సామాజిక వ్యాప్తి మొదలు? | Coronavirus Severity Increasing In India | Sakshi
Sakshi News home page

సామాజిక వ్యాప్తి మొదలు?

Published Tue, Jul 21 2020 1:58 AM | Last Updated on Tue, Jul 21 2020 1:58 AM

Coronavirus Severity Increasing In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ప్రస్తుతం రోజుకు 40 వేల వరకు కరోనా కేసులు నమోదవుతుండటం, బాధితుల సంఖ్య 11 లక్షలు దాటడంతో వ్యాధి విషయంలో భారత్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఒక్క లక్షద్వీప్‌ను మినహాయించి మిగిలిన ప్రాంతాలన్నింటిలోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కనీసం 27 రాష్ట్రాల్లో రోజుకు వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదవుతుండటం, అతితక్కువ కేసులు ఉన్న అండమాన్‌ నికోబార్‌లోనూ వాటి సంఖ్య 150కు చేరుకోవడంతో సామాజిక వ్యాప్తి విషయమై సర్వత్రా చర్చ మొదలైంది. వ్యాధుల నిపుణుల అంచనాల మేరకు దేశంలో సామాజిక వ్యాప్తి ఇప్పటికే మొదలైంది. కానీ ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు సరికదా.. సామాజిక వ్యాప్తి అనేది లేనేలేదని అంటోంది. ఇంతకీ ఈ సామాజిక వ్యాప్తి అంటే ఏమిటి? ఉంటే దాని పరిణామాలేమిటి?

అంతా అస్పష్టతే..
దేశంలో కరోనా వ్యాధి ఎలా వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకుంటే సామాజిక వ్యాప్తి అంటే ఏమిటో అర్థం చేసుకోవడం సులువు అవుతుంది. కరోనా వైరస్‌ పుట్టినిల్లు అయిన చైనాలోని వూహాన్‌ నుంచి కొంత మంది విద్యార్థులు దేశంలోకి వచ్చిన తరువాత ఇక్కడ వ్యాధి మొదలైంది. ఆ సమయంలో విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించడం, వైరస్‌ ఉన్న వారిని వేరు చేసి చికిత్స అందించడంతోపాటు ఆయా వ్యక్తులు ఎవరెవరితో సంబం ధాలు పెట్టుకున్నారన్న విషయాన్ని ఆరా తీసి వారందరికీ పరీక్షలు నిర్వహించారు.

దీంతో వ్యాధి ఎవరి నుంచి ఎవరికి సోకిందో స్పష్టంగా తెలిసింది. అంతేకాకుం డా వ్యాధిని అక్కడికక్కడే కట్టడి చేసేందుకు అవకాశమేర్పడింది. అయితే సమయం గడుస్తున్న కొద్దీ వ్యాధిని వ్యాప్తి చేస్తున్న వారు ఎవరు? బాధితులు ఎవరనేది తెలుసుకోవడం కష్టమైంది. ఇలా ఎవరి నుంచి ఎవరికి వ్యాధి సోకిందో కచ్చితంగా నిర్ధారించలేని స్థితిని సామాజిక వ్యాప్తి అని పిలుస్తారు. 

ఉందా.. లేదా?
దేశంలోని 11 లక్షల నిర్ధారిత కోవిడ్‌ కేసులను నిశితంగా పరిశీలిస్తే సామాజిక వ్యాప్తి ఉందన్నది స్పష్టంగా తెలిసిపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు కూడా అనధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కొంతకాలం క్రితం భారత వైద్య పరిశోధన మండలి దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిందని, తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై జరిగిన ఈ సర్వేలో 40 శాతం మంది సమస్యకు కారణమేమిటో స్పష్టంగా చెప్పలేకపోయారని, ఇది సామాజిక వ్యాప్తికి సూచికేనని వారు చెబుతున్నారు.

ముందుజాగ్రత్తలే మేలు..
ప్రభుత్వం ఇప్పటికైనా సామాజిక వ్యాప్తిని అంగీకరించడం మేలని దేశంలోనే ప్రముఖ వ్యాధుల నిపుణులు జయప్రకాశ్‌ ములియిల్‌ అంటున్నారు. వ్యాధిని కట్టడి చేయడంలో విఫలమయ్యాయన్న నిందను భరించాల్సి వస్తుందని ప్రభుత్వాలు సామాజిక వ్యాప్తిని నిరాకరిస్తూ ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం అంగీకరించినా, అంగీకరించకపోయినా వ్యాధి కట్టడి, చికిత్స విషయంలో ఎలాంటి మార్పులూ ఉండబోవన్నారు. పరీక్షలు చేయడం, వ్యాధిగ్రస్తులను గుర్తించి ఇసోలేషన్‌లో ఉంచడం, చికిత్స కల్పించడమే మన ముందున్న మార్గమన్నారు. ప్రజలు కూడా మునుపటి లాగానే తరచూ చేతులు కడుక్కోవడం, ముఖానికి మాస్క్‌ వేసుకోవడం, వీలైనంత వరకు జనసమర్ధ ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని సూచించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement