'కరోనా' సమ్మర్‌ | Corona Virus That Has Hit Summer Businesses In Crisis | Sakshi
Sakshi News home page

'కరోనా' సమ్మర్‌

Published Sun, May 3 2020 2:36 AM | Last Updated on Sun, May 3 2020 2:36 AM

Corona Virus That Has Hit Summer Businesses In Crisis - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మండుటెండలో ప్రయాణిస్తూ నీరసించినప్పుడు రోడ్డు పక్కన ఆగి ఓ కొబ్బరి బొండం తాగుతుంటే ఆ మజానే వేరు... సాయంత్రం వేళ మన వీధిలోకి గంట మోగిస్తూ వచ్చే ఐస్‌క్రీం బండి వద్ద ఓ హిమక్రీము లాగిస్తుంటే ప్రాణం లేచొచ్చినట్లు అనిపిస్తుంది... మామిడి పండ్లు, తాటి ముంజలను కొనుక్కొని ఇంటిల్లిపాదీ ఆ రుచులను ఆస్వాదించడం తెలుగిళ్లలో అందరికీ పరిపాటే... ఇవేకాక లస్సీ, బాదంపాలు, ద్రాక్ష రసం, ఫ్రూట్‌ మిక్స్, ఫలూదా, లెమన్‌ సోడా, మజ్జిగ, పైనాపిల్, ఖర్బూజా, పుచ్చకాయ వంటివన్నీ ప్రజల వేసవి తాపాన్ని తీర్చేవే. ఎండాకాలంలో సామాన్యులకు నిత్య జీవన అవసరాలే.

వేసవిలో మాత్రమే ప్రత్యేకమైన ఉపాధిని, వ్యాపారాలను కల్పించేవే. చిరువ్యాపారులకు ఆర్థిక తోడ్పాటు అందించేవే. కానీ ఈసారి మాత్రం కరోనా మహమ్మారి రాష్ట్రంలో లక్షలాది మంది చిరు వ్యాపారుల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్, అమలు చేస్తున్న కర్ఫ్యూ వల్ల ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి లేకపోవడంతో చిరువ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారు. కొబ్బరి బొండాల నుంచి కుండలు అమ్మే కుమ్మరుల వరకు, పెళ్లి మం త్రాలు పఠించే పూజారుల నుంచి... పందిళ్లు వేసే మేదరులు, హుషారు నింపే బ్యాండు మేళాల వారి వరకు ఈ వేసవి చేదు అనుభవాలనే మిగులుస్తోంది. చదవండి: అడవిబిడ్డలు ఆగమాగం 

శీతలం... అతలాకుతలం
వేసవి కాలమంటే గుర్తుకు వచ్చేవి వివిధ రకాల పండ్ల రసాలు, వాటిని ఖరీదైన అద్దాల మేడల్లో అమ్మినా.. రోడ్డు పక్కన గిన్నెల్లో పోసి అమ్మినా.. ప్రజల స్థాయి, వారు నివసించే ప్రాంతాన్ని బట్టి రాష్ట్ర జనాభాలో 70% మందికి వేసవిలో ఇవి దాహార్తిని తీరుస్తాయి. అందుకే ఈ వ్యాపారాలపై ఆధారపడి రాష్ట్రంలో వేలాది మంది జీవిస్తున్నారు. సగటున ఈ వ్యాపారాలపై ఆధారపడిన కుటుంబాలు ప్రతి వేసవిలో రూ. 2 లక్షల నుంచి 4 లక్షల వరకు టర్నోవర్‌ చేస్తాయి. లాభాన్ని పొదుపుగా ఖర్చు చేసుకుంటూ కుటుంబాలను ఏడాది అంతా నడిపిస్తారు. కానీ ఈ వేసవిలో రోడ్ల మీదకు వచ్చేవారు లేకపోవడం, కరోనా భయంతో చల్లని పదార్థాలను ఇష్టపడక పోతుండటంతో ఈ వృత్తిపై ఆధారపడ్డ కుటుం బాలు అల్లాడిపోతున్నాయి. మార్చి 22 నుంచి దుకాణాలు మూసి వేయడం, బండ్లు పెట్టి అమ్ముకొనే అవకాశం లేకపోవడంతో మళ్లీ మామూలు పరిస్థితులు ఎప్పుడు వస్తాయా అని వారంతా కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికే సగం వేసవి అయిపోవడంతో మళ్లీ ఎండాకాలం వచ్చే వరకు కుటుంబాలను ఎలా నడిపించాలో అర్థంకాక సతమతమవుతున్నారు.

పేజీలు చినిగిన పెండ్లి పుస్తకం...
కరోనా కారణంగా ఏటా జరిగే వేలాది పెళ్లిళ్లు వాయిదా పడటంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. పెళ్లంటే... ఆ రెండు కుటుంబాలు, వారి బంధువులకు సంబంధించిన వ్యవహారమే కాదు. ఫంక్షన్‌ హాళ్లు, వాటి నిర్వాహకులు, వాటిలో పని చేసే సిబ్బంది, పెళ్లి మంత్రాలు చదివే పురోహితులు, పెళ్లికి పందిళ్లు వేసే మేదరులు, పెళ్లి జ్ఞాపకాలను పదిలపరిచే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, బ్యాండు మేళం ట్రూపు, డెకరేషన్, లైటింగ్‌ సిబ్బంది, వంట మనుషులు, చాకలి, మంగలి కులస్తులు, పూల వ్యాపారులు, టెంట్‌ హౌస్‌ నడిపేవారు, వాటర్‌ సప్లయర్లు... ఇలా పెళ్లి వెనుక సాక్షీభూతాలుగా నిలిచే అన్ని వృత్తులు... వాటిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. ఎప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటాయో, మళ్లీ ముహూర్తాలు ఎప్పుడు ఉంటాయోనని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి.

వెలవెలబోతున్న గ్రామీణ ప్రాంతాలు...
వేసవి అంటే అందమైన అనుభూతులు, ఆత్మీయతల సమాహారం. ఎండాకాలం వచ్చిందంటే చాలు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు కళకళలాడుతూ ఉంటాయి. సెలవుల్లో తమ స్వగ్రామాలకు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్లి మరచిపోలేని మధుర స్మృతులను మోసుకొస్తుంటారు చిన్నారులు. పొలం గట్లు, పాడి పశువులు, ఈత కొలనులు, గమ్మత్తయిన ఆటలు వారికి శ్రమైక జీవన సౌందర్యాన్ని నేర్పుతాయి. ఆ పల్లెవాసనల మాధుర్యం మళ్లీ ఎండాకాలం వచ్చే వరకు పిల్లలు తమ హృదయాల్లో పదిలంగా దాచుకుంటారు. కానీ మాయదారి కరోనా ఈసారి అలాంటి అనుభూతులు, బంధుమిత్రుల ఆప్యాయతలను దూరం చేసింది. మళ్లీ తిరిగిరాని ఆ అమూల్య సమయాన్ని చిన్నారుల బాల్యానికి ఈసారి దూరం చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉండాల్సి రావడంతో చిన్నారుల ఆటపాటలు లేని పల్లెలు ఈసారి బోసిపోతున్నాయి. కరోనా మహమ్మరి పారిపోయిన తర్వాత మళ్లీ స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు రావాలని ఆహ్వానిస్తున్నాయి. చదవండి: కరోనా: ఓ అడుగు ముందుకు.. 

