మృగశిర కార్తె సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని రాంనగర్ చేపల మార్కెట్‌లో కిక్కిరిసిన నగరవాసులు(ఫైల్)
రైతు బజార్లన్నీ మైదాన, ఖాళీ ప్రాంతాలకు తరలింపు.. మాస్కు లేనిదే లోపలకు నో ఎంట్రీ.. ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడం తప్పనిసరి.. పర్యవేక్షణకు పోలీసులు.. రద్దీని నివారించేందుకు వారాంతపు సంతలు బంద్.. కాలనీలు, అపార్ట్‌మెంట్ల వద్దకే 200 మొబైల్ రైతు బజార్ల వాహనాల్లో కూరగాయల విక్రయాలు.. – ఇవీ హైదరాబాద్‌లో లాక్‌డౌన్ మొదట్లో కనిపించిన సన్నివేశాలు
రైతు బజార్లలో కానరాని భౌతిక దూరం.. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా జనం.. మాస్కులు ధరించడం తప్పనిసరి కాదన్నట్లుగా వ్యాపారుల్లో నిర్లక్ష్యం.. ప్రజల్లోనూ కొరవడిన లాక్‌డౌన్ నిబంధనల స్ఫూర్తి.. ఎక్కడా కానరాని పోలీసులు.. సంతల్లో కొనసాగుతున్న రద్దీ.. కాలనీల్లో పెద్దగా కనిపించని మొబైల్ రైతు బజార్ల వాహనాలు.– రాజధానిలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలివి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా వైరస్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉన్న కూరగాయలు, పండ్లు, చేపల మార్కెట్లలో మాత్రం ఎక్కడా కరోనా నిబంధనలు అమలు కావట్లేదు. వ్యాపారుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా వినియోగదారుల్లోనూ అప్రమత్తత తగ్గుతోంది. వైరస్ కట్టడిలో భాగంగా మార్కెట్లలోని దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించే వ్యాపారం చేయాలని అధికారులు సూచిస్తున్నా ఎక్కడా ఆ చర్యలు కనిపించట్లేదు. లాక్‌డౌన్ మొదట్లో భౌతికదూరం నిబంధనను పోలీసులు, మార్కెటింగ్, మున్సిపల్ అధికారులు పక్కాగా అమలు చేయగా ప్రస్తుతం పూర్తిగా చేతులెత్తేయడంతో వ్యాపారులు ఇష్టారీతిన అమ్మకాలు సాగిస్తున్నారు.
లాక్ తెరిచారు.. దూరం మరిచారు
రాష్ట్రంలో లాక్‌డౌన్ మొదట్లో జన సంచారం అధికంగా ఉండే మార్కెట్లలో భౌతికదూరం కచ్చితంగా పాటించేలా ప్రభుత్వ విభాగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ మార్కెట్లకు ప్రజలు ఎక్కువగా వస్తుండటంతో ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో సీఐ స్థాయి అధికారి నేతృత్వంలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అన్ని ప్రధాన మార్కెట్ల వద్ద నియంత్రణ చర్యలు చేపట్టింది. దీనికి అనుగుణంగా వ్యాపారులు సైతం భౌతికదూరం పాటించేలా మార్కింగ్ చేసి వినియోగదారుల రద్దీని నిలువరించారు. దీన్ని అధికారులు పర్యవేక్షించారు. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్‌ను కంటైన్మెంట్ ప్రాంతాలకే పరిమితం చేయడం, ప్రభుత్వ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో భౌతికదూరం నిబంధనను అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు విస్మరించారు. రాష్ట్రంలో మొత్తంగా 15 మార్కెట్ యార్డులు, 43 రైతు బజార్లు ఉండగా అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 12 రైతు బజార్లున్నాయి. రైతుబజార్లలో కొంతమేర జాగ్రత్తలు తీసుకుంటున్నా చింతల్‌బస్తీ, మెహదీపట్నం, గోల్నాక, దిల్‌సుఖ్‌నగర్, రామంతపూర్, ఉప్పల్, గడ్డి అన్నారం, కూకట్‌పల్లి, రాంనగర్ చేపల మార్కెట్, సికింద్రాబాద్ ప్రైవేటు మార్కెట్లలో ఎక్కడా భౌతిక దూరమన్న మాటే కనిపించట్లేదు. ఈ ప్రాంతాలకు ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఇక మాస్కులు ధరించి విక్రయాలు చేయాలని పదేపదే కొరుతున్నా ఎక్కడా వ్యాపారులు దాన్ని పట్టించుకోవడం లేదు.
తగ్గిన మొబైల్ రైతుబజార్లు..
కూరగాయల మార్కెట్లలో వినియోగదారుల రద్దీని తగ్గించేందుకు మార్కెటింగ్ శాఖ కరోనా లాక్‌డౌన్ మొదట్లో 250 మొబైల్ రైతుబజార్లను ఏర్పాటు చేసి 400 ప్రాంతాల్లో విక్రయాలు చేపట్టింది. ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య సత్ఫలితాలిచ్చింది. కాలనీలు, అపార్ట్‌మెంట్ల వద్దకే కూరగాయల వాహనాలు రావడంతో ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి తప్పింది. పైగా మార్కెట్లలోకన్నా కాస్త తక్కువ ధరకే తాజా కూరగాయలు ప్రజలకు లభించాయి. కానీ ప్రభుత్వం తాజాగా లాక్‌డౌన్‌ను సడలించడంతో మొబైల్ వాహనాల సంఖ్యను అధికారులు వందకు తగ్గించారు. దీనికితోడు ప్రధాన మార్కెట్లకు చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరస్ విస్తృతి పెరుగుతున్నా పట్టించుకోవట్లేదు. తమిళనాడులో కోయంబేడు మార్కెట్‌లో జరిగిన సామాజిక వ్యాప్తితో కేసులు పెరిగి అవి పొరుగునే ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు సైతం విస్తరించిన ఉదంతం కళ్లెదుటే కనబడుతున్నా అటు వ్యాపారులు.. ఇటు అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం సామాన్యులను కలవరపెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment