స్నేహితులతో కలిసి జనవరిలో ఆఫ్రికాకు వెళ్లి మార్చి 20న హైదరాబాద్‌కు వచ్చాను. మార్చి 31న గాంధీ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్లారు. తిరిగి ఏప్రిల్ 1వ తేదీన రెండోసారి వైద్య పరీక్షలు జరిపి..22 రోజుల పాటు గాంధీ ఆస్పతిలో క్వారంటైన్‌లో ఉంచారు. నా భార్య, ముగ్గురు పిల్లలను కూడా ఆస్పతికి తీసుకువచ్చి క్వారంటైన్‌లో ఉంచారు. ఏప్రిల్ 20న డిశ్చార్జి చేశారు. 28 రోజులు హోం క్వారంటైన్‌లోఉండమన్నారు. అలాగే చేశాను. కానీ హోం క్వారంటైన్ పూర్తయిన తరువాత కూడా కాలనీ వాసులు మా దగ్గరకు రావడం లేదు. అంతా మమ్ముల్ని విచిత్రంగా చూస్తున్నారు. కొంతమంది మా ఇంటి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి చాలా ఇబ్బందులకు గురిచేశారు.– సలీం,అంబేద్కర్‌నగర్
కోవిడ్ మహమ్మారి ప్రాణాలు తీయడమే కాదు..పోరాడి ప్రాణాలు దక్కించుకున్న వారి జీవితాలనూ దుర్భరం చేసింది. దాదాపు రెండు వారాలు అయినవారికి దూరమై.. దినదిన గండంగా గడిపి..దుర్భరమైన పరిస్థితుల్లో చికిత్స పొంది..కోలుకుని ఇంటికి వచ్చిన వారు ఇప్పుడు నరకం చవిచూస్తున్నారు. సమీప బంధువులు, సన్నిహితులు, స్నేహితులు వీరిని ఇంకా దూరం పెడుతుండడమే ఇందుకు కారణం. వైరస్ వ్యాప్తి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వీరిని సమాజంలోకి ఆహ్వానించేందుకు ఎవ్వరూ ఇష్టపడడం లేదు. ‘రోగి కోలుకున్నప్పటికీ వైరస్ ప్రభావం పూర్తిగా తొలగకుంటే...పొరపాటున ఆ వైరస్ మాకు అంటుకుంటే ఎలా?’ అంటూ జనం ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. మరోవైపు కోవిడ్ బాధితుల వివరాలను, ఫోటోలను, ఇళ్ల చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశారు. ఉద్యోగులైతే వారిని సహోద్యోగులే సహించడం లేదు. వ్యాపారులైతే..వారి షాప్‌లకు ఎవ్వరూ వెళ్లడం లేదు. వైరస్ బారి నుంచి కోలుకున్న ఆనందం కంటే..బయటకు వచ్చాక జరుగుతున్న పరిణామాలే వారిని బాధిస్తున్నాయి.
హఫీజ్‌పేట్/సనత్‌నగర్: మహమ్మారి కోవిడ్‌ను జయించిన పలువురు నగర వాసులకు రోజువారీ జీవితంలో చిత్రవిచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. కరోనా రక్కసి నుంచి కోలుకున్నప్పటికీ.. వారిని సమీప బంధువులు, సన్నిహితులు ఇంకా దూరం పెడుతూనే ఉన్నారు. అంతేకాదు కరోనా బారిన పడిన వారి ఇళ్లు, వారు పనిచేస్తున్న సంస్థల వివరాలను ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్‌మీడియా సైట్లలో వైరల్‌గా మార్చేస్తుండటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చిరువ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారి దుకాణాలకు వెళ్లేందుకు వినియోగదారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులను సహోద్యోగులు దూరం పెడుతుండటం.. వారిని దగ్గరికి రానీయకపోవడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ రక్కసి నుంచి కోలుకున్న పలువురు సిటీజన్లను ‘సాక్షి’ బృందం మంగళవారం పలకరించింది. వ్యాధి నిర్ధారణ, చికిత్స సందర్భంగా వారు ఎదుర్కొన్న అనుభవాలతోపాటు కొన్ని రోజులుగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను వారు తెలిపారు. కొందరు తమ ఫొటోలు ఇచ్చేందుకు విముఖత చూపారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లో..
కరోనా అంటే భయం వద్దు
ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల కోసం నేను మార్చి 13వ తేదీన హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరి వెళ్లాను. అక్కడ ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నాను. అనంతరం 19వ తేదీన రైలు మార్గం ద్వారా నగరానికి చేరుకున్నాను. ఏప్రిల్ 2వ తేదీన లింగంపల్లి వైద్యాధికారులు తనను రాజేంద్రనగర్‌లోని ఆస్పతికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. 4 రోజుల పాటు అక్కడే ఉండి అనంతరం మరికొన్ని వైద్య పరీక్షలు చేయాలని గాంధీ ఆస్పతికి తరలించారు. ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సులు బాగా చూసుకున్నారు. నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కరోనా వైరస్ నాకు వచ్చి వెళ్లినట్లు కూడా తెలియదు. ఆస్పత్రిలోనే నమాజ్ చదువుకునే వాడిని. ఎవరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఏప్రిల్ 23వ తేదీన రెండుసార్లు వైద్య పరీక్షలు చేసి నెగిటివ్ రావడంతో హోంక్వారంటైన్‌లో మే 7వ తేదీ వరకు ఉండాలని సూచించారు. నేను ఇప్పుడు పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నాను. – అహ్మద్ అలీ ఆదిత్యనగర్
స్వీయ నియంత్రణే శరణ్యం
నేను మార్చి 13వ తేదీన అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చి 14 రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాను. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి వైద్యులు తీసుకువెళ్లారు. పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. దీంతో 18 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండి వైద్యం చేయించుకున్నాను. ఆ తర్వాత 11 వరకు 28 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నాను. గతంలో మాదిరిగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరితో మాట్లాడుతున్నాను. బంధువులు కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు. కానీ ఎవరూ దగ్గరకు రావడంలేదు. గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులకు అన్ని వసతులను రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా ఏర్పాటు చేసింది. అందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లతో ఎప్పటికప్పుడు చేతలు శుభ్రంగా కడుక్కోవాలి. – భిక్షపతి శర్మ, మదీనాగూడ
స్థానికులు మమ్మల్ని దూరం పెట్టారు
మా అమ్మ మార్చి 10న సౌదీ ఎయిర్‌లైన్స్‌లో నగరానికి వచ్చింది. అయితే ఇంటికి రావడంతోనే జ్వరం, దగ్గు వచ్చాయి. ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించుకోవాలని మార్చి 23న గాంధీ ఆస్పత్రికి వెళ్లాం. వారు క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు జరిపారు. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో కుటుంబ సభ్యులందరం టెస్టులు చేయించుకున్నాం. అందరికీ నెగెటివ్ వచ్చింది. మా అమ్మ రెండు వారాల పాటు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంది. మూడుసార్లు పరీక్షలు జరిపాక నెగెటివ్ వచ్చింది. దీంతో ఆమెను ఏప్రిల్ 4న డిశ్చార్జి చేసి హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. క్వారంటైన్ సమయం కూడా ముగిసింది. కరోనా సోకిన మొదట్లో కొంత ఇబ్బందిరక పరిస్థితి తలెత్తింది. చుట్టుపక్కలకు ఎవరూ వచ్చేవారు కాదు. తమను వెలివేసినట్లుగా ఉండేది. మేము ఇంటి ముందున్న రోడ్డు మీదకు వచ్చినా ఇబ్బందికరంగా ఫీలయ్యారు. – నయీంఖాన్, కరోనా బాధితురాలి కుమారుడు, బేగంపేట
రొటీన్ లైఫ్‌లో పడ్డా..
మా కుటుంబంలో ఎనిమిది మందికి కరోనా సోకగా మా తాత(70) చనిపోయాడు. బాధగా ఉంది. మా కుటుంబ సభ్యుల్లో మిగతా వారికి ఒక్కొక్కరికి ఒక్కో స్థాయిలో కరోనా వచ్చింది. పెద్దగా ఇబ్బంది లేకుండా అందరం కోలుకున్నాం. డిశ్చార్జ్ అయ్యాక కూడా క్వారంటైన్ సమయం ముగిసింది. దీంతో మేమంతా ఎవరికి వారు రొటీన్ లైఫ్‌లో పడ్డాం. కరోనా నుంచి రక్షణ పొందాలంటే మాస్కులు వాడాలి. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.– సాయిదీప్, కానిస్టేబుల్,అంబర్‌పేట చెన్నారెడ్డినగర్
ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు..
జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేసే నాకు కరోనా టెస్టు చేయడంతో పాజిటివ్ వచ్చింది. నా నుంచి కుటుంబ సభ్యులకు సోకింది. దీంతో మే 12న గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రోజుకు రెండుసార్లు పరీక్షలు నిర్వహించి మా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కొంచెం నీరసంగా ఉందని తెలిసినా క్షణాల్లో వైద్యులు వచ్చి పరీక్షలు చేసేవారు. పోషక విలువలతో కూడిన ఆహారం అందజేయడంతో పాటు ఏ లోటు లేకుండా చేసుకున్నారు. డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు.– భారతమ్మ
ఆత్మస్థైర్యం కోల్పోవద్దు
నా స్నేహితుడు ఢిల్లీ వెళ్లి రావడంతో అతడి నుంచి నాకు సోకింది. దీంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. బెడ్స్ ఖాళీ లేకపోవడంతో మొదట ఐసీయూలో ఉంచారు. నా కళ్ల ముందే ఇద్దరు ముగ్గురు చనిపోవడంతో భయపడ్డాను. ఆ తర్వాత వేరే వార్డుకు తరలించారు. 14 రోజుల తర్వాత పూర్తిగా కోలుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వారు, సమాజం నన్ను అదోరకంగా చూశారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బందికరంగా ఉండేది. కోలుకొని నెలరోజుల తర్వాత కూడా ఒక రకమైన ఫీలింగ్‌లో ఉండటంతో దాని నుంచి బయట పడాలని వైజాగ్‌లోని మా స్వగ్రామానికి వెళ్లాను. వైరస్ సోకినా భయపడకుండా ధైర్యంగా ఉండాలి. అదే మనల్ని రక్షిస్తుంది. – నాగేశ్వర్‌రావు, గ్రాఫిక్ డిజైనర్, బాకారం, రాంనగర్
ఆందోళన చెందలేదు
కరోనా పాజిటివ్ వచ్చినా ఆందోళన పడలేదు. ఆసుపత్రిలో సమయానికి మందులు, పౌష్టికాహారం అందించారు. వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తూ 17 రోజుల్లో కోలుకున్నాను. ఇంటికి వచ్చాక సైతం ఇతరులతో భౌతికదూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉంటున్నాను. ఇప్పుడిప్పుడే స్నేహితులు, బంధువులను కలవడం లేదు.– ముఖేష్, నల్లకుంట.
Comments
Please login to add a commentAdd a comment