కుండలు అడిగేవారు లేరు
ఎండాకాలం వస్తే చేతి నిండా పని ఉండేది. కుండల ఆర్డర్లు వచ్చేవి. సూర్యాపేటకూ పంపేవాళ్లం. ఇప్పుడు ఉన్న ఊర్లో, బస్తీలో కుండలు అడిగేవాళ్లు కూడా లేరు. పని లేక పస్తు ఉండాల్సి వస్తోంది. – బొడ్డుపల్లి జంగయ్య, కుండల తయారీ దారుడు, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట జిల్లా

పూట గడిచేదెలా..? 
40 రోజులుగా లాక్‌డౌన్‌తో షాపులు తీయట్లేదు. రోజు వారీ పని చేసుకుంటేనే పూట గడిచేది. ఇప్పుడు ఏం తినాలో, ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– యాకయ్య, స్వర్ణకారుడు, వరంగల్‌ చౌరస్తా

వ్యాపారమంతా కోల్పోయాం...
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయాం. ఎండాకాలం మూడు నెలల్లో ఐస్‌క్రీం, బాదంపాలు, జ్యూస్‌లతో సుమారు రూ. 2 లక్షల వరకు వ్యాపారం సాగేది. ప్రస్తుతం ఆ వ్యాపారమంతా కోల్పోయాం. ఏం చేయాలో తెలియట్లేదు. – వెంకట్‌రెడ్డి, ఐస్‌క్రీం సెంటర్, సూర్యాపేట

ఆర్థిక ఇబ్బందులు తప్పట్లేదు..
ఫంక్షన్‌ హాల్‌ నడిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 నుంచి 40 కుటుంబాలకు ఉపాధి లభించేది. పది మందికి ఉపాధి కల్పించే మేమే ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఫంక్షన్‌ హాల్‌ బుకింగ్‌లు లేకపోయినా నెలకు రూ. 50 వేల ఖర్చు మాత్రం తప్పట్లేదు. ప్రభుత్వం కొన్ని షరతులతో ఫంక్షన్‌ హాళ్లు తెరిచేందుకు అనుమతిచ్చే అంశాన్ని పరిశీలించాలి. – చంద్రకాని గట్టయ్య, రామకృష్ణ ఫంక్షన్‌ హాల్‌ యజమాని, ఖమ్మం

అంధకారంగా భవిష్యత్తు...
అంతంత మాత్రంగా నడుస్తున్న ఫొటో స్టూడియోలు లాక్‌డౌన్‌ వల్ల మూతపడ్డాయి. మా బతుకులు అగమ్యగోచరంగా మారాయి. శుభకార్యాలు లేకపోతే కిరాయిలు కట్టలేని పరిస్థితి. మా భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోంది. – తడక రవి, రవి డిజిటల్‌ ఫోటో స్టూడియో, వరంగల్‌

బ్రాహ్మణ సమాజాన్ని ఆదుకోవాలి
ప్రస్తుత పరిస్థితుల్లో బ్రాహ్మణ సమాజం దుర్భిక్షంలో ఉంది. పౌరోహిత్యం చేసేవారు, అర్చకులు, వేద పండితులు, వంట బ్రాహ్మణులు, అపరకర్మలు చేసే బ్రాహ్మణులు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద బ్రాహ్మణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
– గుదిమెళ్ల విజయకుమారాచార్యులు, యుజుర్వేద పండితుడు, హన్మకొండ

మడిగెల కిరాయిలు వెళ్లడం లేదు..
పెళ్లిళ్లు లేక ప్రింటర్లు పడరాని కష్టాలు పడాల్సి వస్తోంది. ప్రెస్‌ యజమానులే కాకుండా అందులో పనిచేసే సిబ్బంది కుటుంబాలు కూడా ఇబ్బంది పాలవుతున్నాయి. మడిగెల కిరాయిలు కూడా వెళ్లడం లేదు. ఈ సీజన్లో అడ్వాన్సులు తీసుకొని కార్డులు కొట్టిన పెళ్లిళ్లు కూడా ఆగిపోవడంతో రూ. 2 లక్షల వరకు నష్టం వచ్చింది.
– దీకొండ దయానంద్, సారథి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్, నిజామాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement