరియానీలు, పులావ్లు, ఫ్రైలు వంటి రకరకాల  వెరైటీలు ఇళ్లల్లోనే  వండుకుంటున్నారు. ‘‘ పిల్లల కోసం స్నాక్స్‌ చేస్తే వాళ్లు మాత్రమే తినరు కదా. ఇంట్లో అందరి కోసం  ఎక్కువే చేయవలసి వస్తుంది. దీంతో వంటగ్యాస్‌ బాగా ఖర్చవుతుంది. గతంలో ఒక డబ్బా నిండా గారెలు చేస్తే  కనీసం వారం, పది రోజులు వచ్చేవి. ఇప్పుడు నాలుగు రోజుల్లో డబ్బా ఖాళీ. ఇక స్వీట్లు కూడా అంతే.

పెరిగిన  వంట గ్యాస్‌ వినియోగం

లాక్‌డౌన్‌లో ఇంటి వంటలు పెరగడంతో మహానగరంలో   పది నుంచి ఇరవై శాతం వరకు వంట గ్యాస్‌ వినియోగం పెరిగింది. వంట గ్యాస్‌కు డిమాండ్‌ పెరిగినా.. బుకింగ్‌– బుకింగ్‌ కు మధ్య 14 రోజుల వ్యవధి నిబంధనతో సరఫరా మాత్రం సాధారణ రోజుల కంటే అదనంగా రెండు శాతానికి మించడం లేనట్లు తెలుస్తోంది. గ్రేటర్‌ పరిధిలో ప్రధాన చుమురు సంస్థలకు చెందిన సుమారు 26.21 లక్షల  గృహ వినియోగ వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, అందులో 60 శాతం వరకు సింగిల్‌ సిలిండర్‌ కనెక్షన్లు, మిగతా 40 శాతం డబుల్‌ సిలిండర్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి ఒక కుటుంబానికి ఏడు నుంచి  8 సిలిండర్లు,  ఉమ్మడి కుటుంబానికి 11 నుంచి 12 సిలిండర్లు మించవు. సాధారణంగా మూడు ప్రధాన కంపెనీలకు చెందిన సుమారు 120కు పైగా డీలర్ల గోదాములకు కలిపి ప్రతి రోజు 80 వేల సిలిండర్లు వరకు దిగుమతి అవుతుండగా.. గృహ వినియోగదారులకు సుమారు 52 వేల 62 వేల వరకు సిలిండర్లు డోర్‌ డెలివరీ జరిగేది.  తాజాగా మరో రెండు శాతం డెలివరీ పెరిగినట్లు గ్యాస్‌ డీలర్లు చెబుతున్నారు. వాస్తవంగా  గత నెల చివరి వారం లాక్‌డౌన్‌ విధించిన ఆరంభంలో వంటగ్యాస్‌ వినియోగదారుల ఆందోళన, ముందు జాగ్రత్త చర్యలతో ఒకే సారి చమురు సంస్థలకు  గ్యాస్‌బుకింగ్‌ పెరిగింది. దీంతో ఆయిల్‌ కంపెనీలు అనవసర బుకింగ్‌ను కట్టడి చేసేందుకు 14 రోజుల వ్యవధికి నిబంధన అమలు వర్తింపజేయడంతో ఆ తర్వాత బుకింగ్‌ అదుపులోకి వచ్చింది. అప్పటికే బుకింగ్‌ జరిగిన కనెక్షన్లకు దశలవారిగా సిలిండరు డోర్‌డెలివరీ జరగడంతో వినియోగం పెరిగినా గ్యాస్‌ కొరత లేనట్లు కనిపిస్తోంది.

వంట గ్యాస్‌ కొరత లేదు  
లాక్‌డౌన్‌లో వంట గ్యాస్‌ వినియోగం పెరిగింది వాస్తవమే. అయినా  గ్యాస్‌ కొరత లేదు. ఎమర్జెన్సీ సర్వీసుల కింద  సరఫరాయథావిధిగా ఉంటుంది. ఆందోళన చెందవద్దు. సిలిండర్‌ డోర్‌డెలివరీ సమయంలో సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలి. కంటోన్మేంట్‌ జోన్‌ల్లోని గృహాలకు బారికేడ్ల వరకు మాత్రమే సిలిండర్‌ రీఫిల్‌ డెలివరీ చేస్తాం. సిలిండర్లను  శుభ్రంగా డెటాల్స్‌తో శుభ్రపర్చుకోవాలి. –  అశోక్, అధ్యక్షుడు,వంట గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్, హైదరాబాద్‌

అందరి కోసం ఏదో ఒకటి చేయాల్సిందే  
లాక్‌డౌన్‌ వల్ల ఇప్పుడు అందరం ఇంట్లోనే ఉంటున్నాం. కాబట్టి  వంటలు ఎక్కువే చేయవలసి వస్తోంది. గతంలో నాన్‌వెజ్‌ వారానికి రెండుసార్లు వండుకొనేవాళ్లం. ఇప్పుడు నాన్వెజ్‌ వినియోగం పెరిగింది. అలాగే పిల్లల కోసం చికెన్‌ పకోడ, చికెన్మలాయీకోస్తా, పీస్‌ మసాలా వంటి వెరైటీలు చేస్తున్నాను. టీవీల్లో ఏ వెరైటీ వంటకం కనిపిస్తే ఇంట్లో  అది చేసేయ్యాలని పిల్లలు డిమాండ్‌ చేస్తున్నారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాల కోసం  వంట చేయడం కంటే టీ, కాఫీలు,స్నాక్స్‌ కోసం వంటింట్లో  ఎక్కువగా గడపాల్సివస్తోంది. – కమలాదేవి, కూకట్‌పల్లి, హౌసింగ్‌ బోర్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement