సాక్షి, సిటీబ్యూరో: అది నగరంలో అత్యంత రద్దీ ఉండే రహదారి..మరో వైపు మిట్ట మధ్యాహ్నం. వందల మంది వచ్చిపోతున్నా..ఏ మాత్రం జంకని ఆ తండ్రిలో ఉన్మాదం ఒక్కసారిగా రెచ్చిపోయింది. పెళ్లి దుస్తులు తీసుకుందాం రమ్మని చెప్పిన తండ్రి.. కత్తితో వస్తాడని ఏ మాత్రం ఊహించని ఆ జంట అతి సులువుగా వేట కొడవలి దాడికి గురైంది. ఎర్రగడ్డలో బుధవారం మధ్యాహ్నం నవ దంపతులపై జరిగిన కత్తి దాడి సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మిర్యాలగూడలో ప్రణయ్ హత్యోదంతం మరువక ముందే నగరంలో అలాంటిదే మరో దాడి జరగడం చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే..తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురు మాధవి, అల్లుడి సందీప్‌లని అంతమెందించాలన్న లక్ష్యంతో మనోహరాచారి కొన్ని రోజులు ముందుగానే పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు అర్థమైందని ప్రత్యక్ష సాక్షులు, పోలీస్‌లు అంచనాకు వచ్చారు. బోరబండలో నివాసం ఉండే మనోహరాచారి, ఎస్సార్‌నగర్‌లో ఓ జ్యువెలరీ షాపులో పనిచేస్తున్నాడు. ముందుగానే కత్తిని కొనుగోలు చేసి తన బ్యాగులో దాచిన ఆయన బుధవారం ఉదయం షాపునకు వెళ్లి ఇంట్లో పని ఉందని యజమానికి చెప్పి బయటకు వచ్చాడు. అప్పటికే పెళ్లి బట్టలు కొందామని, ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ సమీపంలోని దుకాణాల్లో చౌకగా ఉండటంతో పాటు, నాణ్యతగా కూడా ఉంటాయని తన కూతురు, అల్లుడికి చెప్పి, అక్కడికి రావాలని సూచించాడు. వారి కంటే ముందుగానే ఎర్రగడ్డ పరిసరాల్లోకి వచ్చిన మనోహరాచారి అక్కడి బార్‌లో ఫుల్లుగా మందు తాగేశాడు.
మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో తాను చెప్పిన ప్రదేశానికి బిడ్డ, అల్లుడు వచ్చి ఫోన్ చేయటంతో అక్కడికి చేరుకున్న చారి బండి దిగుతూనే దాడికి తెగబడ్డాడు. ఈ సమయంలో హ్యుండై కారు షోరూంలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు దాడిని నిలువరించే యత్నం చేసినా..కత్తిని తిప్పుతూ హెచ్చరికలు చేశాడు. రహదారిపై వచ్చిపోయే వారు తమ వైపు రాకుండా చూసుకుంటూ బిడ్డ, అల్లుడిపై కత్తితో దాడి చేసిన వైనం ప్రత్యక్ష సాక్షుల్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. ఓ యువకుడు వెనక నుండి వచ్చి వీపుపై తన్నినా కూడా ఆయన తన ప్రయత్నాలి విరమించుకోకపోవటం ఆయనలోని ఉన్మాద తీవ్రతకు అద్దం పట్టిందని ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఆటో డ్రైవర్ రవీందర్ చెప్పారు. ఐతే దాడి అనంతరం తాము పట్టుకునే ప్రయత్నం చేసినా చాకచక్యంగా పారిపోయాడని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే దాడి అనంతరం కొన్ని నిమిషాల పాటు మాధవి రోడ్డుపైనే పడిఉండటంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఈ ప్రాంతమంతా రక్తంతో తడిసింది.
గతంలోనూ ఇలాంటి ఘటనలు...
2018 ఆగస్టు 23:
అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన ఎల్లంకి సురేష్, విజయలక్ష్మి 2014లో పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. భద్రాచలంలో ఉంటున్న వీరు సురేష్ తల్లి మృతి చెందడంతో అబ్దుల్లాపూర్‌మెట్ వచ్చారు. ఎప్పటి నుంచో కక్షకట్టి కాపుకాసిన విజయలక్ష్మి కుటుంబీకులు ఆమెపై దాడి చేసి హతమార్చారు. అప్పటికే వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉండగా... విజయలక్ష్మి ఏడు నెలల గర్భిణి.
2017 మే 2:
భువనగిరి నుంచి అదృశ్యమైన అంబోజు నరేష్ దారుణహత్యకు గురైనట్లు తేలింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్‌రెడ్డి మరో సమీప బంధువు నల్ల సత్తిరెడ్డితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. స్వాతి సైతం అదే నెల 16న తన పుట్టింట్లో బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
2007 జూలై 24:
బోరబండకు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ గీతను ప్రేమ వివాహం చేసుకున్న సంగమేశ్వర్ హఠాత్తుగా అదృశ్యమై హతమయ్యాడు. ఈ కేసును ఛేదించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు గీత సోదరుడు వి.వెంకటేశ్వర్‌రెడ్డి చేయించిన కిరాయి హత్యగా తేల్చారు. రూ.6.5 లక్షలకు సుపారీ ఇచ్చిన ఇతగాడు మరో ఐదుగురితో చంపించాడు.
ఇవి కేవలం సంచలనం సృష్టించిన ఘటనల్లో కొన్ని మాత్రమే. పెద్దగా ప్రాచుర్యం పొందని దారుణాలు సిటీతో పాటు శివార్లలోనూ అనేకం చోటు చేసుకున్నాయి.
ఒక వేదిక అవసరం
ప్రేమ పెళ్లిళ్లు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య నెలకొనే వైరుధ్యాలను, ఘర్షణలను పరిష్కరించుకొనేందుకు కుల,మతాలకు, రాజకీయాలకు అతీతమైన ఒక శాస్త్రీయమైన వేదిక ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. పరువు హత్యలు చాలా కాలంగా జరుగుతున్నాయి. ఒక్క ఇండియాలోనే కాదు, కొన్ని ఆసియా దేశాల్లోనూ పిల్లల సొంత అభిప్రాయాలను జీర్ణించుకోలేకపోవడం, తమకు ఇష్టం లేని వాళ్లతో సహజీవనం చేస్తే సహించలేకపోవడం వంటివి కనిపిస్తున్నాయి.ప్రజాస్వామిక వాతావరణంలో, మానసిక నిపుణులు, సామాజికవేత్తల పర్యవేక్షణలో ఇటువంటి ఘర్షణలకు పరిష్కారాలను వెదకవలసి ఉంది.
– డాక్టర్ వీరేంద్ర, మానసిక నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment