ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామానికి చెందిన ఓ రైతు తాను పండించిన ధాన్యాన్ని ట్రాక్టర్‌లో తీసుకెళ్తున్నాడు.. ఇది ఆ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారి కంటపడింది. వెంటనే ట్రాక్టర్ ఆపిన సదరు అధికారి.. రైతు వద్ద అన్ని కాగితాలు, అనుమతులు ఉన్నా.. పట్టించుకోలేదు.. తాను సూచించిన ఏజెంట్ వద్దకు వెళ్లి మాట్లాడుకోపో.. అని చెప్పి సీరియస్‌గా వెళ్లిపోయారు.. ఆ తర్వాత రంగంలోకి దిగిన ఏజెంట్.. ‘ ఏదో కారణంతో నీపై కేసు పెట్టి బండిని సీజ్ చేస్తారు.. నా మాట విని రూ. 15 వేలు ఇస్తే సరే.. లేదంటే నీకే ఇబ్బంది..’ అని బెదిరించి డబ్బు వసూలు చేశాడు. ఇలా గుర్రాపాలు, ముదిగొండ, నేలకొండపల్లి, వైరా, పాల్వంచ.. ఏ ఊరైనా.. ఏ ప్రాంతమైనా అధికారుల లెక్కలు వారివే.. రైతుల వరి ధాన్యం లోడు, చిరు వ్యాపారుల ట్రాలీలు, ట్రక్కులు కన్పించిన అధికారులకు.. నిబంధనలకు విరుద్ధంగా వందల టన్నుల లోడు రవాణా అవుతున్నా ఎందుకు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
భారీ లోడున్న వాహనాలు కన్పించవా..?
ప్రభుత్వ నిబంధలనకు విరుద్ధంగా భారీ లోడుతో ఇసుక, గ్రానైట్ లారీలు వెళ్తుంటాయి. దీంతో తరచూ ప్రమాదాలతో పాటు రహదారులు సైతం మరమ్మతులకు గురవుతున్నాయి. వీరు చెల్లించే పన్నులు కూడా నామమాత్రమే. అయితే అధికారులకు నెలవారీ మామూళ్లు అప్పగిస్తే ఎంత లోడైనా దర్జాగా తీసుకెళ్లవచ్చని ఓ లారీ యజమానే చెప్పడం గమనార్హం. గ్రానైట్, ఇసుక తదితర లోడ్‌లతో జిల్లా నుంచి వేలాది వాహనాలు వెళ్తుంటాయి.
వీటిలో అనుమతులు లేనివి కొన్నయితే... ఓవర్‌లోడుతో వెళ్తున్న వాహనాలు మరి కొన్ని ఉన్నాయి. నిత్యం వీటిని తనిఖీ చేసి తగిన జరిమానా విధిస్తేప్రభుత్వానికి భారీ ఆదా యం వచ్చేది. కానీ నెలనెలా మామూళ్ల మత్తులో ఉన్న రవాణ శాఖాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో లారీలు అక్రమంగా జిల్లా నుంచి తరలివెళ్తున్నాయనే ప్రచారం జరుగుతోం ది. కరీంనగర్ నుంచి కాకినాడకు వెళ్లే గ్రానైట్ లా రీలు, భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్లే ఇసుక లారీల యజమానుల నుంచి అధికారులకు నెలకు ఒక్కో లారీ నుంచి రూ.2వేల నుంచి రూ.2,500 వరకు అందుతున్నాయని సమాచారం.
తూతూమంత్రంగా తనిఖీలు...
ప్రతిరోజు జిల్లా నుంచి ఓవర్‌లోడు, అనుమతి లేకుండా తరలి వెళ్తున్న లారీలను ఆర్టీవో అధికారులు తనిఖీ చేసి కేసు నమోదు చేయడంతోపాటు జరిమానా విధించాల్సి ఉంటుంది. ప్రతిరోజు సుమారు 100 నుంచి 150 లారీల వరకు జిల్లా మీదుగా వెళ్తున్నప్పటికీ అధికారులు మాత్రం తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. అరకొరగా కేసులు నమోదు చేసి మిగిలిన వారి నుంచి ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీవో అధికారులు మార్చిలో 89 లారీలు, ఏప్రిల్‌లో 78 లారీలపై మాత్రమే కేసులు నమోదు చేశారు. నాలుగు నెలల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన స్క్వాడ్ బృందం ఒకరోజే 30 నుంచి 40 లారీలపై కేసులు నమోదు చేసింది. అయితే మన అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్టీవో అధికారులు తనిఖీలు చేస్తున వైపు లారీలు వెళ్లడం లేదా... లారీలు వెళ్తున్న వైపు అధికారులు వెళ్లడం లేదా.. అనేది తెలియడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రైవేట్ సైన్యంతో వసూళ్లు...
ఆర్టీవో అధికారులు నేరుగా మామూళ్లు వసూలు చేయకుండా వారికి అనువుగా ఉండే వారిని మధ్యవర్తులుగా నియమించుకుంటున్నారు. కార్యాలయంలో వీరిదే ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. సంబంధిత అధికారిని కలవాలన్నా ముందుగా మధ్యవర్తి అనుమతి తీసుకోవాల్సిందే. దీంతో ఎవరైనా అధికారులను కలుసుకోవాలంటే గగనమే అవుతోంది. మామూళ్లు ముట్టజెప్పిన లారీలను వదిలేస్తున్న అధికారులు... ఇవ్వని వాహనాల యజమానులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. వాహనాలను తనిఖీ చేసేప్పుడు అన్ని కాగితాలు ఉన్నా ఏదో ఒక వంకతో కేసులు రాస్తున్నారని, ఈ కేసుల నుంచి బయటపడాలంటే మధ్యవర్తి ద్వారా అధికారికి ముడుపులు అందజేయాల్సిందేనని పలువురు వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ వసూళ్ల పర్వానికి తెరదించాలని కోరుతున్నారు.
చెయ్యి తడిపితే రైట్..రైట్!
Published Fri, May 23 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement