కరోనా కన్నా ఇప్పుడు ఎండలే విలన్‌! | For Poor Indians Summer May be Deadlier than Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా కన్నా ఇప్పుడు ఎండలే విలన్‌!

Published Tue, May 19 2020 6:52 PM | Last Updated on Tue, May 19 2020 6:56 PM

For Poor Indians Summer May be Deadlier than Coronavirus - Sakshi

న్యూఢిల్లీ : వేసవి వేడి గాలులకు ఏటా కూలి నాలి చేసుకునే పేదలు, దిగువ, మధ్య తరగతి ప్రజలు ఎంతో మంది మరణిస్తుంటారు. అందుకనే వేసవి కాలంలో మాటి మాటికి నీళ్లు తాగండి, చెట్ల నీడన సేద తీరండి, ఎండలోకి వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుంటారు. గతేడాది భారత్‌లో ఎండ వేడికి తాళలేక అధికార లెక్కల ప్రకారమే 350 మంది మరణించారు. ఈసారి కరోనా వైరస్‌కన్నా ఎక్కువ మంది ఎండను తట్టుకోలేకనే మరణిస్తారని అమెరికాలోని ‘నేచురల్‌ రిసోర్సెస్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌’ హెచ్చరించింది. భారత్‌లో కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు ఎంతో మంది భగభగ మండుతోన్న ఎండలోనే తమ స్వస్థలాలకు బయలు దేరిన విషయం తెల్సిందే. వారిలో ఇప్పటికే కొంత మంది ఎండకు, ఆకలికి తాళలేక మరణించారు. ఇంకా ఎంతోమంది మృత్యువాత పడే ప్రమాదం ఉందని ఆ అమెరికా సంస్థ హెచ్చరించింది.

ఇది అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన దశాబ్దంకాగా ఇప్పటికే ఢిల్లీలో ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. రాజస్థాన్‌ లాంటి ఎడారి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంది. జూన్‌ మొదటి వారం వరకు ఈసారి ఎండలు తీవ్రంగా ఉంటాయని, అందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ ‘నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ’ మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ప్రజలంతా ఇంట్లో ఉండాలని, క్రమం తప్పకుండా మంచినీళ్లు తగడంతోపాటు శరీరాన్ని చల్లగా ఉంచేందుకు నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, మామిడి పళ్ల రసం తీసుకోవాలంటూ అనేక సూచనలు చేసింది.

స్వస్థలాలకు వెళ్లేందుకు రోడ్డెక్కిన వేలాది మంది వలస కార్మికులు వందల కొద్దీ కిలోమీటర్లు నడుస్తున్న వారికి కనీస ఆహారం దొరకడం లేదు. మజ్జిగ, మామిడి పళ్ల గురించి ఆలోచించే ఆస్కారమే లేదు.


ఎండ వేడి వల్ల అతిసారం వస్తోందని, ఊపిరితిత్తుల జబ్బులతోపాటు, కార్డియోవాస్కులర్‌ అనే గుండె జబ్బు కూడా వస్తుందని ఎన్‌డీఎంఏకు చెందిన అనూప్‌ కుమార్‌ శ్రీవాత్సవ తెలియజేశారు. ఇప్పటికే కరోనా కేసులతో దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రులు కిటకిటలాడుతుంటే ఉష్ణతాపానికి గురయ్యే వారిని రక్షించడం కష్టమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. (మాస్క్‌లతో శ్వాసకోశ సమస్యలు!)

2015లో వీచిన వడగాల్పులకు దేశంలో రెండువేల మందికి పైగా మరణించారు. అంతకుముందు 2010లో ఒక్క అహ్మదాబాద్‌లోనే వడగాడ్పుల వల్ల 1300 మంది మరణించారు. అందుకని ఆ సంవత్సరం నుంచే ‘దక్షిణాసియా తొలి ఉష్ణ నివారణ కార్యాచరణ ప్రణాళిక’ అమల్లోకి వచ్చింది. ఈ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ఒక్క అహ్మదాబాద్‌లోనే 1100 మంది మరణాలను అధికారులు అరికట్టకలిగారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు అధికారులు రోజుకు రెండు పూటల రోడ్లను తడపడం, ఎక్కడికక్కడ చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించాల్సిన విధుల గురించి కూడా ఈ కార్యాచరణ ప్రణాళికలో వివరించారు. కరోనా మహమ్మారి దాడి నేపథ్యంలో లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో అధికార యంత్రాంగం తలముక్నలై ఉండగా, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వలస కార్మికుల పరిస్థితి ఏమిటని ఊహిస్తేనే ఒళ్లు జలదరించక తప్పదు! (వలస కూలీలపై కేంద్రం కీలక నిర్ణయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement