సాక్షి, హైదరాబాద్ : మల్కాజిగిరికి చెందిన రాఘవరావు, సుశీల (పేర్లు మార్చాం) దంపతులు ఎనభై ఏళ్లకు చేరువైన వృద్ధ దంపతులు. ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. ఇద్దరికీ మధుమేహం, హైబీపీ వంటి జబ్బులు ఉన్నాయి. దాంతో పాటు ఆమె కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌లను సంప్రదించేందుకు అవకాశం లేదు. చాలా వరకు ఆసుపత్రులు ఓపీ సేవలను నిలిపివేశాయి. ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లాలంటే కరోనా ఉంటే తప్ప అక్కడ వైద్యం లభించే అవకాశం లేదు. ‘ఇల్లు వదిలి బయటకు అడుగు పెడితే ఎక్కడ కరోనా అంటుకుంటుందోనని భయమేస్తోంది. అలాగని ఇంట్లోనే ఉంటే రోజు రోజుకు బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయి. ఆమెకు ఆస్తమా బాధ కూడా ఎక్కువవుతోంది. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు టెలీమెడిసిన్ ద్వారా వైద్యసేవలను అందజేస్తున్నాయి. ఫీజులపైన కనిపించే శ్రద్ధ రోగుల బాధలపైన కనిపించడం లేదు’ అని రాఘవరావు ఆందోళన వ్యక్తం చేశారు. (అడకత్తెరలో పోకచెక్క... భారత్)
ఒంటరిగా ఉంటున్న ఆ వృద్ధ దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. కానీ ఇద్దరూ ఢిల్లీ, బెంగళూర్‌లలో ఉండగా, ఒకాయన అమెరికాలో స్థిరపడ్డారు. 3 నెలల క్రితం వరకు ప్రతి రోజు ఇద్దరు పనిమనుషులు వచ్చి అన్ని పనులు పూర్తి చేసి వెళ్లేవారు. కానీ కరోనా కారణంగా పనిమనుషులూ రావడం లేదు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పనిభారం ఆ వృద్ధ దంపతులను బాగా కుంగదీస్తున్నాయి. నిజానికి ఇది ఒక్క రాఘవరావు దంపతులు ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని లక్షలాది మంది వయోధికులను కరోనా కష్టాలు సుడిగుండలా చుట్టుకున్నాయి. ఇల్లు దాటి బయటకు వెళ్లేందుకు అవకాశం లేక, వైద్య సదుపాయాలు అందక, ఆదుకొనే వాళ్లు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు అటు తమ కుటుంబాల నుంచి, ఇటు సమాజం నుంచి నిర్లక్ష్యానికి గురవుతున్నారు.
హెల్పేజ్ ఇండియా వంటి స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం హైదరాబాద్ జనాభాలో 18 లక్షల మంది 70 ఏళ్లు దాటిన వయోధికులు ఉండగా, వారిలో సుమారు 8 లక్షల మందికి పైగా ఒంటరి దంపతులే కావడం గమనార్హం. కుటుంబాలతో కలిసి ఉంటున్న వాళ్లు ఒకరకమైన వివక్షను ఎదుర్కొంటుండగా, ఒంటరి వృద్ధులు మరో రకమైన బాధల్ని అనుభవించాల్సి వస్తోంది. ఈ నెల 15వ తేదీన అంతర్జాతీయ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఆదుకునేవారేరీ..
లాక్‌డౌన్ వల్ల ఇళ్లల్లో పనిచేసే కార్మికులంతా సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. దీంతో ఇంటి పని భారం వృద్ధులపైన పడింది. ప్రత్యేకించి ఒంటరి వృద్ధులు çసర్వెంట్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఇంటిపనితో పాటు, తమ అవసరాలు చూసుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఇరుగు పొరుగు నుంచి కూడా ఎలాంటి సహాయం అందకపోవడం వల్ల ఒంటరి వృద్ధులు తమ ఇళ్లల్లో నిస్సహాయంగా బిక్కు బిక్కుమంటూ గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఒకవైపు అనారోగ్యం వల్ల, మరోవైపు పనిభారం వల్ల బాధపడుతున్న వారికి కరోనా ముప్పు మరింత కలవరపెడుతుంది. ‘విదేశాల్లో ఉన్న పిల్లలు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. మేం అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేదు. కరోనా కారణంగా బంధువులో, చుట్టుపక్కల వాళ్లో వచ్చి ఆదుకునే అవకాశం కూడా లేదు. ఇలా బతకగలిగినంత కాలం బతకాల్సిందే...’ అని హబ్సిగూడకు చెందిన ఒక పెద్దాయన ఆవేదన వ్యక్తం చేశారు.
(నగరంలో దడపుట్టిస్తున్న కరోనా)
ఆసుపత్రులకు వెళ్లలేక..
వృద్ధుల్లో చాలా మంది మధుమేహం, హై బీపీతో బాధపడుతున్నారు. కనీసం 2 నెలలకు ఒకసారైనా షుగర్ లెవల్స్, బీపీ లెవల్స్ పరీక్షించి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కరోనా కారణంగా చాలా వరకు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. లాక్‌డౌన్ సడలింపుల తరువాత కొన్ని ఆసుపత్రులలో పరిమితంగా సేవలు ప్రారంభమైనా ఇల్లు దాటి వెళితే కరోనా సోకుతుందేమోననే భయం వెంటాడుతుంది. ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చినా వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లోనూ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడం వల్ల హై రిస్క్‌లో ఉన్న వృద్ధులకు తమను తాము కాపాడుకోవడం పెద్ద సవాల్‌గా మారింది. తరచుగా డయాలసిస్ అవసరమైన వాళ్లు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ‘వయోభారం వల్ల న్యుమోనియా, ఆస్తమా వంటి జబ్బులను కరోనాతో ముడిపెడుతున్నారు. గాంధీకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు టెలీమెడిసిన్ సేవలను ప్రారంభించాయి. కానీ వయోధికులకు వాటివల్ల పెద్దగా ఉపయోగం లేదు.’అని హెల్పేజ్ ఇండియా ప్రతినిధి శ్యామ్ విస్మయం వ్యక్తం చేశారు.
భారంగా పోషణ...
తుకారాంగేట్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులకు ఇద్దరు కొడుకులు. ఆ దంపతులు నెల రోజులు పెద్ద కొడుకు దగ్గర ఉంటే మరో నెల చిన్న కొడుకు దగ్గర ఉండాలి. కానీ నెల రోజులు మాత్రమే ఉండాల్సిన తల్లిదండ్రులు లాక్‌డౌన్ కారణంగా గత 3 నెలలుగా తన వద్దే ఉండడంతో పెద్ద కొడుకు కుటుంబానికి వారు భారంగా పరిణమించారు. దీంతో తమ సొంత ఇంట్లోనే తాము తీవ్ర వేధింపులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దంపతులే కాకుండా నగరంలో చాలా మంది వృద్ధులు కొడుకులు, కూతుళ్ల వల్ల తీవ్ర వేధింపులకు గురవుతున్నారు. కరోనా , లాక్‌డౌన్ పరిణామాల్లో ఆ వేధింపులు మరింత పెరిగాయని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment