ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో పరిస్థితిని సమీక్షిస్తున్న మేయర్ రామ్మోహన్, ఎమ్మెల్యే దానం తదితరులు
ఖైరతాబాద్: కరోనా లక్షణాలతో మృతిచెందిన ఖైరతాబాద్ ప్రాంతవాసి నివాసముండే పరిసర ప్రాంతాలను ఆదివారం నగర మేయర్ బొంతు రామ్మోహన్ వైద్యాధికారులు, శానిటేషన్ సిబ్బంది, ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ఖైరతాబాద్ డివిజన్ ఓల్డ్‌సీఐబీ క్వార్టర్స్‌లో నివాసముండే మృతుడి కుటుంబ సభ్యుల వివరాలు ఆరా తీయడంతో పాటు పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు ఓల్డ్‌సీఐబీ క్వార్టర్స్, ఇందిరానగర్‌లలో మొత్తం 200 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. రోడ్లపై, ఇళ్లపై ఎంటమాలజీ సిబ్బంది ప్రత్యేక వాహనాలతో రసాయన ద్రావణాన్ని పిచికారి చేశారు. మేయర్ వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్ విజయారెడ్డి, డీఎంసీ గీతారాధికతో పాటు జీహెచ్‌ఎంసీ, ఎంటమాలజీ, శానిటేషన్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
మేయర్ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి కరోనా మరణం ఖైరతాబాద్‌లో చోటుచేసుకున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయందోళనకు గురికాకుండా ఇంటింటికి తిరిగి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంట్లో ఎవరైనా ఇటీవల విదేశాలు, దేశంలోని ఇతర నగరాలకు వెళ్లి వచ్చివుంటే వారి వివరాలు సేకరిస్తూ, ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తున్నామన్నారు. నగరవ్యాప్తంగా 10 జెట్ మిషన్లు, 18 ఏయిర్‌టెక్ మిషన్ల సాయంతో రసాయన ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నామన్నారు. నగరంలో 18వేల మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారని, ఒక్క ఖైరతాబాద్ జోన్ పరిధిలో 2500 మంది ఉన్నారని, వీరిలో చాలా మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించామని తెలిపారు.దుకాణదారులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నగరంలో 40 వేల మందికి మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నామని, ఇందుకుగాను తనవంతుగా వ్యాపారవేత్త వి.నిరంజన్ రూ.5 లక్షలు అందజేసినట్లు మేయర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment