బురుడుగల్లిలో కార్డన్ సెర్చ్ చేస్తున్న సీపీ కార్తికేయ, పోలీసులు
నిజామాబాద్ క్రైం (నిజామాబాద్ అర్బన్): జిల్లాలో శాంతిభద్రతల కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, తద్వారా అనుమానితులు, చోరీలకు గురైన వాహనాలు బయటపడే అవకాశాలు ఉన్నందున దీనికి అందరూ సహకరించాలని సీపీ కార్తికేయ ప్రజలను కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి బురుడుగల్లి ప్రాంతంలో ఉదయం 4 నుంచి 6 గంటల వరకు సీపీ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజల తలుపులు తడుతుంటే ఏమైందోనంటూ కొంతమంది భయపడ్డారు. వీరు తలుపులు తీసేందుకు సందేహం వ్యక్తం చేయగా, ఈ ప్రాంతాలకు చెందిన వారితోనే పోలీసులు తలుపులు తెరిపించి వారిని భయటకు రప్పించారు. అనంతరం పోలీసులు వారికి అసలు విషయాలు తెలుపుతూ వారి వివరాలు, వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 66 బైకులు, నాలుగు ఆటోలు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటి వరకు ఎనిమిది ప్రాంతాల్లో..
అనంతరం సీపీ కార్తికేయ మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో 8 ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. గురువారం దాదాపు 300 మంది పోలీసు బలగాలతో తనిఖీలు చేశామన్నారు. నేరాల నియంత్రణ కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. దీని ద్వారా కొద్దిగనైనా నేరాలు అదుపులో ఉంటాయన్నారు. ఎవరూ ఎలాంటి పరిచయం లేనివారికి తమ ఇండ్లు అద్దెకు ఇవ్వరాదన్నారు.
కొత్త వ్యక్తులకు అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. అనుమానితులు కాలనీలో తిరుగుతుంటే వారి సమాచారం తెలుసుకుని దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరు వాహనాల ప్రతాలు తమవద్ద ఉంచుకోవాలని, ఇతరులకు తమ వాహనాలను ఇవ్వద్దని, వారు మీ వాహనాలపై వెళ్లి నేరాలు చేస్తారని, ఆ నేరం వాహన యజమానిపై పడుతుందన్నారు.
నేరాల నియంత్రణ కోసం ప్రతిఒక్కరు పోలీసులకు సహకరించాలన్నారు. ఆర్థిక స్థోమత గలవారు తమ ఇండ్ల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వీటి ద్వారా ఎన్నో చోరీలకు పాల్పడిన వారిని పట్టుకున్నామన్నారు. కిడ్నాప్ కేసులో నిందితులను సులువుగా పట్టుకున్నామని గుర్తు చేశారు. ద్విచక్రవాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మరాదన్నారు.
ప్రజల సమస్యలపై డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ కోరారు. చిన్నచిన్న విషయాలకు గొడవలకు పోకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, అందుకు స్థానిక పోలీసుల సహకారాన్ని పొందాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో అన్ని పనులకు టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నామని, గల్ఫ్ మోసాల నియంత్రణలో భాగంగా పోలీస్ కళాబృందం ద్వారా ప్రచారం చేస్తున్నామన్నారు.
తనిఖీలలో అదనపు డీసీపీ ఆకుల రాంరెడ్డి, నిజామాబాద్, బోధన్, ఎన్‌ఐబీ, ఏఆర్ ఏసీపీలు సుదర్శన్, రఘు, సీహెచ్ మల్లిఖార్జున్, జి. రవీందర్, ఎస్‌బీ సీఐ రాజశేఖర్, సోమేశ్వర్‌గౌడ్, 12 మంది సీఐలు, ఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ 215 మంది, మహిళా పోలీసులు 28 మంది, డిప్యూటీ మేయర్ ఫయీమ్, 25వ డివిజన్ కార్పొరేటర్ ఫాతీమా జెహార్(ఎజాస్ సాగర్) పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment