సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం వ్యవసాయరంగంపై కూడా పడింది. బోరుబావులపై ఆధారపడి సేద్యం చేసే రైతులను ఈ వైరస్ పరోక్షంగా కష్టాల్లోకి నెట్టింది. వానాకాలం సీజన్‌కు సిద్ధమవుతున్న రైతులోకం.. పంటల సాగుకు బోర్ల తవ్వకం, పంపుసెట్లు, పొలాలకు నీరు తరలించేందుకు పైప్‌లైన్ల విస్తరణ పనులు మొదలుపెట్టింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా వ్యవసాయ పంపుసెట్లు, పీవీసీ పైపులు, బోరు మోటార్ పైపులతో పాటు ఇతర సామగ్రికి తీవ్ర కొరత ఏర్పడింది. స్థానికంగా తయారు చేసే పీవీసీ, జీఐ పైపుల పరిశ్రమల్లో పనిచేసే కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడంతో అక్కడ తయారీ నిలిచిపోయింది.
గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పంపుసెట్లు, ఇతర సామగ్రి దిగుమతి లేక రాష్ట్రంలో వీటి లభ్యత అరకొరగానే ఉంది. దీంతో ఉన్న స్టాకుకు అడ్డగోలుగా ధరలు పెంచేశారు. దీంతో చిన్న, సన్నకారు రైతులపై ఆర్థికంగా భారం పడింది. రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల పైచిలుకు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లున్నా యి. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో బోరుబావులను నమ్ముకొని సేద్యం చేస్తున్న రైతులు ఇప్పుడు పంపుసెట్లు, పీవీసీ, జీఐ పైపుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సామగ్రి విక్రయాలకు కేంద్రంగా చెప్పుకునే రాజధానిలోని రాణిగంజ్ మార్కెట్‌పై లాక్‌డౌన్ ప్రభా వం తీవ్రంగా పడింది. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వ్యవసాయ పరికరాల సరఫరా జరుగుతుంది. అక్కడి డీలర్ల దగ్గర సరైన స్టాక్ లేకపోవడంతో సబ్ డీలర్లకు సరఫరా నిలిచిపోయింది.
దొరకని పీవీసీ పైపులు..
పంట పొలానికి నీళ్లందించేందుకు గాను బోరు మోటారు నుంచి పైపులైన్లు వేయడానికి పీవీసీ పైపులు వాడతారు. సీజన్‌కు ముందుగానే రైతులు కావాల్సిన పైపులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసి భూమిలో లైను వేస్తారు. ఈ సారి కరోనా వైరస్‌తో పీవీసీ పైపుల కంపెనీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్ర రాజధానికి చుట్టుపక్కల జిల్లాల్లో ప్రముఖ కంపెనీలకు చెందిన ఫ్యాక్టరీలున్నాయి. కార్మికులు లేకపోవడంతో పైపుల తయారీ ఆగిపోయింది. దీంతో సరఫరా లేక, పైపులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడక్కడా ఉన్నా వ్యాపారులు, డీలర్లు ధరలు పెంచి అమ్ముతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక ధరలకు కొనాల్సి వస్తోంది.
పంపుసెట్లకూ కొరత..
వ్యవసాయ బోర్లకు చెందిన పంపుసెట్లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇవి చాలా వరకు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తయారవుతాయి. ప్రముఖ కంపెనీలు అక్కడి నుంచే దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ఆయా ప్రాంతాల్లో కరోనా తీవ్రత ఉండటంతో వాటిని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఆంక్షల సడలింపులలో వ్యవసాయ పరికరాల కంపెనీలకు మినహాయింపున్నా.. రెడ్‌జోన్ కారణంగా ఆయా ప్రాంతాల్లో కంపెనీల్లో తయారీ, సరఫరా ఆగిపోయింది. కాగా తాను 15 రోజులుగా ప్రయత్నిస్తున్నా పంపు మోటార్లు దొరకడం లేదని కామారెడ్డి జిల్లా తిప్పాపూర్‌నకు చెందిన గొల్ల సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో కాలువలు తవ్వించినా పైపులు లేక అవస్థలు పడుతున్నామని వెల్లడించారు.
మోటార్ పైపులదీ అదే పరిస్థితి!
బోరులో మోటార్‌కు బిగించే జీఐ పైపులు కూడా లభ్యం కావడం లేదు. సాధారణంగా సీజన్‌లో డీలర్లు, వ్యాపారుల దగ్గర స్టాక్ ఉంచుతారు. లాక్‌డౌన్‌తో దుకాణాలు మూసి ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తెరిచినా పైపుల తయారీ, సరఫరా లేకపోవడంతో వాటికి కొరత ఏర్పడింది. కొద్దిపాటి స్టాక్ ఉన్న వ్యాపారులు, డీలర్లు అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నారు. ఇటు జీఐ పైపులతో పాటు కప్లింగులు, గేట్ వాల్, టీ–వంకబెండ్లు కూడా మార్కెట్లో దొరకట్లేదు..
సరఫరా నిలిచిపోయింది..
మోటార్లు, పంపులు రావడం లేదు. పైనుంచి రాకపోవడంతో రైతులకు వీటిని సరఫరా చేయలేకపోతున్నాం. మోటారు, పంపులు తయారు చేసే పరిశ్రమలు కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఉండటంతో ఉత్పత్తి నిలిచిపోయింది. ఇటు ఇతర రాష్ట్రాల నుంచి వీటి దిగుమతి ఆగిపోయింది. వ్యవసాయ పనులు మొదలు కావడం.. రైతులు పంపులు, మోటార్ల కోసం తిరుగుతుండటంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది.
– సందీప్, పంపుసెట్ల విక్రేత, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment