Soft Drinks: శీతల పానీయాలకు బ్రేక్‌ | Break for soft drinks with effect of corona virus | Sakshi
Sakshi News home page

Soft Drinks: శీతల పానీయాలకు బ్రేక్‌

Published Tue, May 11 2021 4:45 AM | Last Updated on Tue, May 11 2021 11:38 AM

Break for soft drinks with effect of corona virus - Sakshi

సాక్షి, అమరావతి: వేసవిలో ఇష్టంగా తీసుకునే శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు వినియోగదారులు దూరంగా ఉంటున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విస్తరిస్తున్న తరుణంలో శీతల పదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని వైద్యులు, నిపుణులు చెబుతుండటంతో వాటి అమ్మకాలు 80 శాతానికి పైగా పడిపోయాయి. వీటిని తీసుకోవడం వల్ల జలుబు, గొంతు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో కరోనా వేళ వీటికి దూరంగా ఉంటున్నారు. దీంతో రాష్ట్రంలో పెప్సీ, కోకాకోలా వంటి కార్బొనేటెడ్‌ శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌ల వినియోగం 80 శాతం తగ్గిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా మార్చి నుంచి జూన్‌ వరకు కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌ల వినియోగం అధికంగా ఉంటుంది.

700 కోట్ల లీటర్ల నుంచి 150 కోట్ల లీటర్లకు..
దేశంలో ఏటా 700 కోట్ల లీటర్ల శీతల పానీయాలు అమ్ముడవుతుండగా.. ఈ ఏడాది 150 కోట్ల లీటర్లు కూడా దాటకపోవచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. లాక్‌డౌన్‌తో షాపులు మూసివేస్తుండటంతో ఐస్‌క్రీమ్‌ అమ్మకాలు కూడా పడిపోయినట్టు డ్యూమాంట్‌ ఐస్‌క్రీం ఎండీ వివేక్‌ ఇనంపూడి ‘సాక్షి’కి తెలిపారు. దేశవ్యాప్తంగా ఐస్‌క్రీమ్‌ అమ్మకాలు 90 శాతం తగ్గిపోయాయని, కేవలం మిల్క్‌ బూత్‌ల ద్వారా 10 శాతం మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. కరోనా దెబ్బతో చెన్నై, బెంగళూరు, పాండిచ్చేరి, హైదరాబాద్‌లలో ఔట్‌లెట్ల విస్తరణను తాత్కాలికంగా నిలిపివేసినట్టు పేర్కొన్నారు. వేసవిలో ఐస్‌క్రీమ్‌ అమ్మకాల్లో 30 శాతం వృద్ధి నమోదవుతుందని, ఈసారి ఏప్రిల్‌లో వీటి అమ్మకాలు 40 శాతం తగ్గినట్టు అమూల్‌ జనరల్‌ మేనేజర్‌ ఆర్‌ఎస్‌ సోధి వెల్లడించారు.

కషాయాలకు, జ్యూస్‌లకు డిమాండ్‌
ఇదే సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచే కషాయాలు, ఔషధ గుణాలుండే పానీయాలకు డిమాండ్‌ పెరుగుతోంది. కరోనా వేళ జీరా, అలొవెరా, ఉసిరి, త్రిఫల జ్యూస్‌ అమ్మకాలు పెరుగుతున్నట్టు టెట్రా ప్యాక్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ సౌమ్య త్యాగి తెలిపారు. పసుపు, అల్లం, తులసితో కూడిన పాల విక్రయాలు పెరుగుతున్నట్టు చెప్పారు. అధిక ప్రోటీన్లు ఉండే సోయా మిల్క్, బాదం మిల్క్‌ విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. 

వ్యూహాలు మార్చుకుంటున్న కంపెనీలు
ఆరోగ్య పరిరక్షణకు వినియోగదారులు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో వివిధ కంపెనీలు కొత్త ఉత్పత్తుల విడుదలపై దృష్టి సారిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ నినాదం ఊపందుకోవడంతో కోకాకోలా, పెప్సీ వంటి బహుళజాతి సంస్థలు కూడా తమ మార్కెటింగ్‌ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. కార్బొనేటెడ్‌ డ్రింక్‌ల వినియోగం తగ్గుతుండటంతో స్థానిక పండ్ల రసాలు, పానీయాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ ప్రజలు అమితంగా ఇష్టపడే కాఫీ మార్కెట్లోకి కోకాకోలా అడుగు పెట్టింది. మూడు ఫ్లేవర్స్‌లో కూల్‌ కాఫీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement