rto officials
-
ఇదో రకం పిచ్చి..!
డోన్: కొందరు యువకుల చేష్టలు విపరీత అనర్థాలకు దారితీస్తున్నాయి. ద్విచక్రవాహనాల నంబర్ ప్లేట్ల స్థానంలో ఫలానా తాలుకా అంటూ బోర్డులు తగిలించుకోవడం.. ఏదో గనకార్యం చేసినట్లు దూసుకుపోవడం ప్యాషన్‌గా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన పేర్లు వేసుకుని తిరగడం ఎక్కువయ్యాయి. డోన్ పట్టణంలో కొందరు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి తాలుకా అని, మరికొందరు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తాలుకా అని, ఇంకొందరు కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ తాలుకా అని నేమ్ప్లేట్లు రాయించుకుని రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. ఈ వాహనాలకు రిజి్రస్టేషన్ నంబర్లు ఉండేచోట ఫలానా వ్యక్తి తాలుకా అని తాటికాయ అంత అక్షరాలతో రాసుకుని తిరుగుతుండటంపై ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి వెర్రి మరింత ముదిరిపోకముందే పోలీసు, ఆర్టీఓ అధికారులు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. -
Hyderabad: క్యాబ్‌లు, ఆటోల్లో అడ్డగోలు వసూళ్లు.. ప్రేక్షకపాత్రలో రవాణాశాఖ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి జూబ్లీబస్‌స్టేషన్‌కు మధ్య దూరం కేవలం రెండున్నర కిలోమీటర్లు. ఆర్టీసీ చార్జీ రూ.10 ఉంటుంది. కానీ కాస్త లగేజీతో ఉన్న ప్రయాణికుడు ఏదో ఒక ఆటో బుక్ చేసుకోవాలనుకొని ఆశిస్తే కనీసం రూ.100 సమర్పించుకోవలసిందే. రాత్రి ఎనిమిది దాటినా, తెల్లవారు జామున ఐదైనా ఈ చార్జీ కాస్తా రూ.150 కూడా దాటొచ్చు. ► ఉప్పల్ బస్టాండ్ నుంచి మెట్రో స్టేషన్ వరకు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటోలో వెళ్లాంటే రూ.80 పైనే వసూలు చేస్తారు. ► ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పజగుట్ట, తదితర మెట్రో స్టేషన్ల నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఎక్కడికెళ్లినా సరే రూ.100 పైన సమర్పించుకోవలసిందే. ► ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో, మెట్రో రైళ్లలో చెల్లించే చార్జీలకు ఇది రెట్టింపు. బర్కత్‌పురా నుంచి సికింద్రాబాద్ వరకు నేరుగా ఆటోలో వెళితే రూ.350 నుంచి రూ.400 వరకు చెల్లించాల్సిందే. మీటర్లు లేని ఆటోల్లో మాత్రమే కాదు. ఓలా, ఉబెర్, రాపిడో వంటి క్యాబ్ అగ్రిగేటర్ సంస్థలకు అనుసంధానంగా ఉన్న ఆటో రిక్షాల్లోనూ చార్జీల మోత మోగుతోంది. ఎలాంటి నియంత్రణ లేకుండా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. అగ్రిగేటర్ సంస్థలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఆటో రిక్షాలపైన రవాణాశాఖ నియంత్రణ కొరవడింది. దీంతో అన్ని రకాల ఆటోలు ప్రయాణికులపై నిలువుదోపిడీ కొనసాగిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితు ల్లో ఆటోలో వెళ్లే వారి జేబులను లూఠీ చేస్తున్నారు. క్యాబ్ ఆటోల్లోనూ అంతే... మీటర్లు లేని ఆటోల్లో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగితే అగ్రిగేటర్ సంస్థలకు చెందిన ఆటోలు బుకింగ్ సమయంలోనే హడలెత్తిస్తున్నాయి. కొద్దిపాటి దూరానికే రూ.వందల్లో చార్జీలు విధిస్తున్నాయి. ఈ సంస్థల చార్జీలకు ఎలాంటి ప్రామాణికత లేకపోవడం గమనార్హం. సాధారణంగా ఆటోలు, క్యాబ్‌లలో మోటారు వాహన చట్టం ప్రకారం మీటర్ రీడింగ్ ద్వారా చార్జీలను నిర్ధారించవలసిన రవాణాశాఖ చాలా ఏళ్ల క్రితమే చేతులెత్తేసింది. కర్ణాటక తరహా ఆంక్షలేవీ... అగ్రిగేటర్ సంస్థల ఆటోలపైన తాజాగా కర్ణాటక రవాణాశాఖ ఆంక్షలు విధించింది. రెండు కిలోమీటర్ల దూరానికే రూ.వందకు పైగా వసూలు చేస్తున్న ఓలా,ఉబెర్, రాపిడో ఆటోలను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే తరహాలో హైదరాబాద్‌లోనూ ఆంక్షలు విధించి అడ్డగోలు చార్జీలను అరికట్టాలని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రధాన కార్యదర్శి బీటీ శ్రీనివాసన్ డిమాండ్ చేశారు. ఏళ్లు గడిచినా పత్తాలేని మీటర్లు గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటోరిక్షాలకు 2012లో మీటర్లను బిగించారు. మొదటి 1.6 కిలోమీటర్లకు రూ.20 , ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు రూ.11 చొప్పున రవాణాశాఖ చార్జీలను నిర్ణయించింది. ఆటోడ్రైవర్లు కచ్చితంగా ఈ నిబంధన పాటించాలి. నిబంధనలకు విరుద్ధంగా చార్జీలు వసూలు చేసే ఆటోలపైన ఆర్టీఏ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు అవకాశం ఉంది. కానీ మీటర్లు బిగించిన మొదటి ఏడాది కాలంలోనే డ్రైవర్లు ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. మీటర్లకు సీళ్లు వేయడంలో తూనికలు కొలతల శాఖ విఫలమైంది. మీటర్ రీడింగ్ లేకుండా ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేసే ఆటోరిక్షాలపైన ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆటోడ్రైవర్లు మీటర్ రీడింగ్‌ను పూర్తిగా గాలికి వదిలేసి అడ్డగోలు వసూళ్లకు దిగారు.మీటర్ రీడింగ్‌పైన చార్జీలు చెల్లించాలనుకొంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే నగరంలో ఏ ఒక్క ఆటోకు కూడా ఇప్పుడు మీటర్లు పని చేయడం లేదు. ‘మీటర్ వేయాలని అడిగితే దౌర్జన్యానికి దిగినంత పని చేస్తారు. వాళ్లు అడిగినంత ఇచ్చి రావడమే మంచిది.’ అని సీతాఫల్‌మండికి చెందిన కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. (క్లిక్: వనపర్తి–మంత్రాలయం మధ్య నేషనల్ హైవే!) -
లారీ డ్రైవర్‌పై పోలీసుల జులుం
సాక్షి, కృష్ణా : తిరువూరు ఆర్టీఓ చెక్‌పోస్టు వద్ద గుజరాత్ లారీ డ్రైవర్‌ను పోలీసు కానిస్టేబుళ్లు చితకబాదారు. డ్రైవర్ దగ్గర లారీలకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ చలనా కట్టాలని ఆర్టీఓ అధికారులు హెచ్చరించడంతో ఈ వివాదం తలెత్తింది. చలానా కట్టకుంటే అనుమతించేది లేదని ఆర్టీఓ సిబ్బంది లారీలను నిలిపివేశారు. కాగా లారీలు జాతీయ రహదారికి అడ్డంగా ఉన్నాయన్న కారణంతో ఆర్టీఓ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌పై విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో గుజరాతీ లారీ డ్రైవర్ తీవ్రంగా గాయాలపాలవడంతో అతన్ని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తనపై అనవసరంగా పోలీసులు దాడి చేసారంటూ డ్రైవర్ వారిపై ఫిర్యాదు చేశాడు. -
ప్రైవేట్ ట్యాక్సీలపై ఆర్టీవో కొరడా
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు * పీవీఎస్ఏ బ్యాడ్జీలు ఉన్న ట్యాక్సీలే తిరగాలని హుకుం * రేడియో ట్యాక్సీలకు సైతం బ్యాడ్జీలు తప్పనిసరి * త్వరలో ‘ట్యాక్సీ ఫర్ ష్యూర్’ ప్రారంభం సాక్షి, ముంబై: ఆర్టీవో అధికారులు వాహన నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ట్యాక్సీ డ్రైవర్లపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో నగరంలోని 27 శాతం ప్రైవేట్ ట్యాక్సీలు ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా రవాణా అధికారి ఒకరు మాట్లాడుతూ.. టూరిస్ట్ ట్యాక్సీలను నడిపేందుకు కావాల్సిన బ్యాడ్జీలు లేకపోవడంతో చాలా మంది డ్రైవర్లు సేవలకు దూరంగా ఉన్నారని తెలిపారు. ప్రతి డ్రైవరు పబ్లిక్ సర్వీస్ వెహికిల్ అథరైజేషన్ (పీవీఎస్ఏ) బ్యాడ్జీలను కలిగి ఉండాలన్నారు. రేడియో ట్యాక్సీలతోపాటు టూరిస్ట్ వాహన డ్రైవర్లు కూడా ఈ బ్యాడ్జీలను కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. తాము కొన్ని రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో దాదాపు వెయ్యి మంది డ్రైవర్లకు బ్యాడ్జీలు లేనట్లుగా గుర్తించామని, వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. అలాగే రేడియో ట్యాక్సీలు, టూరిస్టూ వాహనదారులకు కూడా బ్యాడ్జీలు లేని డ్రైవర్లకు వాహనాలు అప్పగించవద్దని రవాణా శాఖ నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. అదేవిధంగా క్యాబ్‌లలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా క్యాబ్ కంపెనీలను ఆదేశించామని చెప్పారు. క్యాబ్‌ల్లో జీపీఎస్ వ్యవస్థ, మొబైల్ యాప్స్‌లలో ఎస్ఓఎస్ బటన్ తదితర ప్రాథమిక భద్రతా చర్యలను క్యాబ్‌లలో అందుబాటులో ఉంచనట్లయితే సదరు కంపెనీలు వాహనాలను నడిపేందుకు లెసైన్సులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించామన్నారు. ఇటీవల రవాణా శాఖ కమిషనర్ మహేష్ జగాడే ట్యాక్సీ నిర్వాహకులతో ఓ సమావేశం నిర్వహించారు. ట్యాక్సీలలో భద్రతా పరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సదరు క్యాబ్‌లలో ఏదైనా నేరం జరిగితే దానికి కంపెనీయే జవాబుదారీ వహించాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా కంపెనీ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. దీంతో ‘మేరు ప్లస్’ కంపెనీ తమ ఐదు ట్యాక్సీల్లో ప్రయోగాత్మకంగా ‘ప్యానిక్ స్విచ్’లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా ‘ట్యాక్సీ ఫర్ ష్యూర్’ను కూడా ప్రారంభించనున్నట్లు ఆర్టీవో అధికారి పేర్కొన్నారు. ఈ వ్యవస్థతో ప్రయాణికులు పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు. ఇక్కడ స్విచ్ వేయడం ద్వారా జీపీఎప్ వ్యవస్థ ద్వారా కంట్రోల్ రూంలో ఉన్న పోలీసులకు సదరు డ్రైవరు పూర్తి వివరాలు, వాహనం ఏ ప్రాంతంలో ఉందో తెలుస్తుందని అధికారి తెలిపారు. నిర్భయ పథకం ద్వారా దీనిని వాహనాల్లో అమర్చనున్నట్లు అధికారి వివరించారు. -
చెయ్యి తడిపితే రైట్..రైట్!
ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడు గ్రామానికి చెందిన ఓ రైతు తాను పండించిన ధాన్యాన్ని ట్రాక్టర్లో తీసుకెళ్తున్నాడు.. ఇది ఆ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారి కంటపడింది. వెంటనే ట్రాక్టర్ ఆపిన సదరు అధికారి.. రైతు వద్ద అన్ని కాగితాలు, అనుమతులు ఉన్నా.. పట్టించుకోలేదు.. తాను సూచించిన ఏజెంట్ వద్దకు వెళ్లి మాట్లాడుకోపో.. అని చెప్పి సీరియస్‌గా వెళ్లిపోయారు.. ఆ తర్వాత రంగంలోకి దిగిన ఏజెంట్.. ‘ ఏదో కారణంతో నీపై కేసు పెట్టి బండిని సీజ్ చేస్తారు.. నా మాట విని రూ. 15 వేలు ఇస్తే సరే.. లేదంటే నీకే ఇబ్బంది..’ అని బెదిరించి డబ్బు వసూలు చేశాడు. ఇలా గుర్రాపాలు, ముదిగొండ, నేలకొండపల్లి, వైరా, పాల్వంచ.. ఏ ఊరైనా.. ఏ ప్రాంతమైనా అధికారుల లెక్కలు వారివే.. రైతుల వరి ధాన్యం లోడు, చిరు వ్యాపారుల ట్రాలీలు, ట్రక్కులు కన్పించిన అధికారులకు.. నిబంధనలకు విరుద్ధంగా వందల టన్నుల లోడు రవాణా అవుతున్నా ఎందుకు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భారీ లోడున్న వాహనాలు కన్పించవా..? ప్రభుత్వ నిబంధలనకు విరుద్ధంగా భారీ లోడుతో ఇసుక, గ్రానైట్ లారీలు వెళ్తుంటాయి. దీంతో తరచూ ప్రమాదాలతో పాటు రహదారులు సైతం మరమ్మతులకు గురవుతున్నాయి. వీరు చెల్లించే పన్నులు కూడా నామమాత్రమే. అయితే అధికారులకు నెలవారీ మామూళ్లు అప్పగిస్తే ఎంత లోడైనా దర్జాగా తీసుకెళ్లవచ్చని ఓ లారీ యజమానే చెప్పడం గమనార్హం. గ్రానైట్, ఇసుక తదితర లోడ్లతో జిల్లా నుంచి వేలాది వాహనాలు వెళ్తుంటాయి. వీటిలో అనుమతులు లేనివి కొన్నయితే... ఓవర్‌లోడుతో వెళ్తున్న వాహనాలు మరి కొన్ని ఉన్నాయి. నిత్యం వీటిని తనిఖీ చేసి తగిన జరిమానా విధిస్తేప్రభుత్వానికి భారీ ఆదా యం వచ్చేది. కానీ నెలనెలా మామూళ్ల మత్తులో ఉన్న రవాణ శాఖాధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో లారీలు అక్రమంగా జిల్లా నుంచి తరలివెళ్తున్నాయనే ప్రచారం జరుగుతోం ది. కరీంనగర్ నుంచి కాకినాడకు వెళ్లే గ్రానైట్ లా రీలు, భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళ్లే ఇసుక లారీల యజమానుల నుంచి అధికారులకు నెలకు ఒక్కో లారీ నుంచి రూ.2వేల నుంచి రూ.2,500 వరకు అందుతున్నాయని సమాచారం. తూతూమంత్రంగా తనిఖీలు... ప్రతిరోజు జిల్లా నుంచి ఓవర్‌లోడు, అనుమతి లేకుండా తరలి వెళ్తున్న లారీలను ఆర్టీవో అధికారులు తనిఖీ చేసి కేసు నమోదు చేయడంతోపాటు జరిమానా విధించాల్సి ఉంటుంది. ప్రతిరోజు సుమారు 100 నుంచి 150 లారీల వరకు జిల్లా మీదుగా వెళ్తున్నప్పటికీ అధికారులు మాత్రం తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. అరకొరగా కేసులు నమోదు చేసి మిగిలిన వారి నుంచి ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీవో అధికారులు మార్చిలో 89 లారీలు, ఏప్రిల్‌లో 78 లారీలపై మాత్రమే కేసులు నమోదు చేశారు. నాలుగు నెలల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన స్క్వాడ్ బృందం ఒకరోజే 30 నుంచి 40 లారీలపై కేసులు నమోదు చేసింది. అయితే మన అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్టీవో అధికారులు తనిఖీలు చేస్తున వైపు లారీలు వెళ్లడం లేదా... లారీలు వెళ్తున్న వైపు అధికారులు వెళ్లడం లేదా.. అనేది తెలియడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రైవేట్ సైన్యంతో వసూళ్లు... ఆర్టీవో అధికారులు నేరుగా మామూళ్లు వసూలు చేయకుండా వారికి అనువుగా ఉండే వారిని మధ్యవర్తులుగా నియమించుకుంటున్నారు. కార్యాలయంలో వీరిదే ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. సంబంధిత అధికారిని కలవాలన్నా ముందుగా మధ్యవర్తి అనుమతి తీసుకోవాల్సిందే. దీంతో ఎవరైనా అధికారులను కలుసుకోవాలంటే గగనమే అవుతోంది. మామూళ్లు ముట్టజెప్పిన లారీలను వదిలేస్తున్న అధికారులు... ఇవ్వని వాహనాల యజమానులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు. వాహనాలను తనిఖీ చేసేప్పుడు అన్ని కాగితాలు ఉన్నా ఏదో ఒక వంకతో కేసులు రాస్తున్నారని, ఈ కేసుల నుంచి బయటపడాలంటే మధ్యవర్తి ద్వారా అధికారికి ముడుపులు అందజేయాల్సిందేనని పలువురు వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ వసూళ్ల పర్వానికి తెరదించాలని కోరుతున్నారు.